
మేమే దొరికామా?
• వాళ్లంతా ఖాళీగా కూర్చున్నారు..
• వెళ్లండి... తహసీల్దార్‌ను కలువుపో..
• ప్రజావాణిలో ఫిర్యాదుదారులపై
• అధికారుల ఛీత్కారాలు, కసిరింపులు
• వినతులు స్వీకరించకుండా వెనక్కి పంపించిన అధికారులు
ఇదీ..సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదులు అందజేసేందుకు వచ్చిన బాధితులతో అధికారులు వ్యవహరించిన తీరు.
సార్... మా పట్టా భూమిలో కడీలు పాతితే రెవెన్యూ అధికారులొచ్చి ప్రభుత్వ భూమి అంటూ వాటిని తొలగిస్తున్నారు... నాకు భర్త లేడు... పిల్లలున్నారు... నాకున్నది గదొక్కటే ఆధారం సార్... దయచేసి రెవెన్యూ వాళ్లకు చెప్పండి సార్.’’ అప్పన్నపల్లికి చెందిన పద్మమ్మ వినతి.
అధికారి : అయితే మేమేం చేయాలి...
వెళ్లక్కడ ... మిషన్ కాకతీయ పనులకు ఇబ్బందిగా మారింది. కడీలెలా పాతుతవు. పో... తహసీల్దార్ వద్దకెళ్లు...
పద్మమ్మ : నాకు పట్టా ఉంది సారూ.... నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు. నా భూమిలో
నాకు హక్కులేదా...?
అధికారి : వెళ్లిపోవమ్మా.. మీ తహసీల్దార్ వద్దకెళ్లు. అన్నీ చెబుతారు..
మరో ఫిర్యాదుదారు–దళితులం సార్... భూపంపిణీ పథకంలో సాగు చేసుకునేందుకు భూమి ఇప్పించండి... పుణ్యమొస్తది.
అధికారి : అమ్మా... ఎక్కడైనా రూ.4 లక్షలకు ఎకరా అమ్మితే చూడు. దానిని కచ్చితంగా ఇప్పిస్తా. అమ్మేవారుంటే నా దగ్గరకు తీసుకురా.
‘‘సారూ...భర్త నన్ను 5 సంవత్సరాల క్రితం వదిలేశాడు. మా తల్లిగారింటి వద్దనే ఉంటూ పిల్లలను చదివిస్తున్నా. పిల్లలు పెద్దయ్యారు. ఆస్తిని మా అత్త తన కూతురి పేరుమీద చేసింది. మాకు హక్కు దక్కే విధంగా చూడండి సారూ.అంటూ కోయిలకొండ మండలం సూరారం గ్రామానికి చెందిన నిర్మలమ్మ అధికారులను వేడుకుంది.
అధికారి : మేమేం చేయాలమ్మా... పో వెళ్లి కోర్టులో కేసు పెట్టుకోపో...
ఇంకో ఫిర్యాదుదారు : సార్.... నాకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇప్పించండి. మా ఊర్లో ఇండ్లోచ్చాయిని చెబుతున్నారు. ఇల్లు మంజూరు చేసి ఆదుకోండి సార్.
అధికారి : మీ తహసీల్దార్‌ను కలువు పోమ్మా....ఇక్కడ మేమేం చేయలేం.
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : అధికారుల ఛీత్కరింపులతో బాధితులు ప్రజావాణిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సెలవులో ఉండడంతో ఆయన హాజరుకాలేదు. అయితే సమస్యలను సావధానంగా వినాల్సిన మిగతా అధికారులు కసురుకోవడం, చీదరించుకోవడం మూలంగా ప్రజావాణి ఉద్దేశం నీరుగారుతోంది. అధికారులు సమస్యలను వినకుండా వెనక్కి పంపడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల పునర్విభజన అనంతరం ఫిర్యాదుల పరిష్కారం వేగం పుంజుకోవడం, అధికారులనుంచి మంచి స్పందన రావడంతో ప్రజావాణికి తాకిడి పెరిగింది. ప్రజల స్పందనకనుగుణంగా ప్రజావాణిని గతంలో మాదిరి కాకుండా ఇంకా మెరుగైన స్థాయిలో నిర్వహించాలని వీడియో కాన్ఫరెన్సు, హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. మార్పులకనుగుణంగా అధికారులనుంచి స్పందన కరువవడంతో ప్రజావాణి విశ్వసనీయతను కోల్పోతోందని పలువురు ఆరోపిస్తున్నారు.
భోజనం చేసి తిరుగుపయనం
దూరప్రాంతాలనుంచి బాధితులు ప్రజావాణిలో ఆలస్యమవుతుందన్న ఆలోచనతో వెంట టిఫిన్‌బాక్సులు తెచ్చుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌కు సుమారు మూడు వందల మంది వచ్చారు. కానీ వచ్చిన వినతులు, ఫిర్యాదులు 141 మాత్రమే. మిగతావారిని ‘మీ తహసీల్దార్‌ను కలవండని చెప్పడంతో వారు కలెక్టరేట్‌లోని చెట్లకింద వెంటతెచ్చుకున్న టిఫిన్‌బాక్సుల్లోని భోజనం చేసి తిరుగుపయనమయ్యారు.
‘చిన్న జిల్లాలో ప్రజా సమస్యల సత్వర పరిష్కారం ప్రభుత్వ బాధ్యత. ప్రజలు వారి సమస్యలను అధికారులకు వివరించి పరిష్కరించుకునేందుకు ఉద్దేశించిన ప్రజావాణిని ఇకనుంచి ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తాం. పారదర్శకత, శాశ్వత పరిష్కారాలు చూపాలనే ఉద్దేశంతో ప్రజావాణిలో వీడియో కాన్ఫరెన్సు ఏర్పాటు చేశాం. ప్రజావాణికి ఫిర్యాదుదారులు జిల్లా నలుమూలలనుంచి సమస్యలతో వస్తారు. వారికోసం జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి ఉచితంగా ఫిర్యాదులు రాసిచ్చే చర్యలు తీసుకుంటున్నాం. ప్రజావాణిలో ఇచ్చే ఫిర్యాదుకు వాస్తవ పరిష్కారం చూపాలనేది ఉద్దేశం.’’ గతంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల్లో కలెక్టర్ రొనాల్డ్‌రోస్ చెప్పిన మాటలు.
సోమవారం జిల్లా రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారుల తీరు అందుకు భిన్నంగా ఉంది. ఆపదలో, పుట్టెడు ఆవేదనను కడుపులో నింపుకొని అధికారులకు ఫిర్యాదు సమర్పించి కన్నీళ్లు పెట్టుకున్న వారిని ‘కాదు పొమ్మని’ కసురుకుంటున్న పరిస్థితి. మండలాల్లో వారంతా ‘‘ఖాళీగా కూర్చున్నారు... మేమే దొరికామా... ప్రతివారం ఇదే పనిగా వస్తున్నారు..? వెళ్లండి మీ తహసీల్దార్‌ను కలవండి పోండి’ అంటూ అధికారులు కసరుకోవడంతో ఫిర్యాదుదారులు విధిలేక వెనుదిరిగారు. మండలాల్లో పట్టించుకోకపోవడంతో ఇక్కడికి వస్తే ‘ఈ ఛీత్కారాలేమిటీ.. అధికారులు చెప్పేదొకటి, జరుగుతున్నదొకటని’ అంటూ ఫిర్యాదుదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.