విశాఖ రూరల్ , న్యూస్‌లైన్: ‘జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోంది. అటువంటి విశాఖలో అన్ని రకాల సౌకర్యాలు, వసతులు ఉండాలి. ఇతర రాష్ట్రాలు, దేశాలపై ఆధారపడే అవకాశం ఉండకూదు. ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించి అందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేస్తాం’ అని కొత్త కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ వెల్లడించారు. తన చాంబర్‌లో శుక్రవారం మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడారు. గత కలెక్టర్ శేషాద్రి అమలు చేసిన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు.
అన్ని రంగాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. నెల రోజుల్లో అన్ని అంశాలపై దృష్టి సారించి అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. డయల్ యువర్ కలెక్టర్, ప్రజావాణి, వంద రోజుల ప్రణాళిక ఇలా అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకువెళతామన్నారు. చిత్తూరు జిల్లాలో ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో పొందుపరిచే సాఫ్ట్‌వేర్ ఉండడంతో వాటిని సంబంధిత అధికారులు పరిశీలించడం, అలాగే ఆ ఫిర్యాదులు ఏ స్థాయిలో ఉన్నాయో ఫిర్యాదుదారులకు తెలుసుకొనే అవకాశముందన్నారు. ప్రస్తుతం జిల్లా లో ప్రజావాణి దరఖాస్తుల వివరాలను కం ప్యూటర్‌లో పొందుపరుస్తున్నారని, మరింత సరళీకృతం చేయడానికి గల అవకాశాలను అధికారులతో చర్చిస్తామన్నారు.
వర్షాభావ పరిస్థితులపై నివేదిక
జిల్లాలో వర్షాలు లేకపోవడంతో కరువు ఛాయ లు ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. మూడు మండలాల్లో మినహా ఇతర ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జిల్లాలో 50 శాతానికి పైగా వ్యవసాయం వర్షాలపై ఆధారపడి ఉందన్నారు. ఈ వర్షాభావ పరిస్థితులపై సెప్టెంబర్ తర్వాత నివేదిక తయారు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. ప్రత్యామ్నాయ పం టలకు సంబంధించి విత్తనాలు సిద్ధంగా ఉన్నా ప్రస్తుతం వర్షాలు లేని సమయంలో అవి వేసినా ఫలితముండదని వ్యవసాయాధికారులు చెబుతున్నట్టు చెప్పారు. వర్షాలు కురుస్తున్న సమయంలో వాటిని పంపిణీకి అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు.
పంట రుణాలపై దృష్టి
రె తులకు పంట రుణాలు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయ రుణాలతో పాటు వ్యవసాయేతర రుణాలను కూడా రుణ లక్ష్యంలో చూపిస్తుండడంతో కొందరు రైతులకు మేలు జరగడం లేదన్నారు. దీనిపై త్వరలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి కేవలం వ్యవసాయ రుణాలను లక్ష్యంగా చేసుకొని స్పష్టమైన నివేదికలు తయారు చేయమని సూచిస్తామన్నారు.
ప్రమాదాల నియంత్రణకు చర్యలు అవసరం
జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న విశాఖ జిల్లా భద్రతకు సంబంధిం చి ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రమాదాలు సంభవించిన సమయాల్లో కూడా చికిత్సల కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడకుండా జిల్లాలోనే అత్యాధునిక వైద్య సదుపాయాలను కల్పించుకోవాల్సిన అవసరముందని చెప్పారు.
నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి
జిల్లాలో పరిశ్రమల స్థాపనకు భూములు అప్పగించి నిర్వాసితులైన వారి సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని కలెక్టర్ చెప్పారు. వారి జీవనోపాధికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితులతో పాటు కాలుష్యంపై అధికారులతో సమావేశమై అనంతరం నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
పటిష్టంగా ఉపాధి హామీ
జిల్లాలో ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చే సేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు కారణంగా వ్యవసాయ పనులు లేవని, ఈ తరుణంలో కూలీలకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా అందరికీ పనులు కల్పించే విషయంపై త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. కూలీల జీతాల చెల్లింపులకు చేతి వేలి ముద్రల నమోదు కారణంగా కాస్త జాప్యం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం రూ.20 కోట్లు విడుదలైనట్లు డుమా అధికారులు తెలిపారని, కానీ వాటి చెల్లింపుల్లో కాస్త జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోందన్నారు. త్వరలోనే ఆ సమస్యలను అధిగమించి వేతనాల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూస్తామని తెలిపారు.