Solomon arokhyaraj
-
రేపటి నగరాలను నిర్మించేదెలా?
ప్రపంచవ్యాప్తంగా జీడీపీలో దాదాపు 80 శాతం వాటా సమకూరుస్తూ నగరాలు ప్రధాన ఆదాయ సముపార్జన కేంద్రాలుగా మారుతున్నాయి. భారతదేశంలో కూడా ఇందుకు భిన్నమైన పరిస్థితులు లేవు. దేశంలోని ముంబై, ఢిల్లీ వంటి నగరాలు ప్రపంచంలోని కొన్ని దేశాల కంటే అధికంగా జీడీపీని సమకూరుస్తున్నాయి. మన నగరాలను అభివృద్ధి పథంలో నిలపడానికి కొత్తగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంతోపాటు ఇప్పటికే ఉన్న సదుపాయాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. పట్టణ మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడంలో ప్రభుత్వాలకున్న పరిమితుల దృష్ట్యా ప్రైవేటు పెట్టుబడులను సమీకరించడం నేడు అనివార్యంగా మారింది. విశాఖపట్నం లాంటి నగరాలు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవడానికి వినూత్న ఆదాయ నమూనాలను విజయవంతంగా వినియోగించుకుంటున్నాయి. 2036 నాటికి భారతదేశంలోని నగరాల్లో నివసించే జనాభా 60 కోట్లకు చేరుకుంటుందని ఒక అంచనా. ఈ స్థాయిలో జనాభా పెరుగుదల మంచి అవకాశాలను సృష్టించడంతో పాటు లక్షలాది మంది జనాభాకు అనుగుణంగా పౌర సేవలు విస్తరించడం, పౌరులకు మెరుగైన జీవనానికి అనువైన పరిస్థితులను కల్పించడం ప్రభుత్వానికి ఒక సవాలు కానుంది. అందువల్ల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పట్టణ మౌలిక సదుపాయాలను సిద్ధం చేయడానికి మనం గణనీయంగా వనరులను కేటాయించాల్సిన అవసరం ఉంది. ఈ అవసరాన్ని గుర్తించిన భారత జీ20 అధ్యక్షత ‘ఫైనాన్సింగ్ సిటీస్ టుమారో: సస్టెయినబుల్, ఇంక్లూజివ్ అండ్ రజిలెంట్’ అనే థీమ్‌ను ఎంపిక చేసుకుంది. అందుకనుగుణంగా నగరాల్లో స్థిరమైన మౌలిక సదుపాయాల పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య పరస్పర అవగాహనను పెంపొందించడానికి న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ పేరుతో ‘ఫైనాన్సింగ్ సిటీస్ ఆఫ్ టుమారో’ ఆవిర్భావానికి కొన్ని సూత్రాలను ఆమోదించారు. పట్టణ మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడంలో ప్రభు త్వాలకున్న పరిమితుల దృష్ట్యా ప్రైవేటు పెట్టుబడులను సమీకరించడం నేడు అనివార్యంగా మారింది. ఇందుకనుగుణంగా స్థిరమైన, సమ్మిళిత మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చు కోవడానికి నగరాలకు మార్గనిర్దేశం చేసే విధంగా భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 కొన్ని నివేదికలను ప్రకటించింది. ఈ వ్యూహంలో పట్టణ ప్రణాళిక సంస్కరణలు, సొంత ఆదాయ వనరులను పెంచుకోవడం, పెట్టు బడి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, నగరాల రుణ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం, గ్రీన్, సోషల్ మరియు సస్టెయినబుల్ బాండ్లు వంటి వినూత్న ఫైనాన్సింగ్ సాధనాలను ఉపయోగించుకుని స్థిరమైన పెట్టుబడి ప్రాజెక్టులను నిర్విరామంగా సాధించడం, నియంత్రణా వాతావరణాన్ని అందుబాటులో ఉంచడం, ఏఐ, సామర్థ్యాల పెంపు, సంస్థాగత సంసిద్ధత వంటి సాధనాలను ఉపయోగించు కోవడం వంటివి ప్రధానాంశాలుగా ఉన్నాయి. భారతదేశంలోని అనేక నగరాలు వినూత్న ఆదాయ వనరుల సృష్టి, పెట్టుబడి అవకాశాలు సుసాధ్యమని నిరూపించాయి. మధ్య ప్రదేశ్‌లోని రేవా మునిసిపల్ కార్పొరేషన్ (ఆర్ఎంసీ) మౌలిక సదు పాయాల కోసం సగటున ఏటా రూ. 350 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇందులో కేవలం 34 శాతం మాత్రమే మున్సిపాలిటీ సొంత ఆదాయ వనరుల నుండి వస్తుంటే, మిగిలినది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వివిధ పథకాలు మరియు గ్రాంట్ల ద్వారా సమకూరుతోంది. మౌలిక వసతులకు సొంత ఆదాయం నుండి ఇంత తక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నప్పటికీ, పట్టణ భూభాగపు రీ–డెన్సిఫికేషన్ ఆధారంగా వ్యూహ్మాత్మక పట్టణ ప్రణాళికతో న్యూ రేవా బస్ స్టాండ్ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పీపీపీ(ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) విధానం ద్వారా విజయవంతంగా అమలు చేసింది. న్యూ రేవా బస్ స్టాండ్ ప్రాజెక్టులో 3.5 ఎకరాల ఖాళీ ప్రదేశాన్ని వాణిజ్య సము దాయంతో కూడిన బస్ స్టాండ్‌గా తీర్చిదిద్దడం ద్వారా, మున్సిపా లిటీకి రూ. 10.5 కోట్ల ప్రీమియంతో పాటు, ఏడాదికి రూ. 35 లక్షల అద్దె లభిస్తోంది. భారతదేశంలోని ఇతర నగరాలు కూడా పట్టణ మౌలిక సదు పాయాలను అభివృద్ధి చేసుకోవడానికి వినూత్న ఆదాయ నమూనా లను విజయవంతంగా వినియోగించుకుంటున్నాయి. గ్రేటర్ విశాఖ పట్నం మున్సిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) వ్యర్థ జలాలను శుద్ధి చేసి ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో పరిశ్రమల వినియోగానికి నీటిని సరఫరా చేయడం ద్వారా ఏటా సుమారు రూ. 30 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రాజెక్టు నిధుల కోసం జీవీఎంసీ పన్నుల వసూళ్లు, సేవా పంపిణీ ప్రమాణాలను స్థిరంగా ప్రదర్శించడం ద్వారా రుణ అర్హతలను మెరుగుపరుచుకుని ‘ఏఏ’ క్రెడిట్ రేటింగ్‌ను సాధించింది. అదే విధంగా సూరత్ నగరం కూడా పారిశ్రామిక పునర్వి నియోగం కోసం శుద్ధి చేసిన వ్యర్థ నీటిని విక్రయించడం ద్వారా 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.140 కోట్ల కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంది. స్థిరమైన ఆర్థిక వనరుల సేకరణలో పేరుగాంచిన ఘజియాబాద్ భారతదేశంలో రూ. 150 కోట్ల మున్సిపల్ గ్రీన్ బాండ్లను విడుదల చేసిన మొదటి యూఎల్బీ (అర్బన్ లోకల్ బాడీ)గా నిలిచింది. మెరుగైన పట్టణ ప్రణాళిక, వినూత్న ఆర్థిక నమూనాల ద్వారా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకుని తమ పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి చిన్న నగరాలు కూడా ప్రైవేటు పెట్టుబడిదారులను ఆకర్షించ గలవని పైన పేర్కొన్నవి ఉదాహరణగా నిలుస్తున్నాయి. జీ20 వెలువరించిన పత్రాలు నాణ్య మైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవడానికి మన నగరాలకు మార్గ దర్శకంగా ఉపయోగపడుతుంటే, భారత దేశ అనుభవాలు ప్రపంచ మౌలిక సదు పాయాల ఎజెండాను నిర్దేశించడానికి ఇతోధికంగా దోహదపడుతున్నాయి. అటల్ మిషన్ ఫర్ రీజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ (అమృత్), స్మార్ట్ సిటీస్ మిషన్, హౌసింగ్ ఫర్ ఆల్ (పీఎంఎవై), మెట్రో రైల్ ప్రాజెక్టులు, ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్, స్మార్ట్ సిటీ మిషన్ లో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్లు, వివిధ నగరాలు జారీ చేసిన మునిసిపల్ బాండ్లు, 2018లో రూపొందించిన భారతదేశ నేషనల్ అర్బన్ పాలసీ ఫ్రేమ్‌వర్క్ (ఎన్యూపీఎఫ్) అమలు నుండి నేర్చుకున్న పాఠాలు... గ్రూపు ఆలోచనలను సుసంపన్నం చేశాయి. అలాగే వాటిని పరస్పరం పంచుకోవడం వివిధ దశలలో అభివృద్ధిలో ఉన్న నగరాల ఆకాంక్షలకు అనుగుణంగా సుస్థిర ఆర్థిక వనరుల సమీకరణకు ఇతర మార్గాలను ఉపయోగించుకునేందుకు మార్గదర్శకంగా నిలిచాయి. సుస్థిర ఆర్థిక వనరుల సమీకరణకు ఇతర మార్గాలను ఉపయోగించుకునే దిశగా ముందుకు వెళ్లడానికి భారతీయ నగరాలు తమ సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, డిజిటైజ్డ్ అకౌంటింగ్ వ్యవస్థను అవలంబించడం, పెట్టుబడి పెట్టదగిన ప్రాజెక్టుల పైప్ లైన్‌ను కలిగి ఉండటం, వాటి విశ్వసనీయత, ఆదాయ సేకరణ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం అత్యవసరం. పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వైపు ప్రైవేట్ మూలధనాన్ని ఆకర్షించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడంలో ఈ పరివర్తన కీలకం. సోలమన్ ఆరోక్యరాజ్ వ్యాసకర్త జాయింట్ సెక్రటరీ, కేంద్ర ఆర్థిక శాఖ, భారత ప్రభుత్వం (వ్యాసంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం) -
వర్షాఘాతం..
=1923 తరువాత రికార్డు స్థాయి వర్షపాతం =జిల్లాలో రూ.11.5కోట్ల పంట నష్టం =అధికారుల ప్రాథమిక అంచనా =తెరిపిస్తేనే సమగ్రంగా లెక్క రైతుకు తీరని కష్టమొచ్చి పడింది. తెరిపివ్వని వర్షాలతో వేలాది ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. మబ్బుపట్టిన వాతావరణం, చల్లని గాలులతో తెగుళ్లు విజృంభిస్తున్నాయి. ఇంతకాలం వర్షాభావ పరిస్థితులు, ఎరువులు తెచ్చిన కష్టంతో కుమిలిపోతున్న అన్నదాతకు ఈ పరిస్థితి మింగుడు పడడం లేదు. కళ్లముందు కొట్టుకుపోతున్న పంటను చూసి లబోదిబోమంటున్నాడు. వరిపైరు పొట్ట, పాలుపోసుకునే దశలో ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉంటే నష్టం పెరుగుతుందని భయపడుతున్నారు. విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ఎడతెరిపిలేకుండా ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జిల్లాను వణికిస్తున్నాయి. జలాశయాలు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలు నీట మునిగాయి. చెరువులు, పంటలు ఏకమయ్యాయి. వాగులకు గండ్లు పడుతున్నాయి. వరద ఉధృతికి రోడ్లు కొట్టుకుపోయాయి. సమీప గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. జిల్లాలో 29,905.5 ఎకరాల్లో పంట ముంపునకు గురయినట్టు అధికారుల అంచనా. ఈమేరకు సుమారు రూ.11.5కోట్ల మేర నష్టం వాటిల్లి ఉండొచ్చని లెక్క కట్టారు. వానలు తెరిపిస్తే తప్ప కచ్చితమైన లెక్క తేలే అవకాశం లేదంటున్నారు. 90 ఏళ్లు తరువాత జిల్లాలో మూడు రోజుల్లో దాదాపుగా 25 సెం.మీ. మేర పడిన వర్షం భారీ నష్టాన్నే తెచ్చిపెట్టింది. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేల ఎకరాల పంట నీట మునిగింది. 1923లో మూడున్నర రోజుల పాటు 25 సెం.మీ. వర్షం కురిసింది. ఇప్పుడు అదే స్థాయిలో 24.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 27 మండలాల్లో తీవ్ర ప్రభావం జిల్లాలో 27 మండలాల్లో 52 గ్రామాలు వర్ష ప్రభావానికి గురయ్యాయి. 20 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. 15 వేల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 19 మండలాల్లో 29,905.5 ఎకరాల్లో పంట నీటిపాలైంది. ఈ వర్షాలకు మొత్తంగా 170.22 కిలోమీటర్ల మేర రోడ్లు పాడైనట్లు ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. నాలుగు చోట్ల భారీ చెట్లు నెలకొరిగాయి. ఈ రోడ్లను తాత్కాలికంగా వేయడానికే రూ.5.01 కోట్లు ఖర్చవుతుందని ఆర్అండ్బీ అధికారులు అంచనా వేస్తున్నారు. అదే పూర్తి స్థాయిలో నిర్మించాలంటే రూ.39.33 కోట్లు అవసరమని చెబుతున్నారు. చిన్న నీటి పారుదల శాఖ ప్రాజెక్టులు 76 వరకు దెబ్బతినడంతో రూ.5.12 కోట్లు నష్టం వాటిల్లింది. అదే విధంగా 12 గ్రామాల్లో విద్యుత్ సమస్యలు ఏర్పడ్డాయి. జిల్లాలో 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఒకటి దెబ్బతినడంతో పాటు 29 విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. అలాగే 3.1 కిలోమీటర్ల మేర హెచ్‌టీ/ఎల్టీ లైన్స్, ఎల్టీ పోల్స్ 129 పాడయ్యాయి. దీంతో ఏపీట్రాన్స్కోకు రూ.1.22 కోట్లు నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. రైవాడతోనే భయం జిల్లాలో పెద్దేరు నుంచి 4500, కోనాం నుంచి 900 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. తాటిపూడి రిజర్వాయర్‌కు కూడా ఇన్‌ఫ్లో పెరగడంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి 100 క్యూసెక్కుల నీటిని వదలుతున్నారు. ఇదిలా ఉంటే రైవాడ విషయంలో మాత్రం అధికారులు కొంత ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి రైవాడ నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదలుతున్నారు. ఒకవేళ ఏజెన్సీలో భారీ వర్షాలు పడితే భారీగా నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే శారదా నదికి వరద నీరు చేరి కిందనున్న గ్రామాలు నీట మునిగే ప్రమాదముందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతున్నారు. 10 నేవీ బృందాలు సిద్ధం విపత్కర పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో నేవీ సహాయం తీసుకోవాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే నేవీ అధికారులతో ఈ విషయంపై చర్చించారు. అవసరమైతే బృందాలను పంపించాలని సమాచారం అందించారు. దీంతో 10 నేవీ బృందాలు, ఒక్కో దానిలో నలుగురు సభ్యులు చొప్పున సిబ్బంది సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారు. పశువుల దాణాకు ప్రతిపాదనలు వర్షాలు కారణంగా కొన్ని గ్రామాలు నీట మునగడంతో పశువులకు దాణా కొరత ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని పశువులు ఉన్నాయో గణాంకాలు సేకరించారు. ప్రసుత్తం ఆరు గ్రామాలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 40 టన్నుల దానా కోసం పశు సంవర్ధక శాఖ అధికారులు ఇండెంట్ పెట్టారు. డిమాండ్‌ను బట్టి ఇండెంట్‌ను పెంచుతామని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు. కలెక్టర్‌కు సీఎస్ ఫోన్ జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి శుక్రవారం ఉదయం కూడా ఫోన్ చేసి జిల్లాలో పరిస్థితులపై ఆరా తీశారు. అత్యవసర సహాయక చర్యలకు నేవీ బృందాలు సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ సీఎస్‌కు వివరించారు. అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నేడు మంత్రి గంటా సమీక్ష జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు ఢిల్లీ నుంచి జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్‌కు ఫోన్ చేసి జిల్లాలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జలాశయాల నుంచి నీటిని విడుదల చేయడం, తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ మంత్రికి వివరించారు. శనివారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీ నుంచి విశాఖ వచ్చి జిల్లా కలెక్టరేట్లో అధికారులతో వర్షాలపై సమీక్ష నిర్వహించనున్నారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం యలమంచిలి మండలం లైనుకొత్తూరు వద్ద కన్నయ్య చెరువు నిండి రైలు పట్టాలపైకి నీరు రావడంతో గంటసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. యలమంచిలి, రేగుపాలెం, తుని, గుల్లిపాడు, అనకాపల్లి స్టేషన్లలో పలు రైళ్లను నిలిపివేశారు. రైల్వే సిబ్బంది కన్నయ్య చెరువుకు పొక్లెయినర్‌తో గండికొట్టారు. నీరు బయటకు పోయాక రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. గెడ్డలో కొట్టుకుపోయి బాలింత మృతి జి.మాడుగుల: మండలంలోని సొలభం పంచాయతీ వనభరంగిపాడు గ్రామానికి చెందిన ఆదిమజాతి గిరిజన బా లింత(30) దుస్తులు ఉతుకుతుండగా గెడ్డ ప్రవాహనికి కొట్టుకొనిపోయి మృతి చెందింది. గ్రామానికి చెందిన వంతాల దసాయి(30) వారం రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. గురువారం ఉదయం దుస్తులు ఉతకడానికి సమీపంలోని గెడ్డకు వెళ్లింది. వరద ఉధృతికి కొట్టుకొని పోయింది. సాయంత్రమైనా ఇంటికి రాకపోవటంతో గ్రామస్తులు వెదకగా కొంతదూరంలో మృతదేహం కనిపించింది. -
విరుచుకుపడ్డ విష జ్వరం
=బరియకల్‌లో టైఫాయిడ్ జోరు =మూడుకు చేరిన మృతుల సంఖ్య =మరో 8 మంది పరిస్థితి విషమం గ్రామాన్ని సందర్శించిన = వైద్య అధికారి నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు డుంబ్రిగుడ, న్యూస్‌లైన్ : విషజ్వరం విజృంభించడంతో ఆరు రోజుల వ్యవధిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మండలంలోని కిల్లోగుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కొర్రాయి పంచాయతీ పరిధిలోని బరియకాల్ ఆదిమజాతి గిరిజన తెగ (పీటీజీ)కు చెందిన గ్రామంలో భయంకరమైన విషజ్వరం ఫలితంగా ఐదు రోజుల్లో ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. బుధవారం కిల్లో పూజారి (50) అనే గిరిజనుడు ప్రాణాలు కోల్పోయాడు. అనారోగ్యానికి గురై మంచం పట్టిన మరో ఎనిమిది మంది వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సకాలంలో చికిత్సకు నోచుకోక అవస్థలు పడుతున్నారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బరియకాల్ గ్రామంలో విషజ్వరం ఉధృతంగా వ్యాపిస్తున్నా వైద్య సిబ్బంది ఏమాత్రం పట్టించుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. దాంతో రోజు తప్పించి రోజు ఒక్కో గిరిజనుడు వంతున మరణిస్తున్నారు. మరెందరో తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ప్రబలిన టైఫాయిడ్ బరియకాల్‌లో వ్యాధుల బారిన పడ్డ గిరిజనులకు రక్తపరీక్షలు జరపగా, ఇది టైఫాయిడ్‌గా నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అదనపు వైద్యాధికారి స్వప్నకుమారి చెప్పారు. ‘పీడిస్తున్న జ్వరాలు’ అనే శీర్షికతో ఈనెల 22న ‘సాక్షి’లో వెలువడ్డ వార్తకు స్పందించిన ఆమె బుధవారం డుంబ్రిగుడ మండల కేంద్రానికి వచ్చారు. గ్రామంలో ముగ్గురు మృతి చెంది అనేక మంది మంచం పట్టిన నేపథ్యంలో ఆమె బరియకల్‌లో పర్యటించారు. టైఫాయిడ్ చె లరేగి ముగ్గురు మృతి చెందినా వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆమె మండిపడ్డారు. వైద్యసిబ్బందిపై కఠిన చర్యలు టైఫాయిడ్ తీవ్ర స్థాయిలో వ్యాపించడానికి నీటి కాలుష్యం కారణమవుతుందని, అపరిశుభ్రత వల్ల కూడా విషజ్వరం వ్యాపిస్తుందని స్వప్నకుమారి చెప్పారు. గ్రామంలో బాధ్యతలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది సకాలంలో చికిత్స అందించడంలో విఫలమయ్యారని చెప్పారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, దీనిని కొనసాగిస్తామని తెలిపారు. బాధితులను వైద్య చిత్సల కోసం అరకు ఏరియా ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అనంతరం ఆమె డుంబ్రిగుడ పీహెచ్‌సీని సందర్శించి రికార్డులను పరిశీలించారు. వైద్య సిబ్బంది విధి నిర్వహణ తీరును గమనించిన ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వెంట కిల్లోగుడ వైద్య అధికారి రవికుమార్,హెల్త్ సూపర్వైజర్ బి.లక్ష్మణరావు తదితరులు ఉన్నారు. ఊటగెడ్డ జలాలు కారణం? బరియకాల్ చేరువలోని ఊట గెడ్డ నీటినే గిరిజనులు తాగుతున్నారు. విషజ్వరం వ్యాపించడానికి ఈ కలుషిత జలాలు కారణమై ఉండవచ్చన్న అభిప్రాయం వినవస్తోంది. -
లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల జిల్లాలోని రిజర్వాయర్లు నిండుతున్నాయని, వాటి సామర్థ్యం మించితే గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని అధికారులను కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్దేరు జలాశయం నుంచి నీరు వదులుతున్నారని, బుధవారం అర్ధరాత్రి రైవాడ జలాశయం నుంచి నీటిని వదులుతారని ఈ విషయాన్ని 6 గంటల ముందుగానే మండల స్థాయి అధికారులకు తెలియజేస్తున్నారని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నదీ పరివాహక ప్రాం తాల్లో వరదగట్టులను నిరంతరం పర్యవేక్షించుకోవాలని, గండికొట్టే అవకాశాలున్న గట్టులను ముందుగానే గుర్తించి ఇసుక బస్తాలను చేరవేయాలని సూచించారు. గత నీలం తుపానులో కోతకు గురైన ప్రాంతాలను మరొకసారి తనిఖీ చేయాలని అవసరమైతే ఆ ప్రదేశాలకు ఇసుక బస్తాలను తరలించి నిరంతర నిఘా ఉంచాల న్నారు. మండల, గ్రామ స్థాయి సిబ్బంది వారి వారి ప్రధాన కేంద్రాల్లో ఉండాలని, నదుల గట్టుల వెంబడి ఉన్న గ్రామ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉండాలన్నారు. పశు సంపదను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జేసీబీలను, ఇసుక బస్తాలను కావలసినన్ని సమకూర్చుకోవాలని సూ చించారు, ఈ వర్షాల వల్ల జరిగే నష్ట నివారణ లో సిబ్బంది కాని, అధికారులు కాని ఎటువం టి అలసత్వం ప్రదర్శించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ వచ్చే 48 గంటల్లో భారీ వర్షాల సూచన ఉన్నందున అధికారులు నిరంతరం అప్రమత్తతతో ఉండాలన్నారు. ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా పర్యవేక్షణ అవసరమన్నారు. ఈ సమావేశంలో చోడవరం నుంచి ప్రత్యేకాధికారి, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, పాయకరావుపేట నుంచి ప్రత్యేకాధికారి, ఏజేసీ నర్సింగరావు, యలమంచిలి నుంచి ప్రత్యేకాధికారి, పౌర సరఫరాలు డీఎం ప్రకాశరావు, విశాఖ ఆర్డీఓ మురళి, పాడేరు ఆర్డీఓ గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి ప్రణాళిక
విశాఖ రూరల్ , న్యూస్‌లైన్: ‘జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోంది. అటువంటి విశాఖలో అన్ని రకాల సౌకర్యాలు, వసతులు ఉండాలి. ఇతర రాష్ట్రాలు, దేశాలపై ఆధారపడే అవకాశం ఉండకూదు. ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించి అందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేస్తాం’ అని కొత్త కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ వెల్లడించారు. తన చాంబర్లో శుక్రవారం మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడారు. గత కలెక్టర్ శేషాద్రి అమలు చేసిన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. అన్ని రంగాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. నెల రోజుల్లో అన్ని అంశాలపై దృష్టి సారించి అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. డయల్ యువర్ కలెక్టర్, ప్రజావాణి, వంద రోజుల ప్రణాళిక ఇలా అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకువెళతామన్నారు. చిత్తూరు జిల్లాలో ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను ఆన్లైన్లో పొందుపరిచే సాఫ్ట్వేర్ ఉండడంతో వాటిని సంబంధిత అధికారులు పరిశీలించడం, అలాగే ఆ ఫిర్యాదులు ఏ స్థాయిలో ఉన్నాయో ఫిర్యాదుదారులకు తెలుసుకొనే అవకాశముందన్నారు. ప్రస్తుతం జిల్లా లో ప్రజావాణి దరఖాస్తుల వివరాలను కం ప్యూటర్‌లో పొందుపరుస్తున్నారని, మరింత సరళీకృతం చేయడానికి గల అవకాశాలను అధికారులతో చర్చిస్తామన్నారు. వర్షాభావ పరిస్థితులపై నివేదిక జిల్లాలో వర్షాలు లేకపోవడంతో కరువు ఛాయ లు ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. మూడు మండలాల్లో మినహా ఇతర ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జిల్లాలో 50 శాతానికి పైగా వ్యవసాయం వర్షాలపై ఆధారపడి ఉందన్నారు. ఈ వర్షాభావ పరిస్థితులపై సెప్టెంబర్ తర్వాత నివేదిక తయారు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. ప్రత్యామ్నాయ పం టలకు సంబంధించి విత్తనాలు సిద్ధంగా ఉన్నా ప్రస్తుతం వర్షాలు లేని సమయంలో అవి వేసినా ఫలితముండదని వ్యవసాయాధికారులు చెబుతున్నట్టు చెప్పారు. వర్షాలు కురుస్తున్న సమయంలో వాటిని పంపిణీకి అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు. పంట రుణాలపై దృష్టి రె తులకు పంట రుణాలు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయ రుణాలతో పాటు వ్యవసాయేతర రుణాలను కూడా రుణ లక్ష్యంలో చూపిస్తుండడంతో కొందరు రైతులకు మేలు జరగడం లేదన్నారు. దీనిపై త్వరలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి కేవలం వ్యవసాయ రుణాలను లక్ష్యంగా చేసుకొని స్పష్టమైన నివేదికలు తయారు చేయమని సూచిస్తామన్నారు. ప్రమాదాల నియంత్రణకు చర్యలు అవసరం జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న విశాఖ జిల్లా భద్రతకు సంబంధిం చి ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రమాదాలు సంభవించిన సమయాల్లో కూడా చికిత్సల కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడకుండా జిల్లాలోనే అత్యాధునిక వైద్య సదుపాయాలను కల్పించుకోవాల్సిన అవసరముందని చెప్పారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు భూములు అప్పగించి నిర్వాసితులైన వారి సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని కలెక్టర్ చెప్పారు. వారి జీవనోపాధికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితులతో పాటు కాలుష్యంపై అధికారులతో సమావేశమై అనంతరం నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. పటిష్టంగా ఉపాధి హామీ జిల్లాలో ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చే సేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు కారణంగా వ్యవసాయ పనులు లేవని, ఈ తరుణంలో కూలీలకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా అందరికీ పనులు కల్పించే విషయంపై త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. కూలీల జీతాల చెల్లింపులకు చేతి వేలి ముద్రల నమోదు కారణంగా కాస్త జాప్యం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం రూ.20 కోట్లు విడుదలైనట్లు డుమా అధికారులు తెలిపారని, కానీ వాటి చెల్లింపుల్లో కాస్త జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోందన్నారు. త్వరలోనే ఆ సమస్యలను అధిగమించి వేతనాల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూస్తామని తెలిపారు.