విరుచుకుపడ్డ విష జ్వరం | 3 Dead in 6 days by Unknown Fever VIRUS | Sakshi
Sakshi News home page

విరుచుకుపడ్డ విష జ్వరం

Published Thu, Oct 24 2013 3:01 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM

3 Dead in 6 days by Unknown Fever VIRUS

 =బరియకల్‌లో టైఫాయిడ్ జోరు
 =మూడుకు చేరిన మృతుల సంఖ్య
 =మరో 8 మంది పరిస్థితి విషమం గ్రామాన్ని సందర్శించిన
 = వైద్య అధికారి నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు
 
 డుంబ్రిగుడ, న్యూస్‌లైన్ : విషజ్వరం విజృంభించడంతో ఆరు రోజుల వ్యవధిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మండలంలోని కిల్లోగుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కొర్రాయి పంచాయతీ పరిధిలోని బరియకాల్ ఆదిమజాతి గిరిజన తెగ (పీటీజీ)కు చెందిన గ్రామంలో భయంకరమైన విషజ్వరం ఫలితంగా ఐదు రోజుల్లో ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. బుధవారం కిల్లో పూజారి (50) అనే గిరిజనుడు ప్రాణాలు కోల్పోయాడు.

అనారోగ్యానికి గురై మంచం పట్టిన మరో ఎనిమిది మంది వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సకాలంలో చికిత్సకు నోచుకోక అవస్థలు పడుతున్నారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బరియకాల్ గ్రామంలో విషజ్వరం ఉధృతంగా వ్యాపిస్తున్నా వైద్య సిబ్బంది ఏమాత్రం పట్టించుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. దాంతో రోజు తప్పించి రోజు ఒక్కో గిరిజనుడు వంతున మరణిస్తున్నారు. మరెందరో తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.

 ప్రబలిన టైఫాయిడ్

 బరియకాల్‌లో వ్యాధుల బారిన పడ్డ  గిరిజనులకు రక్తపరీక్షలు జరపగా, ఇది టైఫాయిడ్‌గా నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అదనపు వైద్యాధికారి స్వప్నకుమారి చెప్పారు. ‘పీడిస్తున్న జ్వరాలు’ అనే శీర్షికతో ఈనెల 22న ‘సాక్షి’లో వెలువడ్డ వార్తకు స్పందించిన ఆమె బుధవారం డుంబ్రిగుడ మండల కేంద్రానికి వచ్చారు. గ్రామంలో ముగ్గురు మృతి చెంది అనేక మంది మంచం పట్టిన నేపథ్యంలో ఆమె బరియకల్‌లో పర్యటించారు. టైఫాయిడ్ చె లరేగి ముగ్గురు మృతి చెందినా వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆమె మండిపడ్డారు.
 
 వైద్యసిబ్బందిపై కఠిన చర్యలు

 టైఫాయిడ్ తీవ్ర స్థాయిలో వ్యాపించడానికి నీటి కాలుష్యం కారణమవుతుందని, అపరిశుభ్రత వల్ల కూడా విషజ్వరం వ్యాపిస్తుందని స్వప్నకుమారి చెప్పారు. గ్రామంలో బాధ్యతలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది సకాలంలో చికిత్స అందించడంలో విఫలమయ్యారని చెప్పారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, దీనిని కొనసాగిస్తామని తెలిపారు. బాధితులను వైద్య చిత్సల కోసం అరకు ఏరియా ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అనంతరం ఆమె డుంబ్రిగుడ పీహెచ్‌సీని సందర్శించి రికార్డులను పరిశీలించారు. వైద్య సిబ్బంది విధి నిర్వహణ తీరును గమనించిన ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వెంట కిల్లోగుడ వైద్య అధికారి రవికుమార్,హెల్త్ సూపర్‌వైజర్ బి.లక్ష్మణరావు తదితరులు ఉన్నారు.

 ఊటగెడ్డ జలాలు కారణం?

 బరియకాల్ చేరువలోని ఊట గెడ్డ నీటినే గిరిజనులు తాగుతున్నారు. విషజ్వరం వ్యాపించడానికి ఈ కలుషిత జలాలు కారణమై ఉండవచ్చన్న అభిప్రాయం వినవస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement