వర్షాఘాతం.. | Record level rainfall after 1923 hits agricultural crops | Sakshi
Sakshi News home page

వర్షాఘాతం..

Published Sat, Oct 26 2013 1:41 AM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM

Record level rainfall after 1923 hits agricultural crops

 

=1923 తరువాత  రికార్డు స్థాయి వర్షపాతం
=జిల్లాలో రూ.11.5కోట్ల పంట నష్టం
=అధికారుల ప్రాథమిక అంచనా
=తెరిపిస్తేనే సమగ్రంగా లెక్క

 
రైతుకు తీరని కష్టమొచ్చి పడింది. తెరిపివ్వని వర్షాలతో వేలాది ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. మబ్బుపట్టిన వాతావరణం, చల్లని గాలులతో తెగుళ్లు విజృంభిస్తున్నాయి. ఇంతకాలం వర్షాభావ పరిస్థితులు, ఎరువులు తెచ్చిన కష్టంతో కుమిలిపోతున్న అన్నదాతకు ఈ పరిస్థితి మింగుడు పడడం లేదు. కళ్లముందు కొట్టుకుపోతున్న పంటను చూసి లబోదిబోమంటున్నాడు. వరిపైరు పొట్ట, పాలుపోసుకునే దశలో ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉంటే నష్టం పెరుగుతుందని భయపడుతున్నారు.
 
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ఎడతెరిపిలేకుండా ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జిల్లాను వణికిస్తున్నాయి. జలాశయాలు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలు నీట మునిగాయి. చెరువులు, పంటలు ఏకమయ్యాయి. వాగులకు గండ్లు పడుతున్నాయి. వరద ఉధృతికి రోడ్లు కొట్టుకుపోయాయి. సమీప గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. జిల్లాలో 29,905.5 ఎకరాల్లో పంట ముంపునకు గురయినట్టు అధికారుల అంచనా. ఈమేరకు సుమారు రూ.11.5కోట్ల మేర నష్టం వాటిల్లి ఉండొచ్చని లెక్క కట్టారు. వానలు తెరిపిస్తే తప్ప కచ్చితమైన లెక్క తేలే అవకాశం లేదంటున్నారు. 90 ఏళ్లు తరువాత జిల్లాలో మూడు రోజుల్లో దాదాపుగా 25 సెం.మీ. మేర పడిన వర్షం భారీ నష్టాన్నే తెచ్చిపెట్టింది. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేల ఎకరాల పంట నీట మునిగింది. 1923లో మూడున్నర రోజుల పాటు 25 సెం.మీ. వర్షం కురిసింది. ఇప్పుడు అదే స్థాయిలో 24.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.  

27 మండలాల్లో తీవ్ర ప్రభావం


జిల్లాలో 27 మండలాల్లో 52 గ్రామాలు వర్ష ప్రభావానికి గురయ్యాయి. 20 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. 15 వేల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 19 మండలాల్లో  29,905.5 ఎకరాల్లో పంట నీటిపాలైంది. ఈ వర్షాలకు మొత్తంగా 170.22 కిలోమీటర్ల మేర రోడ్లు పాడైనట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నారు. నాలుగు చోట్ల భారీ చెట్లు నెలకొరిగాయి. ఈ రోడ్లను తాత్కాలికంగా వేయడానికే రూ.5.01 కోట్లు ఖర్చవుతుందని ఆర్‌అండ్‌బీ అధికారులు అంచనా వేస్తున్నారు. అదే పూర్తి స్థాయిలో నిర్మించాలంటే రూ.39.33 కోట్లు అవసరమని చెబుతున్నారు. చిన్న నీటి పారుదల శాఖ ప్రాజెక్టులు 76 వరకు దెబ్బతినడంతో రూ.5.12 కోట్లు నష్టం వాటిల్లింది. అదే విధంగా 12 గ్రామాల్లో విద్యుత్ సమస్యలు ఏర్పడ్డాయి. జిల్లాలో 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఒకటి దెబ్బతినడంతో పాటు 29 విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. అలాగే 3.1 కిలోమీటర్ల మేర హెచ్‌టీ/ఎల్‌టీ లైన్స్, ఎల్‌టీ పోల్స్ 129 పాడయ్యాయి. దీంతో ఏపీట్రాన్స్‌కోకు రూ.1.22 కోట్లు నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.

రైవాడతోనే భయం


జిల్లాలో పెద్దేరు నుంచి 4500, కోనాం నుంచి 900 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. తాటిపూడి రిజర్వాయర్‌కు కూడా ఇన్‌ఫ్లో పెరగడంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి 100 క్యూసెక్కుల నీటిని వదలుతున్నారు. ఇదిలా ఉంటే రైవాడ విషయంలో మాత్రం అధికారులు కొంత ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి రైవాడ నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదలుతున్నారు. ఒకవేళ ఏజెన్సీలో భారీ వర్షాలు పడితే భారీగా నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే శారదా నదికి వరద నీరు చేరి కిందనున్న గ్రామాలు నీట మునిగే ప్రమాదముందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతున్నారు.

10 నేవీ బృందాలు సిద్ధం


విపత్కర పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో నేవీ సహాయం తీసుకోవాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే నేవీ అధికారులతో ఈ విషయంపై చర్చించారు. అవసరమైతే బృందాలను పంపించాలని సమాచారం అందించారు. దీంతో 10 నేవీ బృందాలు, ఒక్కో దానిలో నలుగురు సభ్యులు చొప్పున సిబ్బంది సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారు.

పశువుల దాణాకు ప్రతిపాదనలు


వర్షాలు కారణంగా కొన్ని గ్రామాలు నీట మునగడంతో పశువులకు దాణా కొరత ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని పశువులు ఉన్నాయో గణాంకాలు సేకరించారు. ప్రసుత్తం ఆరు గ్రామాలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 40 టన్నుల దానా కోసం పశు సంవర్ధక శాఖ అధికారులు ఇండెంట్ పెట్టారు. డిమాండ్‌ను బట్టి ఇండెంట్‌ను పెంచుతామని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు.

కలెక్టర్‌కు సీఎస్ ఫోన్


జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి శుక్రవారం ఉదయం కూడా ఫోన్ చేసి జిల్లాలో పరిస్థితులపై ఆరా తీశారు. అత్యవసర సహాయక చర్యలకు నేవీ బృందాలు సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ సీఎస్‌కు వివరించారు. అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

నేడు మంత్రి గంటా సమీక్ష


జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు ఢిల్లీ నుంచి జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్‌కు ఫోన్ చేసి జిల్లాలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జలాశయాల నుంచి నీటిని విడుదల చేయడం, తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ మంత్రికి వివరించారు. శనివారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీ నుంచి విశాఖ వచ్చి జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో వర్షాలపై సమీక్ష నిర్వహించనున్నారు.

రైళ్ల రాకపోకలకు అంతరాయం


యలమంచిలి మండలం లైనుకొత్తూరు వద్ద కన్నయ్య చెరువు నిండి రైలు పట్టాలపైకి నీరు రావడంతో గంటసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. యలమంచిలి, రేగుపాలెం, తుని, గుల్లిపాడు, అనకాపల్లి స్టేషన్లలో పలు రైళ్లను నిలిపివేశారు.  రైల్వే సిబ్బంది కన్నయ్య చెరువుకు పొక్లెయినర్‌తో గండికొట్టారు. నీరు బయటకు పోయాక రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.  
 
గెడ్డలో కొట్టుకుపోయి బాలింత మృతి


జి.మాడుగుల:  మండలంలోని సొలభం పంచాయతీ వనభరంగిపాడు గ్రామానికి చెందిన ఆదిమజాతి గిరిజన బా లింత(30) దుస్తులు ఉతుకుతుండగా గెడ్డ ప్రవాహనికి కొట్టుకొనిపోయి మృతి చెందింది. గ్రామానికి చెందిన వంతాల దసాయి(30) వారం రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. గురువారం ఉదయం దుస్తులు ఉతకడానికి సమీపంలోని గెడ్డకు వెళ్లింది. వరద ఉధృతికి కొట్టుకొని పోయింది. సాయంత్రమైనా ఇంటికి రాకపోవటంతో గ్రామస్తులు వెదకగా కొంతదూరంలో మృతదేహం కనిపించింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement