P.K. Mahanti
-
వర్షాఘాతం..
=1923 తరువాత రికార్డు స్థాయి వర్షపాతం =జిల్లాలో రూ.11.5కోట్ల పంట నష్టం =అధికారుల ప్రాథమిక అంచనా =తెరిపిస్తేనే సమగ్రంగా లెక్క రైతుకు తీరని కష్టమొచ్చి పడింది. తెరిపివ్వని వర్షాలతో వేలాది ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. మబ్బుపట్టిన వాతావరణం, చల్లని గాలులతో తెగుళ్లు విజృంభిస్తున్నాయి. ఇంతకాలం వర్షాభావ పరిస్థితులు, ఎరువులు తెచ్చిన కష్టంతో కుమిలిపోతున్న అన్నదాతకు ఈ పరిస్థితి మింగుడు పడడం లేదు. కళ్లముందు కొట్టుకుపోతున్న పంటను చూసి లబోదిబోమంటున్నాడు. వరిపైరు పొట్ట, పాలుపోసుకునే దశలో ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉంటే నష్టం పెరుగుతుందని భయపడుతున్నారు. విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ఎడతెరిపిలేకుండా ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జిల్లాను వణికిస్తున్నాయి. జలాశయాలు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలు నీట మునిగాయి. చెరువులు, పంటలు ఏకమయ్యాయి. వాగులకు గండ్లు పడుతున్నాయి. వరద ఉధృతికి రోడ్లు కొట్టుకుపోయాయి. సమీప గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. జిల్లాలో 29,905.5 ఎకరాల్లో పంట ముంపునకు గురయినట్టు అధికారుల అంచనా. ఈమేరకు సుమారు రూ.11.5కోట్ల మేర నష్టం వాటిల్లి ఉండొచ్చని లెక్క కట్టారు. వానలు తెరిపిస్తే తప్ప కచ్చితమైన లెక్క తేలే అవకాశం లేదంటున్నారు. 90 ఏళ్లు తరువాత జిల్లాలో మూడు రోజుల్లో దాదాపుగా 25 సెం.మీ. మేర పడిన వర్షం భారీ నష్టాన్నే తెచ్చిపెట్టింది. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేల ఎకరాల పంట నీట మునిగింది. 1923లో మూడున్నర రోజుల పాటు 25 సెం.మీ. వర్షం కురిసింది. ఇప్పుడు అదే స్థాయిలో 24.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 27 మండలాల్లో తీవ్ర ప్రభావం జిల్లాలో 27 మండలాల్లో 52 గ్రామాలు వర్ష ప్రభావానికి గురయ్యాయి. 20 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. 15 వేల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 19 మండలాల్లో 29,905.5 ఎకరాల్లో పంట నీటిపాలైంది. ఈ వర్షాలకు మొత్తంగా 170.22 కిలోమీటర్ల మేర రోడ్లు పాడైనట్లు ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. నాలుగు చోట్ల భారీ చెట్లు నెలకొరిగాయి. ఈ రోడ్లను తాత్కాలికంగా వేయడానికే రూ.5.01 కోట్లు ఖర్చవుతుందని ఆర్అండ్బీ అధికారులు అంచనా వేస్తున్నారు. అదే పూర్తి స్థాయిలో నిర్మించాలంటే రూ.39.33 కోట్లు అవసరమని చెబుతున్నారు. చిన్న నీటి పారుదల శాఖ ప్రాజెక్టులు 76 వరకు దెబ్బతినడంతో రూ.5.12 కోట్లు నష్టం వాటిల్లింది. అదే విధంగా 12 గ్రామాల్లో విద్యుత్ సమస్యలు ఏర్పడ్డాయి. జిల్లాలో 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఒకటి దెబ్బతినడంతో పాటు 29 విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. అలాగే 3.1 కిలోమీటర్ల మేర హెచ్‌టీ/ఎల్టీ లైన్స్, ఎల్టీ పోల్స్ 129 పాడయ్యాయి. దీంతో ఏపీట్రాన్స్కోకు రూ.1.22 కోట్లు నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. రైవాడతోనే భయం జిల్లాలో పెద్దేరు నుంచి 4500, కోనాం నుంచి 900 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. తాటిపూడి రిజర్వాయర్‌కు కూడా ఇన్‌ఫ్లో పెరగడంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి 100 క్యూసెక్కుల నీటిని వదలుతున్నారు. ఇదిలా ఉంటే రైవాడ విషయంలో మాత్రం అధికారులు కొంత ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి రైవాడ నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదలుతున్నారు. ఒకవేళ ఏజెన్సీలో భారీ వర్షాలు పడితే భారీగా నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే శారదా నదికి వరద నీరు చేరి కిందనున్న గ్రామాలు నీట మునిగే ప్రమాదముందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతున్నారు. 10 నేవీ బృందాలు సిద్ధం విపత్కర పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో నేవీ సహాయం తీసుకోవాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే నేవీ అధికారులతో ఈ విషయంపై చర్చించారు. అవసరమైతే బృందాలను పంపించాలని సమాచారం అందించారు. దీంతో 10 నేవీ బృందాలు, ఒక్కో దానిలో నలుగురు సభ్యులు చొప్పున సిబ్బంది సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారు. పశువుల దాణాకు ప్రతిపాదనలు వర్షాలు కారణంగా కొన్ని గ్రామాలు నీట మునగడంతో పశువులకు దాణా కొరత ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని పశువులు ఉన్నాయో గణాంకాలు సేకరించారు. ప్రసుత్తం ఆరు గ్రామాలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 40 టన్నుల దానా కోసం పశు సంవర్ధక శాఖ అధికారులు ఇండెంట్ పెట్టారు. డిమాండ్‌ను బట్టి ఇండెంట్‌ను పెంచుతామని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు. కలెక్టర్‌కు సీఎస్ ఫోన్ జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి శుక్రవారం ఉదయం కూడా ఫోన్ చేసి జిల్లాలో పరిస్థితులపై ఆరా తీశారు. అత్యవసర సహాయక చర్యలకు నేవీ బృందాలు సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ సీఎస్‌కు వివరించారు. అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నేడు మంత్రి గంటా సమీక్ష జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు ఢిల్లీ నుంచి జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్‌కు ఫోన్ చేసి జిల్లాలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జలాశయాల నుంచి నీటిని విడుదల చేయడం, తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ మంత్రికి వివరించారు. శనివారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీ నుంచి విశాఖ వచ్చి జిల్లా కలెక్టరేట్లో అధికారులతో వర్షాలపై సమీక్ష నిర్వహించనున్నారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం యలమంచిలి మండలం లైనుకొత్తూరు వద్ద కన్నయ్య చెరువు నిండి రైలు పట్టాలపైకి నీరు రావడంతో గంటసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. యలమంచిలి, రేగుపాలెం, తుని, గుల్లిపాడు, అనకాపల్లి స్టేషన్లలో పలు రైళ్లను నిలిపివేశారు. రైల్వే సిబ్బంది కన్నయ్య చెరువుకు పొక్లెయినర్‌తో గండికొట్టారు. నీరు బయటకు పోయాక రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. గెడ్డలో కొట్టుకుపోయి బాలింత మృతి జి.మాడుగుల: మండలంలోని సొలభం పంచాయతీ వనభరంగిపాడు గ్రామానికి చెందిన ఆదిమజాతి గిరిజన బా లింత(30) దుస్తులు ఉతుకుతుండగా గెడ్డ ప్రవాహనికి కొట్టుకొనిపోయి మృతి చెందింది. గ్రామానికి చెందిన వంతాల దసాయి(30) వారం రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. గురువారం ఉదయం దుస్తులు ఉతకడానికి సమీపంలోని గెడ్డకు వెళ్లింది. వరద ఉధృతికి కొట్టుకొని పోయింది. సాయంత్రమైనా ఇంటికి రాకపోవటంతో గ్రామస్తులు వెదకగా కొంతదూరంలో మృతదేహం కనిపించింది. -
దసరాకు 45% ఐఆర్: టీఎన్జీవోల సంఘం
సాక్షి, హైదరాబాద్: పదో వేతన సంఘం(పీఆర్సీ) నివేదిక రావడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో.. ఈ ఏడాది జూలై 1 నుంచి అమలయ్యే విధంగా దసరాకు కనీసం 45 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించాలని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) పి.కె.మహంతిని కలిసి వినతిపత్రం సమర్పించింది. ప్రతినిధి బృందంలో వేణుగోపాల్, ఉపేందర్‌రెడ్డి, జగదీశ్వర్, బుచ్చిరెడ్డి, రేచల్, విజయలక్ష్మి, సత్తెమ్మ, వనజ, శైలజ, రంగరాజు, హీమీద్ తదితరులు ఉన్నారు. అనంతరం దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సంవత్సరం జూలై 1 నుంచి పదో పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉండగా, ఇప్పటి వరకూ నివేదికే అందలేదన్నారు. ఈ జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని కనీసం 45 శాతం ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని విజ్ఞప్తి చేశామని, అందుకు సీఎస్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్‌లో ఉద్యమించక తప్పదని వారు హెచ్చరించారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని వారు కోరారు. అంతకుముందు టీఎన్జీవో భవన్లో టీఎన్జీవో కార్యవర్గ సమావేశం జరిగింది. టీఎన్జీవో కార్యవర్గ సమావేశం తీర్మానాలివీ.. కేంద్ర ప్రభుత్వం వెంటనే హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలి. శీతాకాల సమావేశాలకు ముందుగానే పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచి బిల్లుకు ఆమోదముద్ర వేయించాలి. ఈ నెల 30న హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ స్వాభిమాన సదస్సు జయప్రదానికి కృషి చేయాలి. ఉద్యోగులు పెద్దఎత్తున కదిలిరావాలి. సదస్సును విజయవంతం చేయడానికి వీలుగా అన్ని జిల్లాల్లో టీఎన్జీవో సదస్సులు నిర్వహించాలి. ప్రత్యేక రాష్ట్రం వల్ల ఒనగూడే ప్రయోజనాలను వివరించాలి. సకల జనుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణించాలి. ఉద్యోగుల మీద బనాయించిన కేసులను ఎత్తివేయాలి. సమైక్యాంధ్ర సమ్మె సందర్భంగా తెలంగాణ అధికారులు, ఉద్యోగులపై దాడులు చేయడం అమానుషం. వారికి పూర్తి భద్రత కల్పించాలి. సమ్మె కొనసాగినంత కాలం వారిని హైదరాబాద్‌కు బదిలీ చేయాలి. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో ఏపీఎన్జీవోలు ప్రస్తావించిన సమస్యలన్నీ పరిష్కరించదగినవే. ఏపీఎన్జీవోలు సమ్మె విరమించి విభజనకు సహకరించాలి. సభ సందర్భంగా తెలంగాణవాదులు, విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. జూలై 30 తర్వాత పలు శాఖల్లో టీ-అధికారుల్ని వివక్షకు గురిచేస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయాల్ని పునఃపరిశీలించాలి. హైదరాబాద్‌ను యూటీగా ప్రకటించాలని కొందరు చేస్తున్న కుట్రకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. -
వెనక్కి తగ్గితే మెరుపు సమ్మె:టీ.ఉద్యోగులు
-
వెనక్కి తగ్గితే మెరుపు సమ్మె
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గితే మెరుపు సమ్మెకు దిగుతామని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ హెచ్చరించింది. కాంగ్రెస్ పార్టీ వైఖరి దారుణంగా ఉందని, రెండు ప్రాంతాల్లో రెండు వైఖరులు ప్రదర్శిస్తోందని విమర్శించింది. ఇప్పటికైనా స్పష్టమైన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేసింది. జేఏసీ నేతలు దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, విఠల్, రవీందర్‌రెడ్డి సోమవారం టీఎన్జీవో భవన్లో విలేకరులతో మాట్లాడారు. విభజన ఆగితే మెరుపు సమ్మెకు దిగుతామంటూ ఈనెల 19న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతికి నోటీసు ఇవ్వనున్నట్టు తెలిపారు. మంగళవారం నుంచి ఈనెల 17 వరకు భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు, శాంతి ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. సీమాంధ్ర ఉద్యోగుల లెక్కలు ఇప్పుడు తెలుస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని శాఖాధిపతుల కార్యాలయాల్లో సమ్మెకు వెళ్లేవారంతా సీమాంధ్ర ఉద్యోగులేనని, వారు ఎంత మంది ఉన్నారనే విషయం తేలుస్తామన్నారు. సమ్మెకెళ్లే ఉద్యోగులను తెలంగాణ రాష్ట్రంలో ఉండనివ్వబోమని హెచ్చరించారు. ఏపీఎన్జీవోలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. తెలంగాణ ఉద్యమాన్ని కించపరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సీమాంధ్రలో ఆర్టీసీ బస్సులు బంద్ చేస్తున్న ఉద్యోగులు.. కేశినేని, ఎస్వీర్, దివాకర్ ట్రావెల్స్ వంటి ప్రైవేటు సంస్థల బస్సులు ఎందుకు ఆపడంలేదని ప్రశ్నించారు. ఏపీఎన్జీవోలు ఇచ్చిన సమ్మె నోటీసు రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాష్ట్ర విభజనపై సమ్మె నోటీసు ఇవ్వకూడదని, అలా ఇచ్చినవారిపై చర్యలు తీసుకోవాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. తాము ఆర్టికల్ 3 ప్రకారం కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలని, రాష్ట్రపతి ఉల్లంఘనలపై మాత్రమే సమ్మె నోటీసు ఇచ్చామని గుర్తు చేశారు. సీమాంధ్రలో జాతీయ నేతల విగ్రహాల ధ్వంసంలో ఉద్యోగులు కూడా ఉన్నారని తమకు సమాచారం ఉందని, తెలంగాణలో తాము తలుచుకుంటే సీమాంధ్ర నేతల విగ్రహం ఒక్కటీ మిగలదనే విషయం గుర్తించాలని హెచ్చరించారు. సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదు... సీమాంధ్ర నాయకులు రెచ్చగొట్టే ధోరణిలో వాఖ్యలు చేయరాదని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సోమవారమిక్కడి నాంపల్లిలోని గృహకల్ప ప్రాంగణంలో తెలంగాణ హౌసింగ్‌బోర్డు ఉద్యోగుల సంఘం, తెలంగాణ కోఆపరేటివ్ ఉద్యోగుల సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో సద్భావన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. సీమాంధ్ర ఉద్యోగులు, నాయకులు తీసుకున్న నిర్ణయాలను ఒక్కసారి పునరాలోచించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్, తెలంగాణ హౌసింగ్ బోర్డు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, తెలంగాణ కో-ఆపరేటివ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్, తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్‌గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.