సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గితే మెరుపు సమ్మెకు దిగుతామని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ హెచ్చరించింది. కాంగ్రెస్ పార్టీ వైఖరి దారుణంగా ఉందని, రెండు ప్రాంతాల్లో రెండు వైఖరులు ప్రదర్శిస్తోందని విమర్శించింది. ఇప్పటికైనా స్పష్టమైన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేసింది. జేఏసీ నేతలు దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, విఠల్, రవీందర్‌రెడ్డి సోమవారం టీఎన్జీవో భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.
విభజన ఆగితే మెరుపు సమ్మెకు దిగుతామంటూ ఈనెల 19న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతికి నోటీసు ఇవ్వనున్నట్టు తెలిపారు. మంగళవారం నుంచి ఈనెల 17 వరకు భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు, శాంతి ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. సీమాంధ్ర ఉద్యోగుల లెక్కలు ఇప్పుడు తెలుస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని శాఖాధిపతుల కార్యాలయాల్లో సమ్మెకు వెళ్లేవారంతా సీమాంధ్ర ఉద్యోగులేనని, వారు ఎంత మంది ఉన్నారనే విషయం తేలుస్తామన్నారు.
సమ్మెకెళ్లే ఉద్యోగులను తెలంగాణ రాష్ట్రంలో ఉండనివ్వబోమని హెచ్చరించారు. ఏపీఎన్జీవోలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. తెలంగాణ ఉద్యమాన్ని కించపరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సీమాంధ్రలో ఆర్టీసీ బస్సులు బంద్ చేస్తున్న ఉద్యోగులు.. కేశినేని, ఎస్వీర్, దివాకర్ ట్రావెల్స్ వంటి ప్రైవేటు సంస్థల బస్సులు ఎందుకు ఆపడంలేదని ప్రశ్నించారు. ఏపీఎన్జీవోలు ఇచ్చిన సమ్మె నోటీసు రాజ్యాంగ విరుద్ధమన్నారు.
రాష్ట్ర విభజనపై సమ్మె నోటీసు ఇవ్వకూడదని, అలా ఇచ్చినవారిపై చర్యలు తీసుకోవాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. తాము ఆర్టికల్ 3 ప్రకారం కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలని, రాష్ట్రపతి ఉల్లంఘనలపై మాత్రమే సమ్మె నోటీసు ఇచ్చామని గుర్తు చేశారు. సీమాంధ్రలో జాతీయ నేతల విగ్రహాల ధ్వంసంలో ఉద్యోగులు కూడా ఉన్నారని తమకు సమాచారం ఉందని, తెలంగాణలో తాము తలుచుకుంటే సీమాంధ్ర నేతల విగ్రహం ఒక్కటీ మిగలదనే విషయం గుర్తించాలని హెచ్చరించారు.
సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదు...
సీమాంధ్ర నాయకులు రెచ్చగొట్టే ధోరణిలో వాఖ్యలు చేయరాదని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సోమవారమిక్కడి నాంపల్లిలోని గృహకల్ప ప్రాంగణంలో తెలంగాణ హౌసింగ్‌బోర్డు ఉద్యోగుల సంఘం, తెలంగాణ కోఆపరేటివ్ ఉద్యోగుల సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో సద్భావన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. సీమాంధ్ర ఉద్యోగులు, నాయకులు తీసుకున్న నిర్ణయాలను ఒక్కసారి పునరాలోచించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్, తెలంగాణ హౌసింగ్ బోర్డు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, తెలంగాణ కో-ఆపరేటివ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్, తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్‌గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
వెనక్కి తగ్గితే మెరుపు సమ్మె
Published Tue, Aug 13 2013 4:33 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement