విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల జిల్లాలోని రిజర్వాయర్లు నిండుతున్నాయని, వాటి సామర్థ్యం మించితే గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని అధికారులను కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్దేరు జలాశయం నుంచి నీరు వదులుతున్నారని, బుధవారం అర్ధరాత్రి రైవాడ జలాశయం నుంచి నీటిని వదులుతారని ఈ విషయాన్ని 6 గంటల ముందుగానే మండల స్థాయి అధికారులకు తెలియజేస్తున్నారని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
నదీ పరివాహక ప్రాం తాల్లో వరదగట్టులను నిరంతరం పర్యవేక్షించుకోవాలని, గండికొట్టే అవకాశాలున్న గట్టులను ముందుగానే గుర్తించి ఇసుక బస్తాలను చేరవేయాలని సూచించారు. గత నీలం తుపానులో కోతకు గురైన ప్రాంతాలను మరొకసారి తనిఖీ చేయాలని అవసరమైతే ఆ ప్రదేశాలకు ఇసుక బస్తాలను తరలించి నిరంతర నిఘా ఉంచాల న్నారు. మండల, గ్రామ స్థాయి సిబ్బంది వారి వారి ప్రధాన కేంద్రాల్లో ఉండాలని, నదుల గట్టుల వెంబడి ఉన్న గ్రామ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉండాలన్నారు.
పశు సంపదను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జేసీబీలను, ఇసుక బస్తాలను కావలసినన్ని సమకూర్చుకోవాలని సూ చించారు, ఈ వర్షాల వల్ల జరిగే నష్ట నివారణ లో సిబ్బంది కాని, అధికారులు కాని ఎటువం టి అలసత్వం ప్రదర్శించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ వచ్చే 48 గంటల్లో భారీ వర్షాల సూచన ఉన్నందున అధికారులు నిరంతరం అప్రమత్తతతో ఉండాలన్నారు.
ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా పర్యవేక్షణ అవసరమన్నారు. ఈ సమావేశంలో చోడవరం నుంచి ప్రత్యేకాధికారి, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, పాయకరావుపేట నుంచి ప్రత్యేకాధికారి, ఏజేసీ నర్సింగరావు, యలమంచిలి నుంచి ప్రత్యేకాధికారి, పౌర సరఫరాలు డీఎం ప్రకాశరావు, విశాఖ ఆర్డీఓ మురళి, పాడేరు ఆర్డీఓ గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.
లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం
Published Thu, Oct 24 2013 2:58 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM
Advertisement
Advertisement