స్మితా సబర్వాల్
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను 30 రోజుల నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ జిల్లా అధికారులను ఆదేశించారు. గడువు పూర్తయిన కార్మిక శాఖ అధికారులు 10 ఆర్జీలపై ఎలాంటి సమాచారం ఇవ్వక పోవడంపై డిప్యూటీ కమిషనర్ కోటేశ్వర్‌రావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లైన్ సర్వే, బీసీ వెల్ఫేర్, పొల్యూషన్, ఫారెస్టు అధికారులు సకాలంలో తమ ఆర్జీలను పరిశీలించి పరిష్కరించాల్సిందిగా హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 7,053 ఫిర్యాదులు అందగా ఇందులో 6,500 పరిష్కారం కాగా 195 ఫిర్యాదులు తిరస్కరణకు గురయ్యాయన్నారు. 30 రోజుల్లోగా పరిష్కరించాల్సినవి 207, 30 రోజుల పైబడి 29 దరఖాస్తులు ఉన్నాయన్నారు. 3 నెలలు పైబడినవి 81, ఆరు నెలలు పైబడి 16 దరఖాస్తులు ఆయా శాఖల్లో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పంచాయతీ నిధులు సక్రమంగా ఉపయోగించి గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించాలని తనను కలిసిన సర్పంచ్‌లకు సూచించారు.
పంచాయతీ నిధుల దుర్వినియోగం చేస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సర్పంచ్‌లకు తెలిపారు. గ్రామాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి అంటు వ్యాధులు ప్రబల కుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్పంచ్‌లు పనిచేసే ప్రతి పనికి సంబంధించి ఖచ్చితమైన రికార్డులను నిర్వహించాలని సూచించారు. వీఆర్‌ఏ నుంచి వీఆర్‌ఓలుగా పదోన్నతులు పొందిన 47 మందికి కలెక్టర్ ప్రోసిడింగ్ అందజేశారు. ఈ సమావేశంలో జేసీ శరత్, ఏజేసీ మూర్తి, డీఆర్‌ఓ సాయిలు, ఆర్డీఓ సాయిలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.