ప్రజావాణికి వెల్లువలా దరఖాస్తులు | More victims apply to prajavani | Sakshi
Sakshi News home page

ప్రజావాణికి వెల్లువలా దరఖాస్తులు

Published Tue, Nov 19 2013 6:28 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM

More victims apply to prajavani

కలెక్టరేట్, న్యూస్‌లైన్ :  క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో బాధితులు కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి వెల్లువలా తరలివస్తున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో 500 మందికిపైగా అర్జీలు సమర్పించగా మండల, డివిజన్ కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమాలు జనం లేక బోసిపోయాయి. గ్రామ, వార్డు సందర్శనల పేరిట అధికారులు గ్రామాలకు వస్తున్నా సమస్యలు పరిష్కరించడం లేదని, అందుకే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని బాధితులు వాపోతున్నారు. వ్యక్తిగత సమస్యల కోసం కలెక్టరేట్‌లో ప్రజావాణికి రావొద్దని అధికారులు సూచించినా... క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించేవారు లేకపోవడంతో వారు పట్టించుకోవడం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడికి వస్తున్నామని అర్జీదారులు పేర్కొంటున్నారు. సోమవారం కలెక్టర్ వీరబ్రహ్మయ్య, జేసీ అరుణ్‌కుమార్ కొద్ది సేపు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం వివిధ పనుల నిమిత్తం వెళ్లిపోవడంతో డీఆర్వో కృష్ణారెడ్డి అర్జీలు స్వీకరించారు.
 డీవైసీకి 9 ఫిర్యాదులు
 డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి తొమ్మిది మంది ఫోన్ ద్వారా సమస్యలు తెలపగా... చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కమాన్‌పూర్ మండలం గుండారం నుంచి లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామంలో ఏడాది క్రితం అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభించినా టీచర్‌ను నియమించలేదని తెలపగా జేసీ అరుణ్‌కుమార్ స్పందిస్తూ నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు. రామడుగు మండలం కొక్కెరకుంట నుంచి లక్ష్మి మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకున్నప్పటికీ బిల్లులు చెల్లించలేదని తెలపగా జేసీ స్పందిస్తూ సంబంధిత అధికారుల ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. డీఆర్వో కృష్ణారెడ్డి, డీఆర్డీఏ పీడీ శంకరయ్య, జెడ్పీ సీఈవో చక్రధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement