హైదరాబాద్ కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో దరఖాస్తు సమర్పిస్తున్న పేదలు
సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండో సారి కొలువు తీరడంతో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం పేదలు మరింత ఆశల పెంచుకున్నారు. ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం అధికారికంగా ఎలాంటి దరఖాస్తులు కోరనప్పటికీ పేదల ఉరుకులు, పరుగులు మాత్రం అధికమయ్యాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించే విధానం అమల్లో ఉండటంతో డబుల్ బెడ్‌రూమ్ దరఖాస్తులు మీ సేవ, ఈ–సేవ కేంద్రాలకు కాసులు కురిపిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తుల ప్రతులను తీసుకొని కలెక్టరేట్ వద్ద క్యూ కడుతున్నారు. ఎన్నికల ఎన్నికల కోడ్ ముగిసి జిల్లా కలెక్టరేట్లలో ప్రజావాణి కార్యక్రమం ఫునఃప్రారంభం కావడంతో సోమవారం దరఖాస్తుల తాకిడి అధికమైంది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో పేదల డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు సమర్పించారు.
పెండింగ్ దరఖాస్తులే మూడు లక్షలు..
మహా నగర పరిధిలోని హైదరాబాద్–రంగారెడ్డి–మేడ్చల్ జిల్లా రెవెన్యూ యంత్రాంగాల వద్ద సుమారు మూడు లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మొదటి విడతగా మురికి వాడల్లోని నివాస ప్రాంతాల్లో స్థల లభ్యతను బట్టి ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ చేపడుతోంది. ఇప్పటికే అక్కడ ఉంటున్న లబ్ధిదారులందరికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేసి పోజిషిన్ సర్టిఫికెట్లను అందజేసింది. మొదటి విడత నిర్మాణాలు పూర్తయినా తర్వాత రెండో విడతలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. ఆయితే మొదటి విడత పనులే నత్తనడక నడుస్తున్నాయి. వాస్తవంగా ప్రభుత్వం నగరంలో రెండు లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఈ ఆర్ధిక సంవత్సరం లక్ష ఇళ్లు లక్ష్యంగా పెట్టుకొని డిసెంబర్ అఖరు నాటికి దాదాపు 40వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసే విధంగా చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా సెప్టెంబర్ మొదటి వారం వరకు వడివడిగా సాగిన పనులు ఆ తర్వాత మందగించాయి. ఇందుకు బిల్లుల చెల్లింపు పెండింగ్ పడడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ఈ ఏడాది లక్ష్యం...
ఈ ఏడాది మొత్తం లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటి వరకు మూడు ప్రాంతాల్లో 496 డబుల్ బెడ్‌రూమ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మరో 38 ప్రాంతాల్లో 39,669 ఇళ్లు పూర్తి కావాల్సి ఉంది. వచ్చే వేసవి నాటికి: 68 ప్రాంతాల్లో 59,835 పూర్త చేయాల్సి ఉంది. ప్రస్తుతం అమీన్‌పూర్‌లో (176), గాజుల రామారంలో (144), జమ్మిగడ్డలో (56),సయ్యద్‌సాబ్ కాబాడాలో (48) తదితర ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయ్యాయి. జియాగూడలో(840), బండ మైసమ్మనగర్, అహ్మద్‌గూడలో (4428) డి.పోచంపల్లిలో(1404), ఎరుకల నాంచారమ్మబస్తీలో (288), బహదూర్‌పల్లిలో (900) తదితర ప్రాంతాల్లో పనులు కొంత మంద కొడిగా సాగుతున్నాయి.
ఇళ్ల నిర్మాణం ఇలా...
నగరంలో స్థల లభ్యతనుబట్టి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను జీ+3, జీ+5, జీ+9 అంతస్తులుగా నిర్మిస్తున్నారు. వీటిల్లో ఒక్కో యూనిట్‌కయ్యే ఖర్చు అంచనా వేస్తే జీ+3 : రూ. 7 .00 లక్షలు, జీ+ 5 : రూ. 7.75 లక్షలు, జీ+9 : రూ. 7.90 లక్షలు ఖర్చు అవుతోంది. ఇందులో ఒక్కో యూనిట్‌కు లక్షా యాభైవేలు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌యోజన ద్వారా చెల్లిస్తోంది. మిగతా మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వమే చెల్లించాలి. వీటితోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు మరి కొంత ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. వాస్తవంగా లక్ష ఇళ్ల నిర్మాణం కోసం మొత్తం అంచనా వ్యయం రూ. 8598 కోట్లు, కాగా,అందులో కేంద్రప్రభుత్వ సబ్సిడీ రూ. 1500 కోట్లు. ఇప్పటి వరకు రూ. 2000 కోట్ల విలువైన పనులు జరుగగా రూ. 1600 కోట్లు చెల్లింపు జరిగింది. మరో నాలుగు వందల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment