
మా ఊరికి ఎడ్లబండి పోయే దారీ లేదు!
వైజాగ్ జాయింట్ కలెక్టర్‌ను చోడవరం మండలంలోని గ్రామస్తులు రోడ్లు వేయాలని కోరారు.
► వ్యవసాయ ఉత్పత్తుల తరలింపూ కష్టమే
► రోడ్డు వేసి మా భూములకు మార్గం కల్పించండి
► దుడ్డుపాలెం గ్రామస్తుల వినతి
► కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు 244 వినతులు
బీచ్‌రోడ్: ‘మాది రాయపురాజు పేట, దుడ్డుపాలెం గ్రామం. మాకు చట్టబద్ధమైన భూములు ఉన్నాయి. వాటిని సాగు చేసుకునేందుకు, వ్యవసాయ ఉత్పత్తులను తరలించేందుకు ఎడ్లబండి పోయే మార్గం లేక ఇబ్బంది పడుతున్నాం. మా గ్రామపటంలో పూర్వకాలంలో ఉన్న ప్రధాన మార్గం నిరుపయోగంగా మారి పలువురు ఆధీనంలో ఉంది. ఈ ప్రధాన రహదారి గ్రామ రెవెన్యూ రికార్డుల పరంగా పూర్తిగా ప్రభుత్వం పోరంబోకు స్థలంగా పేర్కొన్నారు. ఆ స్థలాన్ని పునరుద్ధరించి మార్గం వేసి మాకు వ్యవసాయం చేసుకునే సదుపాయం కల్పించాలి’ అంటూ గ్రీవెన్స్‌లో వినతిపత్రం ఇచ్చారు చోడవరం మండలం రాయపురాజు పేట, దుడ్డు పాలెం గ్రామస్తులు.
కలెక్టరేట్‌లో నిర్వహించిన మీ కోసం (ప్రజావాణి)కి జిల్లావ్యాప్తంగా 244మంది అర్జీదారులు దరఖాస్తు చేసుకున్నారు. జాయింట్ కలెక్టర్ జి.సృజనకు వినతులు అందించారు. ఎక్కువ మంది భూ ఆక్రమణలు, పెన్షన్, రేషన్‌కార్డు , గృహాల సమస్యలపై ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరెడ్డి, స్పెషల్ డిఫ్యూటీ కలెక్టర్ నరసింహరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
బియ్యం పూర్తిగా ఇవ్వట్లేదు
మా గ్రామంలో చాలా కుటుంబాలకు రేషన్ బియ్యం పూర్తిగా ఇవ్వడం లేదు. 8 నెలలుగా ఇలా జరుగుతోంది. ఒక్కో కుటుంబానికి 5 నుంచి 10 కిలోల బియ్యం ఇవ్వడం లేదు, 15 మంది కార్డులకు పూర్తిగా బియ్యం రాలేదు. రేషన్ డీలర్‌ను ప్రశ్నిస్తే ఎమ్మార్మోకు చెప్పుకోమంటున్నారు. తహసీల్దారును అడిగితే ఆధార్ వివరాలు సరిగ్గా నమోదు కాలేదంటున్నారు. మేం ఇప్పటికే చాలాసార్లు ఆధార్ వివరాలను డీలర్‌కు ఇచ్చాం. అయినా బియ్యం ఇవ్వట్లేదు. తినడానికి కూడా బియ్యం లేని పరిస్థితిలో ఉన్నాం. మాకు రేషన్ పూర్తిగా ఇప్పించాలి. – పాంగి డోంబు, రంగిలిసింగి, డుంబ్రిగుడ