ఫిర్యాదుల వెల్లువ
ప్రజావాణికి 61 వినతులు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 61 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డి, డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో గోవింద్, కలెక్టరేట్ ఏవో శ్రీధర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా ఫిర్యాదులను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సిఫారసు చేశారు.
రైతు సమన్వయ కమిటీని రద్దు చేయాలి..
ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన రై తు సమన్వయ కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిరికొండ మండలం హుస్సేన్‌నగర్ గ్రామా భివృద్ధి కమిటీ సభ్యులు కలెక్టరేట్ ఎదుట ధర్నా ని ర్వహించారు. ఇష్టానుసారంగా రైతు సమన్వయ క మిటీని ఏర్పాటు చేశారని, ఇందులో అధికార పార్టీ నాయకులే ఉన్నారని తెలిపారు. పంచాయతీ, గ్రా మాభివృద్ధి కమిటీ సభ్యులను సంప్రదించకుండా నే రైతు కమిటీని ఏర్పాటు చేశారని, రైతుల మేలు కోరి ఏర్పాటు చేస్తున్న రైతు సమన్వయ సమితుల్లో అర్హులకు చోటు కల్పించేలా కొత్త కమిటీని ఎన్నుకోవాలని కోరారు. వీడీసీ సభ్యులు మల్లేశ్, గంగారె డ్డి, రాజేందర్, రామస్వామి, రాజన్న, శ్రీనివాస్ త దితరులు పాల్గొన్నారు.
గీత కార్మికులకు లైసెన్సులివ్వాలి
ఈత చెట్లు గీయడానికి తమకు లైసెన్సులు ఇప్పించాలని కోరుతూ ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లికి చెందిన పలువురు కల్లుగీత కార్మికులు కలెక్టరేట్‌కు వచ్చారు. గ్రామంలో 30కి పైగా కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. ఈత చెట్లు గీసి కల్లును విక్రయించడానికి లైసెన్సులు ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ అధికారులను చాలాసార్లు విన్నవించామని, ఒకరిద్దరికి మాత్రమే లైసెన్సులు ఇచ్చి మిగతా వారికి ఇవ్వడం లేదన్నారు. తమకు కూడా లైసెన్సులు ఇప్పించి ఆదుకోవాలని గంగాగౌడ్, నారాగౌడ్, గంగాధర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, శంకర్‌గౌడ్ తదితరులు అధికారులకు వినతిపత్రం అందజేశారు.
గొర్రెల పంపిణీలో అన్యాయం జరిగింది..
గొర్రెల పంపిణీలో తమకు అన్యాయం చే శారంటూ జ క్రాన్‌పల్లి మం డలం కొలిప్యాక్‌కు చెందిన లబ్ధిదారులు భోజేం ధర్, లలిత ఇన్‌చార్జి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. త మకు శ్రీ కృష్ణ యాదవ సొసైటీలో సభ్యత్వం ఉందని, సొసైటీ సభ్యులు లక్కీ డ్రా ద్వారా గొర్రెలను పంపిణీ చేయకుండా ఇష్టానుసారంగా పంచుకున్నారని తెలిపారు. అయితే, తమకు వచ్చిన గొర్రె లు ఇవ్వలేదని సభ్యులను ప్రశ్నించినందుకు కుల బహిష్కరణ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతు న్నారని వాపోయారు. దీనిపై మండల, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని, గొర్రెల పంపిణీలో జరిగిన అన్యాయంపై విచారణ చేయించి న్యాయం చేయాలని కోరారు.
ట్రై సైకిల్ కోసం రెండేళ్లుగా..
నడవ లేని స్థితిలో ఉన్న తన కొడుకు గంగాప్రసాద్‌కు ట్రై సైకిల్ ఇవ్వాలని రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని బాల్కొండ మండలం బోదెపల్లికి చెందిన సహదేవ్ వాపోయాడు. ట్రై సైకిల్ కొరకు వికలాంగుల శాఖ కార్యాలయంలో చాలాసార్లు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ అధికారులు ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా ట్రై సైకిల్ ఇప్పించి ఆదుకోవాలని అధికారులకు వినతిపత్రం అందజేశాడు.
ఆర్థికంగా ఆదుకోండి..
షుగర్ వ్యాధితో రెండు కాళ్లు కోల్పోయిన తనకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరుతూ మాక్లూర్ మండలం ముల్లంగి గ్రామానికి చెందిన వెంకటరమణ కలెక్టర్ కార్యాలయానికి వచ్చాడు. తనది పేద కుటుంబమని, ఇద్దరు కూతుళ్లు ఉన్నారని, కాళ్లు కోల్పోవడంతో కుటుంబాన్ని పోషించడానికి వీలు లేకుండా పోయిందన్నారు. కుటుంబాన్ని పోషించడానికి ఆర్థికంగా సాయం చేయడంతో ట్రై సైకిల్ ఇప్పించాలని అధికారులకు విన్నవించాడు.