గోడు గోడలకే..
ప్రజావాణి... ప్రతీ సోమవారం మండల, డివిజన్, జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమం. సామాన్యులు తమ గోడు వెల్లబోసుకునేందుకు.. తద్వారా సమస్య పరిష్కారానికి అనువైన వేదిక. కానీ జిల్లా ఉన్నతాధికారులు తమకు ఇచ్చిన అర్జీలను తీసుకోవడం.. ఆ తర్వాత సంబంధిత శాఖలకు పంపించడంతోనే సరిపెడుతున్నారు.
ఫలితంగా సమస్య పరిష్కారం కాక.. అర్జీదారులకు వ్యవయప్రయూసలే మిగులుతున్నారుు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణిపై ‘సాక్షి’ పరిశీలన జరపగా అక్కడికి వచ్చిన బాధితులు పెద్దమొత్తంలో కనిపించారు. కొన్నేళ్లుగా తాము దరఖాస్తు చేస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదంటూ ఆరోపించారు.
- ముకరంపుర
ముకరంపుర: కలెక్టరేట్‌కు సోమవారం జిల్లా నలుమూలల నుంచి 220 మంది బాధితులు తరలివచ్చారు. తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఇందులో ప్రధానంగా ఆహారభద్రత, పెన్షన్లపై దరఖాస్తులున్నారుు. సర్వర్ సమస్యతో నమోదులో జాప్యం జరిగింది. దీంతో సిబ్బంది దరఖాస్తులు తీసుకుని చేతిరాతతో కూడిన రశీదులందించారు. ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు కలెక్టరేట్ సమావేశమందిరంలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం జరిగింది.
అనంతరం 11.15 గంటలకు కలెక్టర్ వీరబ్రహ్మయ్య, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, డీఆర్వో వీరబ్రహ్మయ్య, డీఆర్డీఏ పీడీ విజయగోపాల్ ఒకరి తర్వాత ఒకరు ఆడిటోరియంలో నిర్వహించే ప్రజావాణికి వచ్చారు. బాధితుల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించి కార్యక్రమం ముగించారు. అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఆ తర్వాత వచ్చిన బాధితులు కొంతమంది వెనుదిరిగారు.
కానరాని అధికారులు
ప్రజావాణిలో కలెక్టర్, జేసీతో పాటు జిల్లాస్థారుు అధికారులు పాల్గొనాల్సి ఉంటుంది. కానీ కొన్నిశాఖల అధికారులు తమ కార్యాలయంలోని కిందిస్థాయి సిబ్బందిని పంపి చేతులు దులుపుకుంటున్నారు. కలెక్టర్, జేసీలు ఏదైనా అధికారిక కార్యక్రమంపై బయటికి వెళ్తే ఇక అక్కడ ఒక్క అధికారి కూడా కనిపించడం లేదు. సోమవారం డీపీవో కుమారస్వామి మినహా జిల్లాస్థాయి అధికారులవెరూ ప్రజావాణిలో లేరు. డీఎంహెచ్‌వో బాలు, హౌసింగ్ పీడీ నర్సింహారావు, డీఎస్వో చంద్రప్రకాశ్, వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్ తదితర అధికారులెవరూ కుర్చీలో కానరాలేదు.
ఏం జరుగుతోంది?
ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహించి బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. కలెక్టర్, జేసీ సహా ఉన్నతాధికారులు పాల్గొంటారు. అర్జీలను మొదట ప్రత్యేక కౌంటర్లలో తీసుకుని వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని శాఖల వారీగా ఉన్నతాధికారులకు చేరవేస్తారు. దరఖాస్తు నమోదైనట్లు కౌంటర్‌లో బాధితుడికి ఓ ప్రతి ఇస్తారు. దానిని కలెక్టర్‌కు సమర్పించి గోడు వెల్లబోసుకుంటారు. ఆ తర్వాత ఆ సమస్యను కలెక్టర్ సంబంధిత అధికారులకు రాసి పరిష్కరించాల్సిందిగా సూచిస్తారు.
వెబ్‌సైట్ ఉత్తదే..
ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన ఆయా శాఖల అధికారులు తమకు అందిన అర్జీలు, పరిష్కారం, పురోగతి తదితర వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. కొన్ని శాఖలు ప్రజావాణి ద్వారా సంబంధిత సమస్యలు పరిష్కారం కాబడినవి అంటూ బాధితులకు లేఖలు చేరవేస్తుండడంతో అవాక్కయ్యే సంఘటనలు కనిపిస్తున్నాయి.
మొక్కుబడిగా కార్యక్రమం
ఇక్కడ అధికారులు కంప్యూటర్‌లో దరఖాస్తులు నమోదు చేసుకోవడం.. తర్వాత సంబంధిత శాఖకు బదిలీ చేయడం.. జిల్లా ఉన్నతాధికారులను కలుసుకోవడం వరకు బాగానే ఉంటున్నా అంతా మొక్కుబడి వ్యవహారంగా సాగుతోంది. మండల, డివిజన్ స్థాయిలో ప్రజావాణి ఉన్నా జిల్లా నలుమూలల నుంచి బాధితులు వ్యయప్రయాసల కోర్చి కలెక్టరేట్‌కు తరలివస్తున్నారు. వేలల్లో దరఖాస్తులు వస్తున్నా పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించినట్లే పేర్కొంటున్నారు. సమస్యలు పరిష్కారానికి నోచుకోక బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే వున్నారు.
అధికారులు డుమ్మా
సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి స్పందన కరువైంది. పలు శాఖల అధికారులు డుమ్మా కొట్టారు. చేనేత జౌళి, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఫారెస్ట్, వైద్య, విద్య, వ్యవసాయ శాఖ అధికారులు హాజరు కాలేదు. ఆర్డీవో భిక్షానాయక్ సమక్షంలో జరిగిన ప్రజవాణికి పెద్దగా ఫిర్యాదులు రాలేదు. భూమి సర్వే కోసం వ్యక్తిగత సమస్యలను ప్రస్తావిస్తూ పలువురు దరఖాస్తు చేసుకున్నారు. సిరిసిల్లలో కార్మికుల కూలి ఒప్పందం కోసం చర్చలు నిర్వహించాలని కోరుతూ సీఐటీయూ, నవోదయ పవర్‌లూం కార్మిక సమాఖ్య వినతిపత్రాలు అందించాయి.
ఆగస్టు 19న నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆన్‌లైన్‌లో పూర్తిస్థాయిలో డాటా ఎంట్రీ లేదని, చాలా కుటుంబాల సమాచారం నమోదు కాలేదని నేత చేయూత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కుసుమ విష్ణు, వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు తడుక శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎస్‌కేఎస్ వివరాలు లేకపోవడంతో ఆహారభద్రత, ఆసరా పింఛన్లు అందకుండా పోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
- సిరిసిల్ల
అనాథ లకు నీడనివ్వండి
12 ఏళ్లుగా కరీంనగర్ శివారులోని అద్దె ఇంట్లో వీరబ్రహ్మేంద్ర అనాథాశ్రమం నిర్వహిస్తున్నా. ప్రస్తుతం 33 మంది వృద్ధులున్నారు. వయసు మీరడంతో వారు మరణిస్తున్నారు. ఈ కారణంగా ఇళ్లు ఖాళీ చేయాలని ఇంటి యజమాని ఒత్తిడి పెంచుతున్నాడు. అనాథ వృద్ధులకు ఎక్కడ ఆశ్రయమివ్వాలి. పక్కా ఇళ్ల స్థలం కేటాయించాలని 12 ఏళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంటున్నా ఫలితం లేదు. ప్రస్తుత ఆశ్రమం వద్దే కుంట శిఖం భూమి, వర్మి కంపోస్ట్ షెడ్ ఉంది. అది వీరబ్రహ్మేంద్ర అనాథవృద్ధాశ్రమానికి కేటాయించాలని వేడుకుంటున్నా.
- వీరమాధవ్, వీరబ్రహ్రేంద్ర అనాథాశ్రమం
తెరుచుకోని తహశీల్దార్ చాంబర్
ప్రజాసమస్యల పరిష్కారంలో అధికారుల పట్టింపు కరువైంది. సోమవారం మంథనిలో అసలు ప్రజావాణియే నిర్వహించలేదు. సాక్షి విలేకరి ఉదయం 10-30 గంటలకు తహశీల్దార్ కార్యాలయానికి చేరుకోగా తహశీల్దార్ చాంబర్ ఇంకా తెరుచుకోనే లేదు. గడియ పెట్టి ఉన్న గది ఫొటో తీయగా... ఉదయం 11-30 గంటలకు సిబ్బంది కేవలం గది మాత్రమే తెరిచారు. కానీ అర్జీలు తీసుకునేందుకు ఏ ఒక్క అధికారి అందుబాటులో లేరు.
వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన చాలామంది బాధితులు ప్రజావాణి లేదని తెలుసుకుని నిరాశతో వెనుదిరిగారు. ఇక్కడ ప్రజావాణి ఎందుకు నిర్వహించలేదో అధికారులకే తెలియాలి. డివిజన్‌లోనూ ప్రజావాణి మొక్కుబడిగా సాగింది. తాను ఐకేపీ కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవానికి వెళ్లగా.. డెప్యూటీ తహశీల్దార్ దరఖాస్తుల పరిశీలనకు వెళ్లారని, ఎంపీడీవో కూడా అదే పనిలో ఉన్నారని మంథని తహశీల్దార్ జల్లా సత్తయ్య తెలపడం కొసమెరుపు.
- మంథని
ఒక్కటే దరఖాస్తు
హూజూరాబాద్‌లో ప్రజావాణికి స్పందన కరువైంది. తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి అధికారులెవరూ హాజరుకాలేదు. ఒకే ఒక్కరు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమె దరఖాస్తును కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ రాము తీసుకున్నారు. ఓసారి మండల పరిషత్‌లో.. మరోసారి తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తుతుండడంతో జనం అయోమయానికి గురవుతున్నారు. సర్వే కారణంగా అధికారులు ప్రజావాణికి హాజరు కాలేదని తహశీల్దార్ నాగేశ్వరావు తెలిపారు.
- హుజూరాబాద్ టౌన్
జగిత్యాలలో ఫిర్యాదులు
జగిత్యాలలో నిర్వహించిన ప్రజావాణికి కొంత స్పందన కనిపించింది. ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొందరు సమస్యలపై అధికారులకు అర్జీలు అందించారు. సారంగాపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన సురేందర్‌రావు 105, 107 సర్వే నంబరు రికార్డులో పేరును అక్రమంగా తొలగించారని.. బాధ్యులపై చర్య తీసుకుని న్యాయం చేయాలని వినతిపత్రం అందించారు.
మెట్‌పల్లి మండలం కోనారావుపేట రేషన్ డీలర్ ఎన్.జనార్దన్ సరుకులు సక్రమంగా పంపిణీ చేయడంలేదని.. రాయికల్ మండలం యూసూఫ్‌నగర్‌గీత పారిశ్రామిక సంఘం భూమి సర్వే నంబర్ 631లోని భూమి కబ్జా చేసినవారిపై చర్యలు తీసుకోవాలని కొందరు అర్జీలు సమర్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ కొంరయ్య, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ రాజేశం, హౌసింగ్ డీఈ వెంకన్న, డీఎల్‌పీవో చంద్రశేఖర్, సంక్షేమాధికారులు బాలసురేందర్, జయదేవ్, అబ్రహం, రంగారెడ్డి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, మెట్‌పల్లి సీడీపీవో మమత, ఐకేపీ ఏరియా కో-ఆర్డినేటర్ పద్మ పాల్గొన్నారు. ఆర్డీవో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అధికారులు స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
- జగిత్యాల