ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి ఆదేశించారు.
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయనతో పాటు జేసీ ఉషాకుమారి, డీఆర్వో ఎల్.విజయచందర్‌లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిర్ణీత సమయంలో సృ కమమైన సేవలు అందించటమే అధికారుల ముఖ్య ఉద్దేశంగా భావించాలన్నారు.
జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారి మాట్లాడుతూ గతంలో ఎంపెడా ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల్లో రొయ్యల సాగు చేసుకునేందుకు ప్రభుత్వ భూములు మంజూరు చేసినట్ల చెప్పారు. ఆ భూముల్లో ఇప్పుడు ఎంపెడా ఆధ్వర్యంలో చెరువులు సాగు చేయకపోవటం వల్ల అవి అన్యాక్రాంతమైపోతున్నాయన్నారు. ఆయా భూములను గుర్తించి ఆర్డీవో, మత్స్యశాఖ డీడీ కళ్యాణంలు చెరువుల నిర్మూలనకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ఈ చర్యల్లో భాగంగా సంబంధిత అధికారులు పోలీసు శాఖ సహకారం తీసుకోవాలన్నారు.
అర్జీలు ఇవే..
నూజివీడు మండలం అన్నవరం గ్రామానికి చెందిన ఎ.ఉమాదేవి తన సొంత స్థలం రోడ్లు, భవనాల శాఖ రహదారి నిర్మాణంలో ఆక్రమణకు గురైందని, విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు.
ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి వీటీపీఎస్‌కు సంబంధించి జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణ సభను వాయిదా వేయాలని లేదా రద్దు చేయాలని కోరుతూ గ్రామానికి చెందిన సీహెచ్ వేణుగోపాలరావు అర్జీ సమర్పించారు.
నందిగామ గ్రామానికి చెందిన వికలాంగుడు పొల్లా రాజు తనకు ప్రభుత్వం తరఫున రుణం ఇప్పించాలని వినతిపత్రం అందజేశారు.
ఆగస్టునెల పింఛను తనకు రాలేదని, వెంటనే ఇప్పించాలని కోరుతూ పామర్రుకు చెందిన బట్టా శామ్యూల్ వినతిపత్రం అందించారు.
జిల్లా గిరిజన సంక్షేమశాఖ నుంచి తనకు రుణం ఇప్పించాలని కోరుతూ మొవ్వ మండలం కాజ గ్రామానికి చెందిన కట్టా దనువు వినతిపత్రం అందజేశారు.
ఈ సమావేశంలో డ్వామా పీడీ రవికుమార్, మత్స్యశాఖ డీడీ కల్యాణం, డీపీవో కె.ఆనంద్, డీఈవో దేవానందరెడ్డి, డీఎం అండ్ హెచ్‌వో సరసిజాక్షి, డీఎస్‌వో పీబీ సంధ్యారాణి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ డి.మధుసూదనరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.