ముసాయిదాకు కొన్ని మార్పులతో ఆర్‌వోఆర్ కొత్త చట్టం ‘భూభారతి’రూపకల్పన
భూహక్కుల వివాదాలను ట్రిబ్యునళ్లలో అప్పీల్ చేసుకునే అవకాశం
అప్పీల్‌కు వెళ్లే పరిస్థితి లేని రైతులకు ప్రభుత్వం ద్వారా ఉచిత న్యాయ సహాయం
పహాణీలో సాగుదారు కాలమ్.. భూరికార్డులకు ఆన్‌లైన్‌తోపాటు మాన్యువల్ భద్రత
ఇప్పటివరకు వచ్చిన సాదాబైనామా దరఖాస్తులకే క్రమబద్ధికరణ చాన్స్
అధికారులు తప్పు చేస్తే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి...
రాబోయే రోజుల్లో భూరికార్డుల సంపూర్ణ ప్రక్షాళన చేస్తామన్న సర్కారు
2020 నాటి చట్టాన్ని మార్చి భూభారతి చట్టాన్ని తీసుకురావాల్సిన కారణాలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ముసాయిదాలో పెట్టిన కొన్ని నిబంధనలను మారుస్తూ, కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తూ ‘రికార్డ్ ఆఫ్ రైట్స్–2024’బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీనిని ‘తెలంగాణ భూభారతి (రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) చట్టం–2024’గా పిలుస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన ప్రభుత్వం దీనికి సంబంధించిన ముసాయిదాను విడుదల చేసింది. అందులో 20 సెక్షన్లు ఉండగా.. తాజాగా సవరణలు, మార్పులతో అసెంబ్లీ ముందు పెట్టిన బిల్లులో 23 సెక్షన్లు ఉన్నాయి.
ల్యాండ్ ట్రిబ్యునళ్ల ఏర్పాటు, పహాణీలో సాగుదారుకాలమ్, రెవెన్యూ మాన్యు వల్ రికార్డుల నిర్వహణ, ఉచిత న్యాయ సహాయం, ఇప్పటివరకు దరఖాస్తులు అందిన సాదాబైనామాల క్రమబద్ధీకరణ, తప్పుచేసిన అధికారులకు శిక్షలు, కోర్టుకు వెళ్లడంపై స్పష్టత వంటి కొత్త నిబంధనలను దీనిలో చేర్చారు. ధరణిలో ఉన్న వివరాలు తాత్కాలికంగానే భూభారతిలోకి వస్తాయని... రానున్న రోజుల్లో ఈ రికార్డుల సంపూర్ణ ప్రక్షాళన ఉంటుందని అందులో పేర్కొన్నారు. ముసాయిదాలో పేర్కొన్న విధంగా మ్యుటేషన్ చేసే అధికారం ఆర్డీవోలకు, రిజి్రస్టేషన్ తర్వాత మ్యుటేషన్ సమయంలో విచారణ, తప్పులుంటే మ్యుటేషన్ నిలిపివేత, పరిష్కార బాధ్యతలు కలెక్టర్ల నుంచి ఆర్డీవోలకు బదలాయింపు, ప్రతి భూకమతానికి భూదార్, ఆబాదీలకూ హక్కుల రికార్డు, హక్కుల బదలాయింపు జరగ్గానే గ్రామ పహాణీలో నమోదు, భూముల రీసర్వే వంటివి కొనసాగించారు.
మళ్లీ రెవెన్యూ ట్రిబ్యునళ్లు
భూభారతి ద్వారా రెవెన్యూ ట్రిబ్యునళ్లు మళ్లీ ఏర్పా టు కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ఈ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయ వచ్చు. ఎన్ని, ఏ స్థాయిలో ఏర్పాటు చేయాలన్న వె సులుబాటు ప్రభుత్వానికే ఉంటుంది. అవి ఏర్పాట య్యేంత వరకు సీసీఎల్‌ఏనే ల్యాండ్ ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారు. తహసీల్దార్లు, సబ్‌రిజి్రస్టార్లు తీసు కునే నిర్ణయాలపై 60 రోజుల్లోగా ఆర్డీవోకు దర ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్డీవోల నిర్ణయాలపై 60 రోజుల్లోగా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. భూదార్ కార్డుల జారీ, పట్టాదారు పాసు పుస్తకాల జారీకి సంబంధించిన అప్పీళ్లను ఆర్డీవోకు చేసుకోవాలి.
ఈ క్రమంలో ఆర్డీవోలు తీసుకునే నిర్ణయంతో విభేదిస్తే.. 30 రోజుల్లోపు కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోవాలి. కలెక్టర్ల నిర్ణయాలతో విభేదిస్తే 30 రోజుల్లోపు ట్రిబ్యునల్‌కు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ విషయంలో ట్రిబ్యునల్ తీసుకునే నిర్ణయమే ఫైనల్. ట్రిబ్యునల్స్ లేదా అప్పిలేట్ అథారిటీలకు అప్పీల్ చేసుకునే పరిస్థితి లేని రైతులకు ప్రభుత్వం ఉచితంగా న్యాయ సహాయం అందిస్తుంది.
కోర్టుకు వెళ్లడంపై స్పష్టత..
సర్వే నంబర్లను అవసరానికి అనుగుణంగా సబ్ డివిజన్ చేసుకునేందుకు ఈ చట్టం వెసులుబాటు కల్పిస్తోంది. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, భూదాన్, అసైన్డ్, లావణి భూముల వివాదాలపై సుమోటోగా, లేదంటే ఏదైనా దరఖాస్తు ద్వారా తీసుకుని విచారించి రికార్డులను సరిచేసే అధికారం, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమి బదిలీ తిరిగి ప్రభుత్వానికి దఖలు పరుచుకునే అధికారం భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ)కు ఉంటుంది.
అప్పిలేట్ అథారిటీలు, రివిజన్ అథారిటీలకు సివిల్ కోర్టులకుండే అధికారాలను ఈ చట్టం ద్వారా కల్పిస్తున్నారు. భూరికార్డులను తారుమారు చేసిన, హక్కుల రికార్డు విషయంలో తప్పులు చేసిన అధికారులను సరీ్వసు నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఇక కేవలం యాజమాన్య హక్కుల గురించి మాత్రమే సివిల్ కోర్టులకు వెళ్లాల్సి ఉంటుందని... రికార్డుల్లో సవరణలు, తప్పొప్పుల గురించి కోర్టుకు వెళ్లడం కుదరదని ఈ చట్టంలో స్పష్టం చేశారు.
వైఎస్ హయాంలో పెట్టిన పేరు.. ‘భూభారతి’
తెలంగాణలో అమల్లోకి రానున్న కొత్త ఆర్‌వోఆర్ చట్టానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అమలు చేసిన ఒక భూసంబంధిత ప్రాజెక్టు పేరును ఖరారు చేయడం గమనార్హం. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలోనే తొలి భూరికార్డుల ఆధునీకరణ పైలట్ ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ప్రారంభించారు. ఆ ప్రాజెక్టుకు ‘భూభారతి’అని పేరుపెట్టారు. తాజాగా కొత్త చట్టానికి భూమాత, భూభారతి, వెబ్‌ల్యాండ్, మాభూమి అని నాలుగు పేర్లను ప్రతిపాదించారు. ఇందులో ప్రభుత్వం భూభారతిని ఖరారు చేసింది. సర్క్యులేషన్ విధానంలో మంత్రివర్గ ఆమోదం తీసుకుని ఈ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ చట్టం ఎందుకు తెస్తున్నామంటే!
కొత్త చట్టాన్ని తెచ్చేందుకు కారణాలను అసెంబ్లీలో పెట్టిన బిల్లులో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 2020 అక్టోబర్ 29 నుంచి అమల్లోకి వచ్చిన ప్రస్తుత చట్టం కారణంగా భూయజమా నులకు ఇబ్బంది కలిగిందని, ధరణి పోర్టల్‌లో లెక్కలేనన్ని పొరపాట్లు ఉన్నాయని పేర్కొంది. ఆ పొరపాట్లను సరిదిద్దే వెసులుబాటును ఆ చట్టం కల్పించలేదని, భూమి రికార్డులను సరిదిద్దుకునేందుకు సివిల్ కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితులను కలి్పంచిందని తెలిపింది. సాదాబైనామాల క్రమబద్ధికరణకు కావాల్సిన వెసులుబాటు అందులో లేదని పేర్కొంది.
సభ ముందు ఉంచిన కొత్త చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులు, భూ ముల వివాదాలు తగ్గుతాయని.. ప్రజలు వారి ఆ స్తులు, భూములను వారి అవసరాలకు వినియోగించుకునేందుకు, వారికి ఆర్థిక స్థిరత్వం కలిగించేందుకు ఉపయోగపడుతుందని ప్రభు త్వం తెలిపింది.
ప్రభుత్వ భూముల రక్షణ, సులభతరంగా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా భూరికార్డుల పోర్టల్ నిర్వహణ, సాదాబైనామాల క్రమబద్ధీకరణ, ప్రతి భూమికి భూదార్ నంబర్, కార్డుల జారీ, వ్యవసాయేతర భూములు, ఆబాదీల హ క్కుల కోసం రికార్డు తయారీ, హక్కుల రికార్డులో మ్యుటేషన్ పద్ధతిని సరిదిద్దడం, భూరికార్డుల పో ర్టల్‌లో నమోదైన తప్పులను సరిచేసే వ్యవస్థను నెలకొల్పడం, పార్ట్–బీలో పెట్టిన భూముల సమస్యలను పరిష్కరించడం, ప్రస్తుత రికార్డులను అప్‌గ్రేడ్ చేయడంతోపాటు భూముల రీసర్వే నిర్వహించి కొత్త రికార్డు తయారు చేయడమే లక్ష్యంగా కొత్త చట్టాన్ని తెస్తున్నామని స్పష్టం చేసింది.
24 సార్లు సవరణలు చేసి.. సభ ముందుకు..
భూభారతి చట్టం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది. ఈ ఏడాది ఆగస్టు 2న ముసాయిదాను విడుదల చేసింది. అన్ని వర్గాల నుంచి ఆన్‌లైన్ ద్వారా సలహాలు, సూచనలు స్వీకరించింది. జిల్లాస్థాయిలో సదస్సులు నిర్వహించి అభిప్రాయాలను తెలుసుకుంది. ఆయా అంశాలన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించి.. ముసాయిదాను 14 సార్లు సవరించింది. సీఎం, రెవెన్యూ మంత్రి, ఉన్నతాధికారులతో చర్చిస్తూ చట్టాన్ని అసెంబ్లీలో పెట్టడానికి కొన్ని గంటల ముందు వరకు కూడా సవరించుకుంటూ వచ్చారు.
మొత్తంగా 24 సార్లు సవరించి.. 24వ ముసాయిదాను ఫైనల్ చేసి భూభారతి–2024 చట్టం బిల్లును అసెంబ్లీ ఆమోదానికి ఉంచారు. అటు ముసాయిదా, ఇటు అసెంబ్లీ ముందు పెట్టిన బిల్లు రూపకల్పనలో భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్‌కుమార్ ప్రత్యేక కృషి చేయగా... రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిత్తల్, సీసీఎల్‌ఏ అసిస్టెంట్ సెక్రటరీ వి.లచ్చిరెడ్డి కీలకపాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment