
2025–26 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి..
సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం
ప్రయోగాత్మకంగా డిజిటల్ మూల్యాంకనం
నైపుణ్యంతో కూడిన బోధన ప్రణాళికకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) నిర్వహించే 12వ క్లాస్ పరీక్షలకు ఇకనుంచి ప్రాథమిక స్థాయి (బేసిక్) కాలిక్యులేటర్‌ను అనుమతించనున్నారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఇది అమలులోకి వస్తుంది. సాధారణ కూడికలు, తీసివేతలు, భాగాహారాలకు సంబంధించిన ప్రోగ్రామ్ ఉండే కాలిక్యులేటర్‌ను మాత్రమే విద్యార్థులు పరీక్షకు తీసుకెళ్ళవచ్చు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన కాలిక్యులేటర్‌ను అనుమతించరు. సీబీఎస్‌ఈ 140వ బోర్డ్ మీటింగ్ సోమవారం జరిగింది. ఇందులో కాలిక్యులేటర్‌కు అనుమతితో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థి ఆలోచన శక్తిని సరికొత్త కోణంలో అంచనా వేయడం, సిలబస్ విధానం, మూల్యాంకనంలో మార్పులు తదితర సంస్కరణలు తీసుకొచ్చారు.
ఇకనుంచి ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానం
ఇకనుంచి ఆన్ స్క్రీన్ మార్కింగ్ (ఓఎంఎస్) విధానంతో డిజిటల్ మూల్యాంకనం పద్ధతిని అనుసరించాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. ప్రశ్నపత్రాలను స్కాన్ చేసి, సాఫ్ట్‌వేర్ ద్వారా మూల్యాంకనం చేస్తారు. దీనివల్ల ఫలితాలు త్వరగా వెల్లడయ్యే వీలుంది. అంతే కాకుండా మూల్యాంకనంలో తప్పులను సాఫ్ట్‌వేర్ గుర్తించేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియను ముందుగా 10, 12 తరగతుల సైన్స్, మేథ్స్ సప్లిమెంటరీ పరీక్షలకు పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించారు.
సబ్జెక్టుల్లో నైపుణ్యం మేళవింపు
చదువుతున్నప్పుడే నైపుణ్యం సంపాదించాలనే సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తేవాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. పారిశ్రామిక భాగస్వామ్యంతో నైపుణ్యాన్ని సబ్జెక్టుల్లో మేళవించే ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. టెన్త్ స్టాండర్డ్ నుంచే దీన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. పాఠం పూర్తయిన రోజే సైన్స్, సోషల్ సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహిస్తారు. లోతైన ప్రశ్నలతో కూడిన రీజనింగ్ అంశాలను విద్యార్థులకు అందిస్తారు. ఈ మేరకు బోధన ప్రణాళికకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ విధానం 2026–27 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment