సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య సీట్ల భర్తీకి సంబంధించి ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ‘నేషనల్ పూల్’అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నేషనల్ పూల్‌లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ), నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఈ) అంగీకారం తెలిపాయి. అయితే ఇందుకు అనుగుణంగా నేషనల్ పూల్ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి గత ఫిబ్రవరిలోనే ఆమోదం వచ్చినా.. ఇప్పటి వరకు నేషనల్ పూల్ విధానంపై స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వలేదు.
దీంతో వైద్య విద్య డిగ్రీ సీట్ల భర్తీ ప్రక్రియపై అస్పష్టత నెలకొంది. నేషనల్ పూల్‌పై ఉత్తర్వులు జారీ అయితేనే సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. వైద్య విద్య డిగ్రీ సీట్ల భర్తీ కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలు ఇటీవల వెల్లడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీట్ల భర్తీ కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. జూలైలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వర్సిటీ ఉన్నతాధికారులు వెల్లడించారు.
అమల్లోనే తెలుగు రాష్ట్రాల కోటా..
నేషనల్ పూల్ విధానం అమల్లోకి వచ్చినా తెలుగు రాష్ట్రాల కోటా అలానే ఉంటుంది. ఇలా అయితేనే న్యాయపరమైన చిక్కులు ఉండవని న్యాయ శాఖ స్పష్టం చేసింది. దీంతో వైద్య విద్య డిగ్రీ సీట్ల భర్తీలో ఈ ఏడాది నుంచి నేషనల్ పూల్‌తోపాటు తెలుగు రాష్ట్రాల కోటా కూడా అమలుకానుంది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ వంటి వైద్య విద్య డిగ్రీ సీట్లను నీట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న జమ్మూకశ్మీర్ వైద్య సీట్లను సొంతంగానే భర్తీ చేసుకుంటోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఈ ఏడాది నుంచి నేషనల్ పూల్‌లోకి చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment