Neat exam
-
నీట్లో సీటు రాలేదని యువకుడి ఆత్మహత్య.. అంత్యక్రియల తర్వాత తండ్రి..
సాక్షి, చైన్నె: నీట్లో సీటు దక్కలేదనే మనస్థాపంతో క్రోంపేటకు చెందిన విద్యార్థి జగదీశ్వరన్ (19) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో కుమారుడి మృతిని తట్టుకోలేక తండ్రి సెల్వ శేఖరన్(48) కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి తనయుడు మృతి చెందడంపై సీఎం స్టాలిన్‌ను దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివరాలు.. వైద్యకోర్సుల్లో ప్రవేశానికి కేంద్రం తీసుకొచ్చిన నీట్ పరీక్షను ఆది నుంచి డీఎంకే ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. నీట్ రద్దు, తమిళనాడుకు మినహాయింపు నినాదంతో అసెంబ్లీలో చేసిన తీర్మానాలను గవర్నర్ ఆమోదం ఇంతవరకు లభించలేదు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 7.5 శాతం సీట్లను కేటాయిస్తూ వస్తున్నారు. ప్లస్–2లో మంచి మార్కులు సాధించినా, నీట్లో ఉత్తీర్ణత స్థాధించినా కటాఫ్ మార్కుల ఆధారంగా ఈ సీట్లు కూడా దక్కక పోవడంతో అనేక మంది పేద విద్యార్థులు తీవ్ర మనస్థాపం చెందుతున్నారు. ఏటా సీట్లు దక్కక బలన్మరణానికి పాల్పడుతున్న విద్యార్థులు రాష్ట్రంలో ఉన్నారు. ఈ ఏడాది జగదీశ్వరన్ ఆత్మహత్య చేసుకున్నారు. అతడి తండ్రి కూడా విగత జీవి కావడం చర్చనీయాంశంగా మారింది మంచి మార్కులు సాధించినా.. చైన్నె క్రోంపేట కురింజి నగర్‌కు చెందిన సెల్వ శేఖరన్(48) ఫొటోగ్రాఫర్. సింగిల్ పేరెంట్‌గా ఉన్న ఆయన తనయుడు జగదీశ్వరన్‌ను సీబీఎస్ఈలో చదివించాడు. ప్లస్–2లో 85 శాతానికి పైగా మార్కులు సాధించాడు. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే ఆశతో జగదీశ్వరన్ ఉన్నాడు. అయితే, ప్రైవేటులో లక్షలు పోసి సీట్ల కొనే స్తొమత లేకపోవడంతో.. ఎలాగైనా ప్రభుత్వ కోటా సీటు దక్కించుకోవాలని ప్రయత్నం చేశాడు. రెండు సార్లు నీట్ పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు. ఈ ఏడాది కూడా కటాఫ్ మార్కులతో ప్రభుత్వ కోటా సీటు దూరమైంది. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన జగదీశ్వరన్ శనివారం రాత్రి ఇంట్లో బలన్మరణానికి పాల్పడ్డాడు. ఆదివారం అతడి గదిలో లభించిన లేఖ ఆధారంగా తన కుమారుడిని నీట్ మింగేసినట్టు మీడియా ముందుకు వచ్చి సెల్వ శేఖరన్ రోదించాడు. తన కుమారుడికి ఎదురైన పరిస్థితి మరో విద్యార్థికి రాకూడదని కన్నీటి పర్యంతమయ్యారు. నీట్‌ను రద్దు చేయాలని నినాదించాడు. అదే సమయంలో తనయుడి మరణాన్ని తట్టుకోలేక ఆదివారం రాత్రి ఆయన కూడా ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. క్రోంపేట జీహెచ్‌లో ఉన్న వీరి మృత దేహాలకు మంత్రి ఉదయ నిధి స్టాలిన్ నివాళులర్పించారు. కాగా తమ మిత్రుడికి మార్కులు ఉన్నా, ఆర్థిక స్థోమత అడ్డు రావడంతోనే సీటు దూరమైందని జగదీశ్వరన్ కన్నీటి పర్యంతమయ్యారు. నీట్ ముసాయిదాను ఆమోదించాలని రాష్ట్రపతికి సీఎం స్టాలిన్ లేఖ తండ్రి , తనయుడి మరణ సమాచారంతో సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థులు ఆందోళన, ఒత్తిడికి లోను కావద్దు అని, త్వరలో నీట్ రద్దు అయ్యేపరిస్థితులు ఉన్నాయన్నారు. త్వరలో రాజకీయ మార్పులు తప్పవని, నీట్ అనే గోడలను బద్దలు కొట్టి తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ముసాయిదాలను ఆమోదించకుండా, ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు అనుకూలంగా ఈ గవర్నర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇక నీట్ మినహాయింపు ముసాయిదాను ఆమోదించాలని సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సీఎం స్టాలిన్ లేఖ రాశారు. తమిళనాడులో విద్యార్థుల బలవన్మరణాలను అందులో ప్రస్తావించారు. న్యాయం చేయాలని కోరారు. -
జనవరి 12 నుంచి నీట్ పీజీ కౌన్సెలింగ్
న్యూఢిల్లీ: ఈనెల 12 నుంచి నీట్– పీజీ కౌన్సెలింగ్ ఆరంభమవుతుందని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. 2021–22 సంవత్సరానికి కౌన్సెలింగ్ నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు ఈ నెల 7న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కౌన్సెలింగ్‌లో 27 శాతం ఓబీసీ, 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను సుప్రీం సమర్ధించింది. కోర్టు తీర్పుకు అనుగుణంగా కౌన్సెలింగ్ చేపట్టేందుకు సిద్ధమైనట్లు మంత్రి తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌లో నీట్ పీజీ పరీక్ష జరిగింది. అదేనెల్లో ఫలితాలు ప్రకటించారు. సుమారు 45వేల మెడికల్ పీజీ సీట్లను కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్‌ను త్వరగా చేపట్టాలని గతనెల్లో దేశవ్యాప్తంగా రెసిడెంట్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. -
25 నుంచి నీట్ పీజీ–2021 కౌన్సెలింగ్
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) పీజీ–2021 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ(ఎంసీసీ) శుక్రవారం విడుదల చేసింది. మొదటి రౌండ్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈనెల 25 నుంచి 29 వరకు జరుగనుంది. రెండో రౌండ్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ నవంబర్ 15 నుంచి 19 వరకు ఉంటుంది. మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ నవంబర్ 1, 2 తేదీల్లో జరుగుతుంది. ఈ ప్రక్రియ ఫలితాలు నవంబర్ 3న విడుదలవుతాయి.రాష్ట్ర నీట్ పీజీ కోటా సీట్ల కోసం కౌన్సెలింగ్‌ను సంబంధిత రాష్ట్ర వైద్య కౌన్సెలింగ్ కమిటీలు నిర్వహిస్తాయని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ప్రకటించింది. 50 శాతం ఆల్ ఇండియా కోటా, డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీలు, ఏఎఫ్ఎంఎస్ (ఎండీ/ఎంఎస్/డిపొ్లమా/పీజీ డీఎన్బీ) సీట్ల భర్తీకి నీట్ పీజీ కౌన్సెలింగ్ ప్రక్రియను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహించనుంది. కాగా డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీ సీట్లు, పీజీ డీఎన్బీ సీట్ల ప్రవేశానికి అదనపు మోప్–అప్ రౌండ్ నిర్వహించనున్నారు. ఆఖరున మిగిలిన సీట్ల కోసం ప్రత్యేకంగా మరో రౌండ్ కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. -
ఈ ఏడాది పాత పద్ధతిలోనే నీట్ ఎస్ఎస్ పరీక్షలు
న్యూఢిల్లీ: వైద్య విద్యలో స్పెషలైజేషన్ కోర్సుల కోసం ఉద్దేశించిన నీట్ సూపర్ స్పెషాలటీ పరీక్షలు ఈ ఏడాదికి పాత పద్ధతిలోనే జరుగుతాయని సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 2022–23 విద్యా సంవత్సరం నుంచి మార్పుల్ని అమలు చేస్తామని వెల్లడించింది. కేంద్ర నిర్ణయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి బుధవారం సుప్రీం బెంచ్‌కి తెలిపారు. ‘పాత విధానంలో పరీక్షలకు సిద్ధమైన విద్యార్థుల్ని దృష్టిలో ఉంచుకొని జాతీయ మెడికల్ కమిషన్, జాతీయ పరీక్షల బోర్డుతో సంప్రదించిన తర్వాత వచ్చే ఏడాది నుంచి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది’ అని ఆమె తెలిపారు. నవంబర్ 13–14 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షల్ని వాయిదా వేసే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలిపారు. ఈ ఏడాది నుంచే నీట్ పరీక్షలో మార్పులుంటాయని నోటిఫికేషన్ వెలువడ్డాక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 41 మంది పోస్టు గ్రాడ్యుయేట్ డాక్టర్లు, ఇతర వైద్య విద్యార్థులు సుప్రీంకోర్టుకెక్కడంతో అత్యున్నత న్యాయస్థానం మంగళవారం వారి పిటిషన్లు విచారించింది. కేంద్రం తీరుపై సుప్రీం బెంచ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పరీక్షకు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత సిలబస్ మార్చడం ఏమిటని కేంద్రాన్ని నిలదీసింది. -
షూస్ కాదు.. చెప్పులేసుకోవాలి!
సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) డ్రెస్ కోడ్ విధించింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. సంప్రదాయ దుస్తులు అంటే బురఖా లాంటివి ధరించేవారు ముందుగానే పరీక్ష కేంద్రానికి రావాలి. వారిని నిబంధనల ప్రకారం తనిఖీ చేసి పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. తేలికపాటి, హాఫ్ స్లీవ్స్ దుస్తులు ధరించి రావాలి. పెద్ద బటన్లు, ఫుల్ స్లీవ్స్ దుస్తులకు అనుమతిలేదు. బూట్లకు బదులు చెప్పులు, శ్యాండిళ్లు మాత్రమే వేసుకోవాలి. ఇక అడ్మిట్‌కార్డుతో పాటు గుర్తింపు కార్డును కూడా తీసుకురావాలి. థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే అనుమతి.. ► మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకూ పరీక్ష జరుగుతుంది. అన్ని కేంద్రాల్లో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాకే విద్యార్థులు, సిబ్బందిని అనుమతిస్తారు. ► పరీక్ష హాల్లో ప్రతి విద్యార్థీ ఆరడుగుల భౌతిక దూరం పాటించాలి. మాస్కులు, గ్లౌజులు ధరించాలి. తరచూ చేతుల్ని శానిటైజ్ చేసుకోవాలి. ► ఒకవేళ ఆరోగ్య సమస్యలు తలెత్తితే వారిని సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి పంపి, ఇతర మార్గాల ద్వారా పరీక్ష రాసే అవకాశాల్ని కల్పిస్తారు. ► పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, బ్యాగులు సహా ఇతరత్రా వ్యక్తిగత వస్తువులకు అనుమతి లేదు. ► పేపర్లను పంచేటప్పుడు లేదా లెక్కించేప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ లాలాజలాన్ని వాడరాదు. ► ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ, కృష్ణా, చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో 151 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. ► 2019లో ఏపీ నుంచి 57,755 మంది దరఖాస్తు చేయగా, ఇప్పుడా సంఖ్య 61,892కు పెరిగింది. ► ఈ ఏడాది అత్యధికంగా మహారాష్ట్రలో 2,28,914 మంది పరీక్ష రాస్తుండగా, అత్యల్పంగా మిజోరాంలో 1,741 మంది రాస్తున్నారు. -
‘నీట్’ తీర్పుపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రాల్లో తప్పులు దొర్లినందుకు గాను విద్యార్థులకు గ్రేస్‌మార్కులు కలపాలన్న మద్రాస్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నీట్ తమిళం ప్రశ్నపత్రంలో 49 ప్రశ్నలు తప్పుగా ప్రచురితమయ్యాయి. దీనిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీన్ని విచారించిన మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఇంగ్లిష్ నుంచి తమిళంలోకి అనువదించే క్రమంలో జరిగిన పొరపాటు కారణంగా తప్పుగా ప్రచురితమైన 49 ప్రశ్నలకుగాను పరిహారంగా నాలుగేసి మార్కుల చొప్పున మొత్తం 196 మార్కులు కలపాలని తీర్పిచ్చింది. ఫలితాల జాబితాను మళ్లీ విడుదల చేయాలని నీట్‌ను నిర్వహించిన సీబీఎస్‌ఈను ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఎస్ఈ సుప్రీంకోర్టును ఆశ్రయించగా శుక్రవారం సుప్రీంబెంచ్ విచారించింది. హైకోర్టు తీర్పును సమర్ధిస్తే.. తమిళ మాధ్యమంలో పరీక్ష రాసిన విద్యార్థులు మిగతా భాషల్లో రాసిన వారి కంటే మెరుగైన మార్కులు సాధించినట్లవుతుందని న్యాయస్థానం పేర్కొంది. ఈ రకమైన పద్ధతిలో మార్కులు కలపలేమని వ్యాఖ్యానించిన తదుపరి వాదనలను రెండు వారాలకు వాయిదా వేసింది. వైద్య, దంత కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) మే 6వ తేదీన దేశవ్యాప్తంగా 136 నగరాల్లో జరిగింది. పరీక్షలో 180 ప్రశ్నలకు గాను 720 మార్కులుంటాయి. తమిళనాడులో తమిళ మాధ్యమంలో సుమారు లక్ష మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. -
‘నేషనల్ పూల్’పై స్పష్టతేదీ?
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య సీట్ల భర్తీకి సంబంధించి ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ‘నేషనల్ పూల్’అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నేషనల్ పూల్‌లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ) అంగీకారం తెలిపాయి. అయితే ఇందుకు అనుగుణంగా నేషనల్ పూల్ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి గత ఫిబ్రవరిలోనే ఆమోదం వచ్చినా.. ఇప్పటి వరకు నేషనల్ పూల్ విధానంపై స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో వైద్య విద్య డిగ్రీ సీట్ల భర్తీ ప్రక్రియపై అస్పష్టత నెలకొంది. నేషనల్ పూల్‌పై ఉత్తర్వులు జారీ అయితేనే సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. వైద్య విద్య డిగ్రీ సీట్ల భర్తీ కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలు ఇటీవల వెల్లడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీట్ల భర్తీ కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. జూలైలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వర్సిటీ ఉన్నతాధికారులు వెల్లడించారు. అమల్లోనే తెలుగు రాష్ట్రాల కోటా.. నేషనల్ పూల్ విధానం అమల్లోకి వచ్చినా తెలుగు రాష్ట్రాల కోటా అలానే ఉంటుంది. ఇలా అయితేనే న్యాయపరమైన చిక్కులు ఉండవని న్యాయ శాఖ స్పష్టం చేసింది. దీంతో వైద్య విద్య డిగ్రీ సీట్ల భర్తీలో ఈ ఏడాది నుంచి నేషనల్ పూల్‌తోపాటు తెలుగు రాష్ట్రాల కోటా కూడా అమలుకానుంది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ వంటి వైద్య విద్య డిగ్రీ సీట్లను నీట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న జమ్మూకశ్మీర్ వైద్య సీట్లను సొంతంగానే భర్తీ చేసుకుంటోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఈ ఏడాది నుంచి నేషనల్ పూల్‌లోకి చేరాయి. -
క‘న్నీటి’ నిబంధనలు!
సాక్షి, హైదరాబాద్: నీట్ నిబంధనలు విద్యార్థులకు చుక్కలు చూపించాయి. పరీక్ష కేంద్రాల కేటాయింపు నుంచి నిమిషం ఆలస్యం నిబంధన దాకా.. బూట్లు, గడియారాల వంటివాటితోపాటు చెవి కమ్మలు, గాజులు, ఉంగరాలు, కాలిపట్టీలను కూడా అనుమతించకపోవడంతో నానా గందరగోళం నెలకొంది. పరీక్షా కేంద్రాల్లో తనిఖీలతో అభ్యర్థులు భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది విద్యార్థులను ఆపాద మస్తకం తనిఖీ చేయడంతోపాటు టార్చ్‌లైట్ సహాయంతో చెవుల్లోనూ పరిశీలించారు. ఫుల్ హ్యాండ్ షర్టులు ధరించి వస్తే.. షర్టు చేతులను సగానికి కత్తిరించారు. కనీసం చెమట తుడుచుకునేందుకు వెంట తెచ్చుకున్న చేతి రుమాళ్లను కూడా పరీక్షా కేంద్రంలోనికి తీసుకెళ్లనివ్వలేదు. అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ మెటల్ డిటెక్టర్లను వినియోగించారు. ఉదయం ఏడు నుంచే క్యూ కట్టిన విద్యార్థులు రాష్ట్రంలో 81 పరీక్ష కేంద్రాల్లో నీట్ పరీక్ష జరిగింది. మొత్తంగా 50,856 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో ఒక్క హైదరాబాద్‌లోనే 30 వేలకుపైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. చాలా మంది విద్యార్థులు ఉదయం ఏడు గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఎండ తీవ్రంగా ఉండటంతో విద్యార్థులు, వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఉదయం 8 గంటల నుంచి 9.30 గంటల వరకు అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతించారు. 9.30 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించలేదు. పోలీసుల తోడ్పాటు పరీక్షకు.. హైదరాబాద్‌లో పలు కేంద్రీయ విద్యాలయాల్లో నీట్ పరీక్ష జరిగింది. అయితే పేర్లు ఒకేలా ఉండటంతో చాలామంది విద్యార్థులు పొరపాటున.. ఒకదానికి బదులుగా మరో సెంటర్‌కు వెళ్లారు. అక్కడికి వెళ్లాక సెంటర్ అదికాదని తెలిసి గాభరాగా మరో సెంటర్‌కు పరుగెత్తారు. ఇలాంటి పలువురు విద్యార్థులు చివరి నిమిషంలో పోలీసుల సహాయంతో.. సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోగలిగారు. హయత్‌నగర్‌కు చెందిన శ్రావ్య 9:20 గంటలకు తిరుమలగిరిలో కేంద్రీయ విద్యాలయానికి చేరుకుంది. కానీ పరీక్ష కేంద్రం అది కాదని.. బొల్లారం కేంద్రీయ విద్యాలయకు వెళ్లాలని అక్కడి సిబ్బంది సూచించారు. అప్పటికే పరీక్షా సమయం దగ్గరపడటంతో ఆమె భోరుమంది. అది గమనించిన తిరుమలగిరి పోలీస్‌స్టేషన్ కానిస్టేబుళ్లు చంద్రశేఖర్‌వర్మ,, హరిరామశర్మ.. తమ పెట్రోలింగ్ వాహనంలో శ్రావ్యను కూర్చుండబెట్టుకుని, మిలటరీ అధికారుల అనుమతితో మిలటరీ మార్గం ద్వారా వేగంగా పరీక్ష కేంద్రానికి చేర్చారు. మధ్యలో మరో ఇద్దరు విద్యార్థినులు కూడా బొల్లారం పరీక్ష కేంద్రానికి పరుగులు తీస్తుండటం చూసి.. వారిని సైతం వాహనంలో కూర్చోబెట్టుకుని పరీక్ష సెంటర్‌కు చేర్చారు. పోలీసుల తీరును విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసించారు. నిమిషం ఆలస్యంతో ఆశలు ఆవిరి.. కూకట్‌పల్లిలోని డీఏవీ స్కూల్ పరీక్ష కేంద్రానికి ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన బోయ తులసి నిమిషం ఆలస్యంగా చేరుకుంది. పరీక్ష కేంద్రం చిరునామా తెలియక ఆలస్యమైందని ఆమె బతిమాలినా.. అధికారులు ఆమెను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. దాంతో కన్నీటితో వెనుదిరిగింది. డిఫెన్స్ లేబొరేటరీ పరీక్ష కేంద్రంలో నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన అభ్యర్థి సుజాత, కేపీహెచ్‌బీకాలనీలోని మెరీడియన్ పాఠశాల కేంద్రం వద్దకు ఒక్క నిమిషం ఆలస్యంగా చేరుకున్న గొట్టిముక్కల నాగరచనాదేవి అనే విద్యార్థి, బంజారాహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ కేంద్రంలో పాతిక మందికిపైగా విద్యార్థులు పరీక్ష రాయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. -
దేశవ్యాప్తంగా నేడు నీట్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశపరీక్ష(నీట్)ను నేడు(ఆదివారం) నిర్వహించనున్నారు. ఏపీలో 49,210 మంది, తెలంగాణలో 50,856 మంది నీట్ రాస్తున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగు తుంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల లోపలికి ఉదయం 7.30 నుంచి 9.30 లోపు చేరుకోవాలి. ఆ తర్వాత వచ్చినవారిని అనుమతించరు. దేశవ్యాప్తంగా 13,26,725 మంది పరీక్షకు హాజరవుతున్నారని సీబీఎస్ఈ తెలిపింది. నిబంధనలివే.. నిబంధనల మేరకు అభ్యర్థులు ఎలాంటి ఆభరణాలు ధరించకూడదని, రింగులు, చైన్లు, వాచీలు నిషిద్ధమని అధికారులు చెప్పారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువు (ఫోన్లు, ట్యాబ్‌లు, బ్లూటూత్‌లు, కాలిక్యులేటర్లు)లను అనుమతించబోమని వెల్లడించారు. అమ్మాయిలు జడ వేసుకుని పరీక్షకు రావాలని పేర్కొన్నారు. అబ్బాయిలు ఫార్మల్ డ్రెస్‌లో రావాలని బిగుతుగా ఉన్న జీన్స్ ధరించకూడదన్నారు. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా బూట్లు ధరించి పరీక్షకు రాకూడదని తెలిపారు. పరీక్ష రాయడానికి పెన్ను, పెన్సిల్‌ను కూడా నిర్వాహకులే ఇస్తారని చెప్పారు. -
కార్యరూపం దాల్చని మంత్రి కామినేని హామీ
‘నీట్’ రాయాలంటే విజయవాడ వెళ్లాల్సిందే చిత్తూరు :రాయలసీమ పరిధిలోని చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో బైపీసీ చదువుతున్న విద్యార్థులకు తిరుపతిలో నీట్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ ఏడాది ఫిబ్రవరి 20న హామీ ఇచ్చారు. ఈ హామీతో రాయలసీమలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తిరుపతికి పరీక్ష కేంద్రం వస్తుందని అప్పట్లో ఆశించారు. అయితే ప్రస్తుతం పరీక్షలు సమీపిస్తున్నా తిరుపతిలో పరీక్ష కేంద్రం ఏర్పాటుపై మంత్రి కామినేని నుంచి స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నీట్’కు విద్యార్థులు నమోదు చేసుకున్న వివరాల్లో ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకోవాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మార్చి 7న నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో తిరుపతి పరీక్ష కేంద్రాన్ని చూపకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తిరుపతిలోనే ఎయిమ్స్, ఏపీపీఎస్సీ, జిప్‌మార్ పరీక్షలు ఎయిమ్స్, ఏపీపీఎస్సీ, జిప్మర్ తదితర పోటీ పరీక్షలు తిరుపతిలో కొంతకాలంగా నిర్వహిస్తున్నారు. నీట్ పరీక్షను మాత్రం తిరుపతిలో నిర్వహించడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ‘నీట్’ కేంద్రాలు విజయవాడ, విశాఖపట్నంలలో నిర్వహిస్తే తమ పిల్లలు అంత దూరం వెళ్లి పరీక్షలు ఎలా రాయగలరని తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. పరీక్ష కేంద్రం మార్పులు, విద్యార్థుల వివరాల పొరపాట్లను వెబ్సైట్లో సరిదిద్దుకునేందుకు ఈ నెల 12వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు అవకాశం ఉందని ‘నీట్’ జాయింట్ సెక్రటరీ నోటిఫికేషన్లో తెలియజేశారు. ఆ గడువు ముగిసేలోగా ఉన్నతాధికారులు స్పందించి తిరుపతిలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.