జగదీశ్వరన్, సెల్వ శేఖరన్ (ఫైల్)
సాక్షి, చైన్నె: నీట్‌లో సీటు దక్కలేదనే మనస్థాపంతో క్రోంపేటకు చెందిన విద్యార్థి జగదీశ్వరన్ (19) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో కుమారుడి మృతిని తట్టుకోలేక తండ్రి సెల్వ శేఖరన్(48) కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి తనయుడు మృతి చెందడంపై సీఎం స్టాలిన్‌ను దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివరాలు.. వైద్యకోర్సుల్లో ప్రవేశానికి కేంద్రం తీసుకొచ్చిన నీట్ పరీక్షను ఆది నుంచి డీఎంకే ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. నీట్ రద్దు, తమిళనాడుకు మినహాయింపు నినాదంతో అసెంబ్లీలో చేసిన తీర్మానాలను గవర్నర్ ఆమోదం ఇంతవరకు లభించలేదు.
అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 7.5 శాతం సీట్లను కేటాయిస్తూ వస్తున్నారు. ప్లస్–2లో మంచి మార్కులు సాధించినా, నీట్‌లో ఉత్తీర్ణత స్థాధించినా కటాఫ్ మార్కుల ఆధారంగా ఈ సీట్లు కూడా దక్కక పోవడంతో అనేక మంది పేద విద్యార్థులు తీవ్ర మనస్థాపం చెందుతున్నారు. ఏటా సీట్లు దక్కక బలన్మరణానికి పాల్పడుతున్న విద్యార్థులు రాష్ట్రంలో ఉన్నారు. ఈ ఏడాది జగదీశ్వరన్ ఆత్మహత్య చేసుకున్నారు. అతడి తండ్రి కూడా విగత జీవి కావడం చర్చనీయాంశంగా మారింది
మంచి మార్కులు సాధించినా..
చైన్నె క్రోంపేట కురింజి నగర్‌కు చెందిన సెల్వ శేఖరన్(48) ఫొటోగ్రాఫర్. సింగిల్ పేరెంట్‌గా ఉన్న ఆయన తనయుడు జగదీశ్వరన్‌ను సీబీఎస్‌ఈలో చదివించాడు. ప్లస్–2లో 85 శాతానికి పైగా మార్కులు సాధించాడు. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే ఆశతో జగదీశ్వరన్ ఉన్నాడు. అయితే, ప్రైవేటులో లక్షలు పోసి సీట్ల కొనే స్తొమత లేకపోవడంతో.. ఎలాగైనా ప్రభుత్వ కోటా సీటు దక్కించుకోవాలని ప్రయత్నం చేశాడు. రెండు సార్లు నీట్ పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు. ఈ ఏడాది కూడా కటాఫ్ మార్కులతో ప్రభుత్వ కోటా సీటు దూరమైంది.
దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన జగదీశ్వరన్ శనివారం రాత్రి ఇంట్లో బలన్మరణానికి పాల్పడ్డాడు. ఆదివారం అతడి గదిలో లభించిన లేఖ ఆధారంగా తన కుమారుడిని నీట్ మింగేసినట్టు మీడియా ముందుకు వచ్చి సెల్వ శేఖరన్ రోదించాడు. తన కుమారుడికి ఎదురైన పరిస్థితి మరో విద్యార్థికి రాకూడదని కన్నీటి పర్యంతమయ్యారు. నీట్‌ను రద్దు చేయాలని నినాదించాడు. అదే సమయంలో తనయుడి మరణాన్ని తట్టుకోలేక ఆదివారం రాత్రి ఆయన కూడా ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. క్రోంపేట జీహెచ్‌లో ఉన్న వీరి మృత దేహాలకు మంత్రి ఉదయ నిధి స్టాలిన్ నివాళులర్పించారు. కాగా తమ మిత్రుడికి మార్కులు ఉన్నా, ఆర్థిక స్థోమత అడ్డు రావడంతోనే సీటు దూరమైందని జగదీశ్వరన్ కన్నీటి పర్యంతమయ్యారు.
నీట్ ముసాయిదాను ఆమోదించాలని రాష్ట్రపతికి సీఎం స్టాలిన్ లేఖ
తండ్రి , తనయుడి మరణ సమాచారంతో సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థులు ఆందోళన, ఒత్తిడికి లోను కావద్దు అని, త్వరలో నీట్ రద్దు అయ్యేపరిస్థితులు ఉన్నాయన్నారు. త్వరలో రాజకీయ మార్పులు తప్పవని, నీట్ అనే గోడలను బద్దలు కొట్టి తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ముసాయిదాలను ఆమోదించకుండా, ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు అనుకూలంగా ఈ గవర్నర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఇక నీట్ మినహాయింపు ముసాయిదాను ఆమోదించాలని సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సీఎం స్టాలిన్ లేఖ రాశారు. తమిళనాడులో విద్యార్థుల బలవన్మరణాలను అందులో ప్రస్తావించారు. న్యాయం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment