న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రాల్లో తప్పులు దొర్లినందుకు గాను విద్యార్థులకు గ్రేస్‌మార్కులు కలపాలన్న మద్రాస్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నీట్ తమిళం ప్రశ్నపత్రంలో 49 ప్రశ్నలు తప్పుగా ప్రచురితమయ్యాయి. దీనిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీన్ని విచారించిన మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఇంగ్లిష్ నుంచి తమిళంలోకి అనువదించే క్రమంలో జరిగిన పొరపాటు కారణంగా తప్పుగా ప్రచురితమైన 49 ప్రశ్నలకుగాను పరిహారంగా నాలుగేసి మార్కుల చొప్పున మొత్తం 196 మార్కులు కలపాలని తీర్పిచ్చింది. ఫలితాల జాబితాను మళ్లీ విడుదల చేయాలని నీట్‌ను నిర్వహించిన సీబీఎస్‌ఈను ఆదేశించింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఎస్‌ఈ సుప్రీంకోర్టును ఆశ్రయించగా శుక్రవారం సుప్రీంబెంచ్ విచారించింది. హైకోర్టు తీర్పును సమర్ధిస్తే.. తమిళ మాధ్యమంలో పరీక్ష రాసిన విద్యార్థులు మిగతా భాషల్లో రాసిన వారి కంటే మెరుగైన మార్కులు సాధించినట్లవుతుందని న్యాయస్థానం పేర్కొంది. ఈ రకమైన పద్ధతిలో మార్కులు కలపలేమని వ్యాఖ్యానించిన తదుపరి వాదనలను రెండు వారాలకు వాయిదా వేసింది. వైద్య, దంత కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) మే 6వ తేదీన దేశవ్యాప్తంగా 136 నగరాల్లో జరిగింది. పరీక్షలో 180 ప్రశ్నలకు గాను 720 మార్కులుంటాయి. తమిళనాడులో తమిళ మాధ్యమంలో సుమారు లక్ష మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు.
Comments
Please login to add a commentAdd a comment