న్యూఢిల్లీ: తమిళనాడులో కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సద్గురు జగ్గీ వాసుదేవ్ నిర్వహిస్తున్న ఇషా ఫౌండేషన్‌పై మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈషా ఫౌండేషన్‌లో తమ కూతుళ్లకు బ్రెయిన్ వాష్‌చేసి సన్యాసం వైపు మళ్లించారని ఆరోపిస్తూ ప్రొఫెసర్ వేసిన కేసు విచారణను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ కేసులో మద్రాస్ హైకోర్టు పూర్తి అనుచితంగా వ్యవహరించిందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఇద్దరు మహిళలు గీత(42), లత(39) మేజర్లు కావడం, వారి ఇష్టపూర్వకంగానే ఆశ్రమంలో నివసిస్తున్నందున ఈ పిటిషన్ చట్టవిరుద్దమని, దీనిని తిరస్కరిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.
కాగా పిటిషనర్ కూతుళ్లలో ఒకరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నేను, నా సోదరి స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగానే ఈషా ఫౌండేషన్‌లో నివసిస్తున్నాం. ఇందులో ఎవరి బలవంతం, ఒత్తిడి లేదు. మా తండ్రి ఎనిమిదేళ్లుగా మమ్మల్ని వేధిస్తున్నారు’ అని కోర్టుకు తెలిపారు.
కేసు పుర్వాపరాలు..
ఈషా ఫౌండేషన్‌పై తమిళనాడుకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ హెబియస్ కార్పస్ రిట్ దాఖలు చేయడంతో మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇద్దరు కుమార్తెలు గీత, లత ఈషా యోగా కేంద్రంలో యోగా నేర్చుకునేందుకు వెళ్లి అక్కడే ఉండి పోయారని, ఈశా కేంద్రంలో వారికి బ్రెయిన్ వాష్ చేసి సన్యాసంవైపు మళ్లించారని ఆయన ఆరోపించారు. ఇద్దరు కుమార్తెలను తమకు అప్పగించాలని కోరారు.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈషా యోగా కేంద్రంపై ఇప్పటి వరకు ఎన్ని క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి వివరాలు దాఖలు చేయాలని పోలీసులకు ఉత్తర్వులిచ్చింది. ఆశ్రమంలో ఉన్న అందరినీ విచారించాలని ఆదేశించింది.
ప్రొఫెసర్ ఆరోపణలను ఈషా యోగా కేంద్రం తోసిపుచ్చింది. తాము ఎవర్నీ పెళ్లి చేసుకోమనిగానీ.. సన్యాసం తీసుకోవాలని గానీ సలహాలు ఇవ్వమని, ఎవరికి వారు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకుంటారని ఓ ప్రకటన విడుదల చేసింది.
దీనిపై ఈషా యోగా కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఫౌండేషన్‌పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు పోలీసులకు మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ధర్మాసనం స్టే విధించింది. అలాగే స్టేటస్ రిపోర్టును తమకు సమర్పించాలని తమిళనాడు పోలీసును స్పష్టం చేసింది. తాజాగా ఇద్దరు మహిళలు ఆ శ్రమంలో స్వచ్ఛందంగానే ఉంటున్నారని అత్యున్నత న్యాయస్థానానికి పోలీసులు వివరాలు సమర్పించారు. దీంతో కేసును సుప్రీంకోర్టు కొట్టి వేసింది.
Comments
Please login to add a commentAdd a comment