సాక్షి, హైదరాబాద్: నీట్ నిబంధనలు విద్యార్థులకు చుక్కలు చూపించాయి. పరీక్ష కేంద్రాల కేటాయింపు నుంచి నిమిషం ఆలస్యం నిబంధన దాకా.. బూట్లు, గడియారాల వంటివాటితోపాటు చెవి కమ్మలు, గాజులు, ఉంగరాలు, కాలిపట్టీలను కూడా అనుమతించకపోవడంతో నానా గందరగోళం నెలకొంది. పరీక్షా కేంద్రాల్లో తనిఖీలతో అభ్యర్థులు భయాందోళనకు గురయ్యారు.
సిబ్బంది విద్యార్థులను ఆపాద మస్తకం తనిఖీ చేయడంతోపాటు టార్చ్‌లైట్ సహాయంతో చెవుల్లోనూ పరిశీలించారు. ఫుల్ హ్యాండ్ షర్టులు ధరించి వస్తే.. షర్టు చేతులను సగానికి కత్తిరించారు. కనీసం చెమట తుడుచుకునేందుకు వెంట తెచ్చుకున్న చేతి రుమాళ్లను కూడా పరీక్షా కేంద్రంలోనికి తీసుకెళ్లనివ్వలేదు. అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ మెటల్ డిటెక్టర్లను వినియోగించారు.
ఉదయం ఏడు నుంచే క్యూ కట్టిన విద్యార్థులు
రాష్ట్రంలో 81 పరీక్ష కేంద్రాల్లో నీట్ పరీక్ష జరిగింది. మొత్తంగా 50,856 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో ఒక్క హైదరాబాద్‌లోనే 30 వేలకుపైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. చాలా మంది విద్యార్థులు ఉదయం ఏడు గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఎండ తీవ్రంగా ఉండటంతో విద్యార్థులు, వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఉదయం 8 గంటల నుంచి 9.30 గంటల వరకు అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతించారు. 9.30 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించలేదు.
పోలీసుల తోడ్పాటు పరీక్షకు..
హైదరాబాద్‌లో పలు కేంద్రీయ విద్యాలయాల్లో నీట్ పరీక్ష జరిగింది. అయితే పేర్లు ఒకేలా ఉండటంతో చాలామంది విద్యార్థులు పొరపాటున.. ఒకదానికి బదులుగా మరో సెంటర్‌కు వెళ్లారు. అక్కడికి వెళ్లాక సెంటర్ అదికాదని తెలిసి గాభరాగా మరో సెంటర్‌కు పరుగెత్తారు. ఇలాంటి పలువురు విద్యార్థులు చివరి నిమిషంలో పోలీసుల సహాయంతో.. సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోగలిగారు.
హయత్‌నగర్‌కు చెందిన శ్రావ్య 9:20 గంటలకు తిరుమలగిరిలో కేంద్రీయ విద్యాలయానికి చేరుకుంది. కానీ పరీక్ష కేంద్రం అది కాదని.. బొల్లారం కేంద్రీయ విద్యాలయకు వెళ్లాలని అక్కడి సిబ్బంది సూచించారు. అప్పటికే పరీక్షా సమయం దగ్గరపడటంతో ఆమె భోరుమంది.
అది గమనించిన తిరుమలగిరి పోలీస్‌స్టేషన్ కానిస్టేబుళ్లు చంద్రశేఖర్‌వర్మ,, హరిరామశర్మ.. తమ పెట్రోలింగ్ వాహనంలో శ్రావ్యను కూర్చుండబెట్టుకుని, మిలటరీ అధికారుల అనుమతితో మిలటరీ మార్గం ద్వారా వేగంగా పరీక్ష కేంద్రానికి చేర్చారు. మధ్యలో మరో ఇద్దరు విద్యార్థినులు కూడా బొల్లారం పరీక్ష కేంద్రానికి పరుగులు తీస్తుండటం చూసి.. వారిని సైతం వాహనంలో కూర్చోబెట్టుకుని పరీక్ష సెంటర్‌కు చేర్చారు. పోలీసుల తీరును విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసించారు.
నిమిషం ఆలస్యంతో ఆశలు ఆవిరి..
కూకట్‌పల్లిలోని డీఏవీ స్కూల్ పరీక్ష కేంద్రానికి ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన బోయ తులసి నిమిషం ఆలస్యంగా చేరుకుంది. పరీక్ష కేంద్రం చిరునామా తెలియక ఆలస్యమైందని ఆమె బతిమాలినా.. అధికారులు ఆమెను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. దాంతో కన్నీటితో వెనుదిరిగింది.
డిఫెన్స్ లేబొరేటరీ పరీక్ష కేంద్రంలో నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన అభ్యర్థి సుజాత, కేపీహెచ్‌బీకాలనీలోని మెరీడియన్ పాఠశాల కేంద్రం వద్దకు ఒక్క నిమిషం ఆలస్యంగా చేరుకున్న గొట్టిముక్కల నాగరచనాదేవి అనే విద్యార్థి, బంజారాహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ కేంద్రంలో పాతిక మందికిపైగా విద్యార్థులు పరీక్ష రాయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment