ఇంటర్ తప్పిన వారికి ఉచిత క్లాసులు
హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో తప్పిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా తోడ్పాటునందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వీరికోసం సప్లిమెంటరీ పరీక్షలకు కొద్ది రోజులు ముందుగా ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు ఈ అవకాశం లభిస్తుందని చెప్పారు.
సోమవారం ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు. ఇందుకోసం జిల్లాకో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసి మూడు వారాలపాటు సంబంధిత సబ్జెక్టులపై ఉచిత శిక్షణ ఇస్తారని చెప్పారు. దీనిని జిల్లా విద్యాశాఖ అధికారులు చూస్తారని తెలిపారు. ఈ తరహా విధానం ఇదే మొదటిసారి.