అధికారులు లేక వేదికపై వెక్కిరిస్తున్న ఖాళీ కుర్చీలు
సాక్షి, సిటీబ్యూరో: ప్రజా సమస్యల పరిష్కారం కోసం జీహెచ్‌ఎంసీ చేపట్టిన ‘ప్రజావాణి’ కార్యక్రమం ప్రస్తుతం ఎవరికీ పట్టని పనికిమాలిన ‘వాణి’గా మారింది. ఐదారేళ్ల క్రితం కృష్ణబాబు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నప్పుడు చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎంతో ఆదరణ ఉండేది. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమానికి ఉదయం 10 గంటల కల్లా వచ్చే ప్రజలు క్యూ కట్టేవారు. వచ్చిన వారందరినీ వరుస క్రమంలో పంపించేందుకు వరుస నెంబర్లతో టోకెన్లు జారీ చేసేవారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకే సమయమైనా..అందరిఫిర్యాదులూ స్వీకరించేంత వరకు అధికారులు ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ఉండేవారు. కమిషనర్‌తోపాటు అన్ని విభాగాల అడిషనల్ కమిషనర్లు.. తదితరులు తప్పనిసరిగా ఉండేవారు. తమ వద్దకు వచ్చిన ప్రజల వేదనల్ని సావధానంగా వినేవారు. అప్పటికప్పుడే కంప్యూటర్‌లోనూ నమోదు చేసేవారు. అన్నీ పూర్తయ్యాక సంబంధిత విభాగాలకు పంపించేవారు.
ప్రతివారం ఎన్ని ఫిర్యాదులొచ్చిందీ.. పత్రికా ప్రకటన సైతం విడుదల చేసేవారు. ఆ తర్వాత సోమేశ్‌కుమార్ కమిషనర్‌గా వచ్చిన తర్వాత కూడా కొంత కాలం వరకు ఈ కార్యక్రమం సజావుగా సాగింది. ఆ తర్వాత కమిషనర్ లేకపోయినా..కనీసం అడిషనల్ కమిషనర్ స్థాయి వారు ప్రజావాణికి హాజరయ్యేవారు. ఆయా విభాగాలకు సంబంధించి ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకునేది వారే కనుక అడిషనల్ కమిషనర్లుండేవారు. ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్ తదితర విభాగాల అధిపతులూ తప్పనిసరిగా ఉండేవారు. దాదాపు రెండేళ్లుగా మొక్కుబడి తంతుగా సాగుతోన్న ప్రజావాణి గత ఏడాది కాలం నుంచి మరీ అధ్వాన్నంగా మారింది. కమిషనర్ సంగతటుంచి, కనీసం అడిషనల్ కమిషనర్లు కూడా హాజరు కావడం లేదు. విభాగాల ఉన్నతాధికారులూ రావడం లేదు. తప్పదన్నట్లుగా.. మొక్కుబడిగా ఒకరో ఇద్దరో వచ్చి కూర్చుంటున్నారు. అదీ క్లర్కులు, సూపరింటెండెంట్‌లు సైతం ఎవరు అందుబాటులో ఉంటే వారు కూర్చొని ప్రజలిచ్చే ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.
అన్ని విభాగాల వారు ఉండకపోవడంతో పాటు పరిష్కారంపై నిర్ణయం తీసుకునేవారు లేకపోవడంతో ఆయా విభాగాలకు సంబంధించి సరైన సమాధానం ఇచ్చేవారు లేరు. ‘ఫిర్యాదు ఇచ్చిపోండి..పరిష్కరిస్తాం’ అని చెబుతూ ఫిర్యాదు పత్రం స్వీకరిస్తున్నారు. కనీసం వాటినైనా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారా అంటే అదీ లేదు. తీసుకున్న ఫిర్యాదు కాగితాల్ని ఆ తర్వాత ఎప్పుడో ఆన్‌లైన్‌లో ఉంచుతున్నారు. అందిన అన్ని ఫిర్యాదుల్నీ ఆన్‌లైన్‌లో ఉంచని ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు తాజాగా సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణికి అందిన ఫిర్యాదులే పది కాగా, వాటిల్లో ఒకటి కనిపించకుండా పోయింది. ఇక ఫిర్యాదు పరిష్కారమవుతుందనుకోవడం భ్రమే. ప్రజావాణిలో అందజేస్తే తమ ఫిర్యాదు వెంటనే పరిష్కారమవుతుందని భావించి పలువురు ఎంతో దూరం నుంచి వ్యయప్రయాసల కోర్చి వస్తున్నారు. పది గంటల నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా, ఒక్కోసారి 11.30 గంటల వరకు కూడా ప్రారంభం కావడం లేదు. తాజాగా సోమవారం ప్రజావాణికి సైతం అడిషనల్ కమిషనర్లు, విభాగాధిపతులెవరూ హాజరు కాలేదు. వచ్చిందే నలుగురు. ఫిర్యాదులు నమోదు చేసే కంప్యూటర్ ఆపరేటర్ సైతం సోమవారం 12 గంటల దాకా రాకపోవడంతో స్వీకరణలో జాప్యం జరిగింది. అంతమాత్రం దానికి కార్యక్రమాన్నే పూర్తిగా ఎత్తివేస్తే పోద్దికదా అని దూరం నుంచి వచ్చిన ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
పదే ఫిర్యాదులు..
ఇక ఫిర్యాదుల్లో ప్రతిసారీ టౌన్‌ప్లానింగ్‌దే సింహభాగం. ఫిర్యాదులెన్ని అందినా అక్రమార్కులతో మిలాఖతయ్యే టౌన్‌ప్లానింగ్ అధికారులు వాటిని పరిష్కరించరు. తిరిగి, తిరిగి విసిగి వేసారి పోవాల్సిందే. సోమవారం మొత్తం పది ఫిర్యాదులందగా, అందులో టౌన్‌ప్లానింగ్‌వే ఆరు ఉన్నాయి. ఆస్తిపన్ను, ఇంజినీరింగ్, ఆరోగ్యం– పారిశుధ్యం తదితర విభాగాలకు చెందినవి ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. గణాంకాలు చూపేందుకు మాత్రం అందిన ఫిర్యాదుల్లో 60 –90 శాతం వరకు పరిష్కారమైనట్లు పేర్కొంటారు.
సర్కిళ్లలో పరిష్కారం కాక..
సర్కిళ్లు, జోన్ల స్థాయిల్లో పరిష్కారం కావాల్సినవి సైతం అక్కడ పరిష్కారం కాక ఎందరో ప్రధాన కార్యాలయానికి వస్తుంటారు. యూసుఫ్‌గూడ ప్రాంతంలో తన ఇంటిలో కొంతభాగాన్ని ఇతరులకు అమ్మితే.. మొత్తం ఇల్లును అమ్మినట్లు మ్యుటేషన్ చేశారని, తన ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా సర్కిల్‌స్థాయి అధికారులకు ఎన్ని పర్యాయాలు విన్నవించుకున్నా.. పట్టించుకోకపోవడంతో ఇక్కడికొచ్చినట్లు ఒకరు వాపోయారు. పైపెచ్చు రెండు పర్యాయాలు సంబంధిత డాక్కుమెంట్లు సమర్పించినా, కనిపించడం లేవని చెబుతున్నారని వేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment