బిల్లుల షాక్!
- రూ. వేలల్లో రావడంతో వినియోగదారుల ఆందోళన
- ‘ప్రజావాణి’లో అధికారులకు ఫిర్యాదు
పి.లక్ష్మి... ఇంటి విద్యుత్తు సర్వీసు మీటరు నంబరు 442. సాధారణంగా ప్రతి నెల రూ.135 నుంచి రూ.150 వరకు బిల్లు వచ్చేది. ఈనెల బిల్లు మాత్రం ఒక్కసారిగా రూ. 6,772 వచ్చింది.
కె.రాజేశ్వరి... ఇంటి మీటరు నంబరు 304. ఇప్పటివరకు నెలకు రూ. 116 నుంచి రూ. 130 మధ్యే బిల్లు వచ్చేది. ఈసారి ఏకంగా రూ. 1,035 వచ్చింది.
సర్వాలక్ష్మి... ఇంటి విద్యుత్తు మీటరు నంబరు 423. ప్రతి నెల బిల్లు రూ. 142 నుంచి రూ. 160 వరకు మాత్రమే వచ్చేది. ఈనెల మాత్రం వెయ్యి రూపాయలకు పైగా బిల్లును విద్యుత్తు సిబ్బంది ఆమె చేతికి ఇచ్చారు.
ఎం.మంగ... ఇంటి మీటరు నంబరు 465. ఈ సర్వీసుకు ఇప్పటివరకు రూ. 149 మించి ఏ నెలా బిల్లు రాలేదు. ఈసారి మాత్రం రూ. 939 చెల్లించాలని బిల్లు వచ్చింది.
బైపా పెంటయ్యమ్మ... ఇంటి సర్వీసు నంబరు 555. గతంలో ప్రభుత్వం ఎస్సీలకు 50 యూనిట్ల వరకు విద్యుత్తు ఉచితంగా ఇవ్వడంతో ఆమె ఐదు నెలల క్రితమే కుల ధ్రువీకరణపత్రం అధికారులకు ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు బిల్లు రాలేదు. ఈనెల మాత్రం రూ. 850 చెల్లించాలంటూ ఆమెకు బిల్లు వచ్చింది.
ఈ విద్యుత్తు బిల్లుల బాధితులంతా జిల్లాలోని నాతవరం మండలంలో చమ్మచింత గ్రామానికి చెందినవారు. వారికే కాదు ఈ మండలంలో పలువురు వినియోగదారులకు ఇలాగే అధిక బిల్లులు రావడంతో నిర్ఘాంతపోయారు. పెద్దగా విద్యుత్తు వినియోగించని తమ ఇళ్లకు అదీ సరఫరాలో అధిక కోతలు విధిస్తున్న సమయంలో రూ. వేలల్లో బిల్లులు రావడమేమిటని ఆందోళన చెందుతున్నారు. దీంతో కొంతమంది సోమవారం విద్యుత్తు సబ్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బిల్లులను సరి చేయించాలంటూ ఏఈ వెంకట్రావుకు విన్నవించారు.
- నాతవరం