- విద్యుత్ లోటును పూడ్చగలిగాం
- రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సుజాత
జంగారెడ్డిగూడెం రూరల్ : విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనులశాఖ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. విద్యుత్ పొదుపు చర్యల్లో భాగంగా ప్రతి ఇంటికీ ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేస్తుందని చెప్పారు. జంగారెడ్డిగూడెం విద్యుత్ శాఖ డీఈ కార్యాలయంలో శుక్రవారం ఇంటింటా ఎల్‌ఈడీ బల్పుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం దశాబ్ధ కాలంలో 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటును చూపించిందని, తమ ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేసి లోటును పూడ్చగలిగిందన్నారు.
విద్యుత్ పొదుపు చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూ.22 కోట్ల విలువైన 15.22 లక్షల ఎల్‌ఈడీ బల్బులను ప్రజలకు అందిస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి నాలుగు రోజుల్లో వినియోగదారులకు రెండు ఎల్‌ఈడీ బల్బులు చొప్పున పంపిణీ చేయనున్నామని తెలిపారు. జంగారెడ్డిగూడెంలో 75 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఎల్‌ఈడీ బల్బులు పొందడానికి వినియోగదారుడు విద్యుత్ బిల్లు, ఆధార్ కార్డు లేదా ఏదైనా ఇతర ఫొటో గుర్తింపు కార్డు ఇచ్చి రెండు ఎల్‌ఈడీ బల్బులు పొందవచ్చన్నారు.
ఈ ఎల్‌ఈడీ బల్బులు పొందడం వల్ల విద్యుత్ వినియోగం సంవత్సరానికి 55 యూనిట్లు ఆదా అవుతుందన్నారు. చింతలపూడి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెంలో అదనపు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేస్తామని వీటి ఏర్పాటుకు అర ఎకరం స్థలం కేటాయించాల్సి ఉందని ఇందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ముత్యాల రాజు మాట్లాడుతూ ఎల్‌ఈడీ బల్బుల వినియోగం వల్ల ప్రతి ఇంటా విద్యుత్ పొదుపు జరుగుతుందని, దానివల్ల ఏటా వినియోగదారునకు రూ.800 ఆదా అవుతుందన్నారు.
రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 49 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయడం జరుగుతుందని దానివల్ల 24 శాతం విద్యుత్ పొదుపు చేయగలిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వెంకట రమణ, నగర పంచాయతీ చైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ సత్యనారాయణ రెడ్డి, డీఈ సాల్మన్ రాజు, ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ, జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు దల్లి కృష్ణారెడ్డి, నాయకులు రాజాన సత్యనారాయణ (పండు), కొడవటి సత్తిరాజు, మండవ లక్ష్మణరావు, పెనుమర్తి రామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
జంగారెడ్డిగూడెం శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో రూ. 10.40 లక్షలతో నిర్మిం చనున్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల టూరిజం సర్క్యూట్ పర్యాటకుల సదుపాయాల సమాచార భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీఈ కార్యాలయ భవనాలను మంత్రి ప్రారంభించారు.
విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత
Published Sat, Apr 25 2015 3:17 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM
Advertisement
Advertisement