ప్రజావాణి వినతులకు తొలి ప్రాధాన్యత
అధికారులకు కలెక్టర్ కేవీ రమణ ఆదేశం
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజావాణికి వచ్చే వినతుల పరిష్కారానికి అధికారులు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ కేవీ రమణ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన వినతులు స్వీకరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు కలెక్టరేట్‌కు వచ్చి అర్జీలు సమర్పిస్తుంటారని చెప్పారు. వాటిని అధికారులు పరిశీలించి సకాలంలో పరిష్కరించాలన్నారు.
కడప రెవెన్యూ డివిజన్ పరిధిలో 268 ప్రభుత్వ చౌక దుకాణాలకు ఇన్‌ఛార్జి ఆర్డీఓగా ఉన్న లవన్న ఇచ్చిన నోటిఫికేషన్‌ను తక్షణమే రద్దుచేయాలని టీడీపీ నాయకుడు ఇందిరెడ్డి శివారెడ్డి తదితరులు కోరారు. రోస్టర్‌ను సక్రమంగా రూపొందించలేదని చెప్పారు. అలాగే కోర్టు విచారణలో ఉన్న ఎఫ్‌పీ షాపులను కూడా నోటిఫికేషన్‌లో పొందుపరిచారన్నారు. భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఈనెల 25న బదిలీపై వెళుతున్న ఇన్‌చార్జి ఆర్డీఓ హడావుడిగా నోటిఫికేషన్ విడుదల చేయడంపై పలు అనుమానాలు ఉన్నాయని వివరించారు.
జర్నలిస్టుల హెల్త్ కార్డుల దరఖాస్తులకు మరికొంత సమయాన్ని పొడిగించాలని జాప్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జి.విజయకుమార్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు జ్యోతి జార్జి కోరారు. వరుసగా పండుగలు రావడం వల్ల చాలామంది దరఖాస్తు చేసుకోలేక పోయారన్నారు. సమాచారం సైతం చాలామందికి తెలియదన్నారు.
జిల్లాలోని వికలాంగులకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు చిన్న సుబ్బయ్యయాదవ్, బీఎన్ బాబు తదితరులు కోరారు. పలుమార్లు తహశీల్దార్ల దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లినప్పటికీ వారు స్పందించడం లేదన్నారు.
కడప నగరంలోని పలు వీధులలో చెత్తాచెదారాలు పేరుకుపోతున్నప్పటికీ మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించడం లేదని అర్బన్ డెవలప్‌మెంట్ కమిటీ నాయకులు ఎం.చెండ్రాయులు, వై.తిరుమలయ్య, సుజాతరెడ్డి, ఎస్.గౌస్‌పీర్ తదితరులు ఫిర్యాదు చేశారు. ఈగలు, దోమలు ప్రబలి పలు వ్యాధులకు కారణమవుతున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రామారావు, ఇన్‌ఛార్జి ఏజేసీ సుబ్బారెడ్డి, డీఆర్వో సులోచన, ఇతర జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.