పైసలివ్వనందుకు పట్టామార్చారు | Farmer Suicide Attempt In Prajavani | Sakshi
Sakshi News home page

పైసలివ్వనందుకు పట్టామార్చారు

Published Tue, Mar 20 2018 2:09 AM | Last Updated on Mon, Oct 1 2018 2:47 PM

Farmer Suicide Attempt In Prajavani - Sakshi

సిరిసిల్ల టౌన్‌: ‘సారూ.. నాకు భార్య, ముగ్గురు ఆడపిల్లలు. ఊరు శివారులో 27 గుంటల భూమి ఉంది. దాన్ని ఆధారంగానే కుటుంబాన్ని సాకుతున్న.. కానీ, వీఆర్వో ఆ భూమిని వేరేవాళ్ల పేరు మీద రాసిండ్రు.. ఆయన అడిగిన పైసలు ఇయ్యలేదని గిట్ల జేసిండ్రు.. ఇగ నాకు ఆధారం ఎట్లా? గందుకోసమే పురుగుల మందు తాగుతున్న..’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌కు చెందిన బొమ్మెన తిరుపతి సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. అధికారు లు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. బొమ్మెన తిరుపతి తండ్రి ఎల్లయ్యకు గ్రామ శివారులోని సర్వేనంబర్‌ 20లో 1.29 ఎకరాల భూమి ఉంది. దీనిని 2015 డిసెంబర్‌లో తన కుమారుడు తిరుపతి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించి, రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించారు. దీని పట్టాదారు పాసుపుస్తకం ఆధారంగా బ్యాంకులో రుణం తీసుకున్నాడు.

ఇటీవల వీఆర్‌వో ఒకరు 1.29 ఎకరాల్లోని 27 గుంటలను ఇతరుల పేరిట పట్టా చేశారు. తన భూమిని ఇతరులకు ఎలా పట్టా చేస్తావని బాధితుడు ఆ వీఆర్‌వోను నిలదీయ గా.. అవతలి పార్టీ వారు రూ.30 వేలు ఇచ్చారని, నువ్వు రూ.50 వేలు ఇస్తే.. పట్టా నీ పేరిట చేస్తానన్నాడు.దీంతో మనస్తాపానికి గురైన తిరుపతి కుటుంబ సభ్యులతో కలసి సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించే ప్రజావాణికి హాజరయ్యాడు. తన భూమిని ఇతరుల పేరిట పట్టా చేసి, లంచం అడుగుతున్న వీఆర్‌వోపై చర్య తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. వెంటనే తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేందుకు యత్నించగా కలెక్టర్‌ కృష్ణభాస్కర్, ఆర్డీవో పాండురంగ అడ్డుకున్నారు. ఘటనపై విచారణ జరిపించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం తగు చర్యలు తీసుకోవాలని ఆర్డీవో పాండురంగను కలెక్టర్‌ ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement