టవర్ ఎక్కిన రైతు అబ్దుల్లా
రేగోడ్(మెదక్): వేలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటలు బోర్లలో నీళ్లు లేక ఎండిపోతున్నాయంటూ ఓ రైతు ఆవేదనతో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ ఎక్కిన సంఘటన మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని చౌదర్‌పల్లిలో గురువారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే.. చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన అబ్దుల్లా తనకున్న ఐదెకరాకు మూడెకరాల్లో వరి, రెండెకరాల్లో మొక్కజొన్న పంటలు సాగు చేశాడు. ఉన్న బోరు ద్వారా పంటలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. అంతా బాగానే ఉన్నా ప్రస్తుత ప్రస్తుం మండుతున్న ఎండలకు బోరులో నీరు అడుగంటి పోయాంది. చేసేది లేక పదిహేను రోజుల క్రితం సుమారు రూ.లక్ష వెచ్చించి మూడు బోర్లు వేశాడు. అందులో ఒక్క చుక్క కూడా నీరు పడలేదు.
దీంతో ఆవేదనకు గురైన రైతు బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ ఎక్కి మూడు గంటల పాటు హల్‌చల్ చేశాడు. గ్రామస్తులు కిందికి దిగాలని నచ్చచెప్పినా అబ్దుల్లా వినలేదు. విషయం తెలుసుకున్న ఎస్సై జానయ్యకు ‘సాక్షి’ సమాచారం అందించింది. స్పందించిన ఎస్సై వెంటనే చౌదర్‌పల్లి గ్రామానికి తన సిబ్బందితో హుటాహుటిన చేరుకున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పడంతో రైతు అబ్దుల్లా టవర్‌పై నుంచి రాత్రి కిందికి దిగాడు. అప్పుడు అందరూ ఊపరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment