క్రిమి సంహారక మందును తాగేందుకు ప్రయత్నిస్తున్న రైతు చిన్న రంగస్వామిని అడ్డుకుంటున్న కానిస్టేబుల్
కర్నూల్ జిల్లా, డోన్ టౌన్ : చాలా ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూమి వివరాలను రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్ నుంచి తొలగించి, ఇతరుల పేరిట నమోదు చేశారనే మనస్తాపంతో ఓ రైతు జన్మభూమి సభలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మిగిలిన బాధిత రైతులు కూడా పురుగు మందు డబ్బాలతో వచ్చి నిరసన తెలిపారు. ఈ సంఘటన గురువారం కర్నూలు జిల్లా డోన్ మండలం గోసాని పల్లె గ్రామంలో జన్మభూమి సభలో గోసానిపల్లె పరిధిలోని సర్వే నంబర్ 959లో 8.56 ఎకరాల మిగులు భూమి ఉంది. దీన్ని ఇదే గ్రామానికి చెందిన చిన్న రంగస్వామి, శ్రీనివాసులు, బాబయ్య, తిక్కలప్ప, రామాంజనేయులు అనే రైతులు సాగు చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు చాలాకాలం క్రితమే వీరికి పట్టాదారు పాసు పుస్తకాలను సైతం మంజూరు చేశారు. రెండేళ్ల క్రితం వరకు వీరి పేర్లే ఆన్‌లైన్‌లో ఉన్నాయి. అయితే, ప్రస్తుతం వాటిని తొలగించి బోయ ఈశ్వర్ అనే వ్యక్తితోపాటు మరొక వ్యక్తి పేరు నమోదు చేశారు.
బాధిత రైతులు ఈ విషయాన్ని పలుమార్లు స్థానిక రెవెన్యూ అధికారులతోపాటు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ‘చూద్దాం, చేద్దాం’ అంటూ చెబుతూ వచ్చారు తప్ప రైతుల పేర్లను తిరిగి ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో వారు గురువారం గ్రామంలో ఏర్పాటుచేసిన జన్మభూమి సభకు వచ్చి, అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అధికారుల నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో చిన్న రంగస్వామి అనే రైతు మనస్తాపానికి గురయ్యాడు. తన వెంట తెచ్చుకున్న క్రిమి సంహారక మందు డబ్బాను బయటికి తీసి.. తాగేందుకు ప్రయత్నించాడు. మిగిలిన వారు కూడా పురుగు మందు డబ్బాలను చేతబట్టుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పురుగు మందు తాగేందుకు ప్రయత్నిస్తున్న చిన్నరంగస్వామిని అడ్డుకున్నారు. మందు డబ్బాను లాగేసుకున్నారు. అతడితోపాటు మిగిలిన రైతులను సముదాయించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీస్, రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు.
నాలాంటి పేదలకు న్యాయం చేయాలి
‘‘మేము ఆ భూమిని తాతల కాలం నుంచి సాగు చేస్తున్నాం. పథకం ప్రకారమే మా పేర్లను ఆన్‌లైన్‌లో నుంచి తొలగించి, ఇతరుల పేర్లను నమోదు చేశారు. ఇది రెవెన్యూ అధికారుల అవినీతికి నిదర్శనం. న్యాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ కనికరించడం లేదు. చివరకు విసుగెత్తిపోయాం. ఇలాంటి అన్యాయం ఎవరికీ జరగకూడదనే ఉద్దేశంతోనే ఆత్మహత్యకు ప్రయత్నించా. ఇకనైనా అధికారులు కళ్లుతెరిచి నాలాంటి నిరుపేద రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నా’’
–చిన్న రంగస్వామి, బాధితుడు
ఫారెస్టు అధికారుల ఫిర్యాదుతోనే...
‘‘బాధిత రైతుల పేర్లు చాలా ఏళ్లుగా ఆన్‌లైన్‌లో ఉన్న విషయం మాకు తెలియదు. నేను ఏడాదిన్నర క్రితం ఇక్కడికి బదిలీపై వచ్చా. ఫారెస్ట్ అధికారుల ఫిర్యాదు మేరకు 959 సర్వే నంబర్‌లో నమోదైన బోయ ఈశ్వర్ తదితరుల పేర్లన్నింటినీ ఆన్‌లైన్‌లో నుంచి తొలగించాం. తమ పరిధిలోనే ఈ భూమి ఉందని ఫారెస్ట్ అధికారులు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. జాయింట్ సర్వే చేయించిన తర్వాత అసలైన రైతులను గుర్తించి వారి పేర్లనే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తాం’’
– మునికృష్ణయ్య, తహసీల్దార్, డోన్
Comments
Please login to add a commentAdd a comment