ప్రజావాణిలో ఒకే ఒక్కడు
- తక్కువ సంఖ్యలో అధికారుల హాజరు
- కొందరు మధ్యలో నుంచి నిష్ర్కమణ
- వినతులు స్వీకరించిన జడ్పీ సీఈఓ రాజారాం
ప్రగతినగర్ : జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 182 వినతులు వచ్చాయి. తక్కువ సంఖ్యలో అధికారులు హాజరయ్యారు. ఇందులో నుంచి కొంతమంది అధికారులు మధ్యలో నుంచి నిష్ర్కమించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను జడ్పీ సీఈఓ రాజారాం స్వీకరించారు. జడ్పీ సీఈఓ మధ్యాహ్నం కూడా అధికారుల హాజరును పరిశీలించగా, సగం మంది అధికారులు కూడా లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదని, ఏదో ప్రజావాణికి తూతూ మంత్రంగా వచ్చి మధ్యలో నుంచి నిష్ర్కమించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకోండి
అసలే రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలతో ఇబ్బందులు పడుతున్న తమపై వీడీసీ సభ్యులు పెత్తనం చెలాయిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని బాల్కొండ మండలం ముప్కాల్ గ్రామ గీత పారిశ్రామిక కుటుంబాలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టాయి. వీడీసీకి ఈ సంవత్సరం వ్యాపారాలు లేక డబ్బులు చెల్లించలేకపోతున్నామని చెప్పినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తాము గీసిన కల్లును పారబోస్తూ, దుకాణాలకు తాళాలు వేశారన్నారు. వారి దౌర్జాన్యాలను అరికట్టాలని కోరారు.