ప్రజావాణికి 103 ఫిర్యాదులు
ప్రజావాణికి 103 ఫిర్యాదులు
Published Mon, Oct 3 2016 10:09 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
ఇందూరు : కలెక్టర్ కార్యాలయం కిటకిటలాడింది. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుదారులతో సందడి నెలకొంది. సోమవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి –– ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ యోగితారాణా, జాయింట్ కలెక్టర రవీందర్‌రెడ్డి, డీఆర్వో పద్మాకర్, ఐకేపీ చంద్రమోహన్‌రెడ్డి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సిఫారసు చేశారు.
చెరువులకు మరమ్మతులు చేపట్టాలి.. (03ఎన్‌జెడ్‌టి221–12050037)
భారీ వర్షాలతో తమ గ్రామంలోని రెండు చెరువులకు సంబంధించిన కట్టలు తెగిపోయాయని, వాటికి మరమ్మతులు చేయించాలని నవీపేట మండలం బినోలా గ్రామస్తులు కలెక్టర్‌కు విన్నవించారు. ఖాళీ అయిన చెరువులను ఎత్తిపోతల పథకం ద్వారా నింపాలని కోరారు. గ్రామంలోని పెద్దచెరువు కట్ట, ఖదిరాబాద్ చెరువు కట్టలు తెగిపోయి, పంటలు నీట మునిగాయని సర్పంచ్ సుధాకర్, వీడీసీ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం చెరువుల్లో నీరు లేదని, రబీలో పంటలు పండించడానికి కష్టంగా మారుతుందని తెలిపారు. కావున చెరువులకు మరమ్మతులు చేపట్టి, ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులను నింపాలని కలెక్టర్‌ను కోరారు.
కార్మికులను ఆదుకోవాలి.. (03ఎన్‌జెడ్‌టి222)
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అడ్డా మీది కార్మికులకు వసతులు కల్పించాలని, సేదతీరడానికి రేకుల షెడ్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలని సంఘం జిల్లా అధ్యక్షుడు కల్లెడి గంగాధర్ కోరారు. అడ్డా మీది కార్మికులకు ఉపాధి హామీ పని కల్పించాలని, ఈఎస్‌ఐ సౌకర్యంతో పాటు 60 ఏళ్లు నిండిన వారికి పెన్షన్లు ఇప్పించాలని విన్నవించారు. కార్మికుల కోసం ప్రత్యేకంగా కాలనీ ఏర్పాటు చేసి ఇళ్లు కట్టివ్వాలని, కార్మికుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని కోరారు. శాంతయ్య, నర్సింహులు, గంగారాం, తదితరులు కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
హరితహారం కూలీ డబ్బులివ్వండి.. (03ఎన్‌జెడ్‌టి223)
హరితహారంలో భాగంగా నర్సరీల్లో పెంచిన మొక్కలకు నీరు పట్టి, చెట్లను పెంచినందుకు రావాల్సిన కూలీ డబ్బులు ఇంకా రాలేదని, నాలుగు నెలల నుంచి అధికారులు డబ్బులు ఇవ్వలేదని నిజామాబాద్ మండలం నర్సింగ్‌పల్లి గ్రామానికి చెందిన మహిళలు వాపోయారు. ఈ మేరకు కూలీలు లక్ష్మి, భూదవ్వ, భూలక్ష్మి, తదితరులు కలెక్టర్ యోగితారాణాను కలిసి వినతిపత్రం సమర్పించారు. నర్సింగ్‌పల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలను పెంచడానికి పని చేశామని, దానికి సంబంధించిన కూలీ డబ్బు ఇంకా రాలేదని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని, త్వరగా కూలీ డబ్బులు ఇప్పించాలని విన్నవించారు. స్పందించిన కలెక్టర్ డ్వామా అధికారులకు సిఫార్సు చేశారు.
సదరం సర్టిఫికెట్ ఇప్పించండి.. (03ఎన్‌జెడ్‌టి224)
చిత్రంలో కనిపిస్తున్న వీరు డిచ్‌పల్లి మండలం రాంపూర్ తండాకు తల్లి కూతుళ్లు మంగిబాయి, పీరుబాయి. శారీరక వికలాంగురాలైన పీరుబాయికి సదరం సర్టిఫికేట్ లేకపోవడంతో ఏడాది నుంచి పెన్షన్ నిలిపివేశారు. ప్రస్తుతం సదరం సర్టిఫికేట్ ఉంటేనే పెన్షన్ ఇస్తామని అధికారులు స్పష్టం చేయడంతో సర్టిఫికేట్ ఇప్పించాలని మంగిబాయి తన కూతురితో కలిసి ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసింది. సదరం సర్టిఫికేట్ ఇప్పించి, పెన్షన్‌ను పునరుద్ధరించాలని యోగితారాణాకు వినతిపత్రం సమర్పించారు.
బిల్లులు ఇవ్వట్లేదు... (03ఎన్‌జెడ్‌టి225)
ఈయన పేరు నీరడి ఆశోక్. డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామం. తన ఇంట్లో ప్రభుత్వ పథకం కింద మరుగుదొడ్డిని నిర్మించకున్నానని, అయితే అందుకు సంబంధించిన బిల్లును ఇవ్వడం లేదని వాపోయారు. బిల్లులు ఇవ్వాలంటే రూ.2 వేలు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ అడుగుతున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తన సొంత డబ్బుతో మరుగుదొడ్డి నిర్మించానని, తనకు బిల్లులు ఇప్పించాలని విన్నవించాడు.
ఆర్థిక సాయం అందించండి... (03ఎన్‌జెడ్‌టి228)
వీరిద్దరు అన్నదమ్ములు బానోత్ వినోద్, సుమన్. తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథలుగా మారారు. అయితే, తన తమ్ముడు సుమన్‌కు ప్రమాదవశాత్తు వెన్నెముక విరిగిందని, చికిత్స చేయించడానికి స్తోమత లేదని వినోద్ తెలిపాడు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సాయం అందించాలని ఆదుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశాడు. స్పందించిన యోగితారాణా ఆరోగ్యశ్రీ అధికారులకు సిఫార్సు చేశారు.
దోమకొండలోనే కొనసాగించాలి... (03ఎన్‌జెడ్‌టి229)
కొత్తగా ఏర్పాటు కానున్న బీబీపేట్ మండలంలో తమ గ్రామాన్ని కలపవద్దని కోరుతూ మహ్మదాపూర్ గ్రామస్తులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. అనంతరం కలెక్టర్ యోగితారాణాకు వినతి పత్రం అందజేశారు. బీబీపేట్ మండలంలో తమ గ్రామాన్ని విలీనం చేయడం సరికాదని, కొత్త మండలంలో కలిపితే తమకు నష్టం జరుగుతుందన్నారు. తమను పాత మండలమైన దోమకొండ మండలంలోనే కొనసాగించాలని కోరారు. గ్రామస్తులు గజ్జెల లక్ష్మీకాంతం, నాగం రాజుగౌడ్, యాచం నరేందర్, బాగిరెడ్డి, లక్ష్మారెడ్డి, రాజు, బాల్‌రెడ్డి, పోషిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డును బాగుచేయండి..
ఇటీవల కురిసిన వర్షాలకు తమ గ్రామానికి చెందిన రోడ్డు తెగిపోయిందని, రోడ్డును బాగు చేయించాలని మాచారెడ్డి మండలం ఆరెపల్లి గ్రామస్తులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. చెక్ డ్యాం కట్ట తెగిపోవడంతో రోడ్డు పూర్తిగా చెడిపోయి రాకపోకలకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. కావున రోడ్డుకు మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement
Advertisement