దరఖాస్తులు వచ్చాయా..! తీసుకున్నామా..!! అన్న చందంగా తయారైంది కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం తీరు. సమస్యలు పరిష్కారమవుతాయని కోటి ఆశలతో కలెక్టరేట్ గడప తొక్కుతున్న బాధితులకు చివరకు నిరాశే ఎదురవుతోంది. ప్రజావాణికి వచ్చే సమస్యలు పరిష్కరించడంలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందంటున్న యంత్రాంగానికి.. బాధితులు కూడా అదేస్థాయిలో వస్తున్నట్లు అర్థం కాకపోవడం విడ్డూరం. ఉన్నతాధికారుల స్థాయిలో సమస్య పరిష్కారమైనట్లు కనిపించినా.. క్షేత్రస్థాయిలో బాధితులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు.
మండలంలో పరిష్కారం కాకుంటే జిల్లా అధికారులకు చెప్పుకుందామని వస్తే.. వారి ఆశలపై నీళ్లుచల్లుతూ.. తిరిగి వారివారి మండలాల అధికారుల వద్దకే పంపిస్తున్నారు. దీంతో బాధితులు కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో ప్రజావాణి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలన్నా ఉన్నతాధికారుల ఆదేశాలు బుట్టదాఖలవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ, సమన్వయలోపం బాధితులకు శాపంగా మారుతోంది. - న్యూస్‌లైన్, కలెక్టరేట్