ఎవరికీ చెప్పుకోను..?
-
అధికారుల తప్పిదంతో దక్కని ఉద్యోగం
-
ఓ మూగ నిరుద్యోగి ఆవేదన
ముకరంపుర: ఓ మూగ నిరుద్యోగితో అధికారులు చెలగాటమాడారు.. నోరుండి మాట్లాడలేని ఆ వ్యక్తి అధికారుల పొరపాటును నిలదీయలేకపోయాడు.. ఫలితంగా దక్కాల్సిన ఉద్యోగం చేజారిపోయింది. చివరికి తప్పు అధికారిదేనని ఒప్పుకునేసరికి ఉద్యోగ ఖాళీలు లేకుండా పోయాయి. తమ్ముడి సాయంతో సోమవారం ప్రజావాణిని ఆశ్రయించిన ఆ మూగ ఉద్యోగి ఆవేదన ఇది..
గోదావరిఖని :యెటింక్లయిన్ కాలనీకి చెందిన జె.సదానందం పుట్టుకతోనే మూగ. పట్టుదలతో డిగ్రీ పూర్తిచేశాడు. 2015 నవంబర్‌లో వికలాంగకోటాలో ఉద్యోగఖాళీలకు నోటిఫికేషన్ రాగా.. దరఖాస్తు చేసుకున్నాడు. మెడికల్ రిపోర్టు సమర్పించాడు. ఉద్యోగ ఖాళీలన్నీ 7వ తరగతి అర్హత కింద ఉన్న అటెండర్ పోస్టులే.. అయినా ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే సంకల్పంతో దరఖాస్తు చేశాడని అతడి తమ్ముడు రఘు వివరించాడు. ఆయా మండలాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని నిబంధన ఉండడంతో ఆసక్తి చూపాడు. తీరా విద్యాశాఖలో 7వ తరగతి విద్యార్హతల సర్టిఫికెట్ ఒరిజినల్ కాదని, స్కూల్‌రికార్డులో లేదని, అవి సరిపోలడంలేదని కారణంచూపారు. దీంతో సదానందం తర్వాత అర్హత మరొకరిని మెరిట్‌ప్రకారం ఉద్యోగంలోకి తీసుకున్నారు. తప్పు విద్యాశాఖపై నెట్టేసిన వికలాంగుల శాఖ తమదేమీ లేదన్నట్లు వ్యవహరించింది. బాధితుడు విద్యాశాఖ చుట్టూ తిరగగా.. డీఈవో స్వయంగా పరిశీలించి 7వ తరగతి సర్టిఫికెట్ ఒరిజినల్‌గా నిర్ధారించి పొరపాటు చేసిన సెక్షన్ ఇన్‌చార్జిపై ఆగస్టు 18న చర్యలకు ఆదేశించారు.
ఈలోపు ఖాళీ ఉద్యోగం వేరొకరికి దక్కగా.. మొత్తం 30 మందికి పోస్టింగులిచ్చేశారు. సోమవారం ఒరిజినల్ అర్హత సర్టిఫికెట్లతో కలెక్టర్ నీతూప్రసాద్‌ను ఆశ్రయిస్తే ఏజేసీని విచారించాల్సిందిగా ఆదేశించారు. ఆయన వికలాంగులశాఖ ఏడీ నళిని పిలిచి ఆరాతీస్తే ఖాళీలు లేవని, తప్పు విద్యాశాఖదేనని, ఖాళీల కోసం కలెక్టర్‌కు లెటర్ పెడుతామని పేర్కొన్నారు. ఆ మూగ సైగలు 8 నెలలుగా ఎవరికీ పట్టలేదు. కళ్లుండి తప్పిదాలు చేసిన అధికారి తీరుతో ఆ మూగ నిరుద్యోగికి ఉద్యోగం కోసం నిరీక్షణ తప్పడం లేదు.. కలెక్టరమ్మ స్పందించి వికలాంగుల కోటాలో అర్హతను బట్టి ఉద్యోగం ఇప్పించాలని సదానందం తన తమ్ముడు రఘు సాయంతో వేడుకున్నాడు.