
తెలంగాణ, కర్ణాటకలో వారికి లబ్ధి చేకూరుతోంది
ఎక్స్‌లో గుర్తుచేసుకున్న రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ: దళితులు, గిరిజనుల కోసం గత యూపీఏ ప్రభుత్వం సబ్ ప్లాన్ తీసుకొచ్చిందని, దీని వల్ల తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆయా వర్గాలకు తగిన ప్రయోజనాలు లభిస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం దళిత, గిరిజనుల శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ప్రముఖులను కలిసిన సందర్భాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ (సీడీఎస్ ) చైర్‌పర్సన్ మల్లేపల్లి లక్ష్మయ్య కూడా రాహుల్‌ను కలిసిన వారిలో ఉన్నారు. వారితో కలిసిన చిత్రాన్ని రాహుల్ శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఇటీవల నేను దళిత, గిరిజన వర్గాలకు చెందిన పరిశోధకులు, సామాజిక కార్యకర్తలను కలిశాను.
కేంద్ర బడ్జెట్‌లో కొంత భాగాన్ని దళితులు, గిరిజనులకు అందించేలా జాతీయ చట్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి చట్టం ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో అమలులో ఉంది. ఈ వర్గాలకు అక్కడ నిర్దిష్ట ప్రయోజనాలు లభించాయి. యూపీఏ ప్రభుత్వం జాతీయ స్థాయిలో దళితులు, ఆదివాసీల కోసం ‘సబ్ ప్లాన్‘తీసుకొచి్చంది. కానీ మోదీ ప్రభుత్వ హయాంలో ఇది బలహీనపడింది.
బడ్జెట్‌లో చాలా తక్కువ భాగం ఈ వర్గాలకు చేరుతోంది. వారికి అధికారంలో భాగస్వామ్యం కల్పించడానికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో అనే అంశంపై ఇప్పుడు మనం ఆలోచించాలి. దళితులు, ఆదివాసీలను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన పథకాలకు బడ్జెట్‌లో న్యాయమైన వాటాను నిర్ధారించే జాతీయ చట్టం మనకు అవసరం’అని రాహుల్ పేర్కొన్నారు.