
చంఢీగఢ్ : గుజరాత్ జామ్‌నగర్‌లో ఈ బుధవారం జాగ్వార్ జెట్‌లో మరణించిన భారత వాయుసేన ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ అంత్యక్రియలు ముగిశాయి. హర్యానాలోని రేవారీ జిల్లాలోని ఆయన స్వగ్రామామైన భలాకీ మజ్రాలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.
వేలాది మంది స్థానికులు, వాయుసేన అధికారులు, ఇతర సైనికులు, పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొని సిద్ధార్థ్ యాదవ్‌కు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి వీడ్కోలు పలికారు. పది రోజుల క్రితం సిద్ధార్థ యాదవ్, సానియాల ఎంగేజ్‌మెంట్ అయ్యింది. నవంబర్ 2న పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే విధి ఆడిన వింత నాటకంలో కాబోయే భార్య సానియా.. సిద్ధార్ధ్ అంత్యక్రియల్లో పాల్గొనాల్సి వచ్చింది.
అంత్యక్రియలు ముగిసే సమయంలో సానియా గుండెలవిసేలా రోదించారు. ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు.‘సిద్ధార్ధ్ ముఖాన్ని చూపించండి. ఇంకోసారి సిద్ధార్ధ్ ముఖాన్ని చూడనివ్వండి అని భౌతిక ఖాయం వద్ద గుండెలవిసేలా ఏడుస్తున్న దృశ్యాలు చూపురలను కంటతడి పెట్టిస్తున్నాయి. ‘బేబీ నన్ను తీసుకెళ్లేందుకు నువ్వు ఎందుకు రాలేదు. నువ్వు నాకు ప్రామిస్ చేశావ్ కదా అంటూ సిద్ధార్ధ్ భౌతికఖాయంతో సంభాషించడం ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది.
What a heart wrenching moment...#SiddharthYadav got engaged 10 days back, marriage was due on 2nd November...his fiance says: Baby तू आया नहीं...तूने कहा था मुझे लेने आएगा। #jaguarcrash #Rewari pic.twitter.com/c7KGJOQixr
— Rahul Yadav (@Raahulrewari) April 4, 2025
అంతా బాగున్నప్పుడు కాదు.. ప్రమాదంలో
అంతా బాగున్నప్పుడు కాదు, ప్రమాదపుటంచున ఉన్నప్పుడు ఎలా స్పందిస్తామన్నది మన వ్యక్తిత్వానికి కొలమానంగా నిలుస్తుంది. బుధవారం రాత్రి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కూలిపోయిన భారత వైమానిక దళ జాగ్వార్ ఫైటర్ జెట్ పైలట్ సిద్ధార్థ్ యాదవ్ అలాంటి గొప్ప వ్యక్తిత్వమున్న వారి కోవకే వస్తారు. సాంకేతిక లోపాలతో విమానం కుప్పకూలనుందని అర్థమైంది.
#BREAKING: Tragic news from Jamnagar, Gujarat. A Jaguar fighter jet of the Indian Air Force crashed during a routine sortie, 12 kms away from Jamnagar city. While one pilot ejected safely, a trainee pilot has been killed in the crash. The body has been found by the villagers. pic.twitter.com/yGRefVVyQR
— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 2, 2025
తాను మరణిస్తూ.. మరికొందరికి
కో పైలట్‌తో కలిసి సురక్షితంగా ఎజెక్టయ్యే అవకాశముంది. అయినా సిద్ధార్థ్ తన ప్రాణాల కోసం పాకులాడలేదు. ప్రజల భద్రత గురించే ఆలోచించారు. విమానం జనావాసాల్లో పడకుండా జాగ్రత్తపడ్డారు. సురక్షితంగా మైదానంలో కూలిపోయేలా చూశారు. తద్వారా ఎంతోమంది పౌరుల మరణాలను నివారించారు. ఆ క్రమంలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయినా తన సాటిలేని త్యాగంతో జాతి గుండెల్లో చిరంజీవిగా మిగిలిపోయారు. కో పైలట్ సురక్షితంగా ఎజెక్టయినా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.
IAF's Jaguar fighter aircraft crashes in Jamnagar, Gujarat. More details awaited.#planecrash pic.twitter.com/Xz8UAGeasc
— Kedar (@Kedar_speaks88) April 2, 2025
చివరి క్షణాల్లోనూ...
బయల్దేరిన కాసేపటికే విమానంలో సాంకేతిక వైఫల్యం తలెత్తింది. విమానాన్ని నియంత్రించడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. ప్రమాదం తప్పదని స్పష్టమైంది. దాంతో పైలెట్లిద్దరూ ఎజెక్షన్ ప్రారంభించారు. అంతటి క్లిష్ట సమయంలోనూ ముందు కో పైలట్ సురక్షితంగా బయటపడేలా సిద్ధార్థ్ జాగ్రత్త తీసుకున్నారు. తర్వాత కూడా విమానాన్ని వెంటనే వదిలేయకుండా నివాస ప్రాంతాలకు దూరంగా తీసుకెళ్లారు. ఆ క్రమంలో ప్రాణాలనే పణంగా పెట్టారు. సిద్ధార్థ్ ఇటీవలే సెలవులనుంచి తిరిగి విధులకు హాజరయ్యారు. ఈ ప్రమాదం ఒక సాధారణ శిక్షణ ఫ్లైట్ సమయంలో జరిగింది.
విచారంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్
ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ మృతిపై భారత వాయుసేన తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వారి కుటుంబానికి మేం అండగా నిలుస్తాం. ఈ ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు విచారణ కమిటీని నియమించినట్లు తెలిపింది.
హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ ట్వీట్
సిద్ధార్ధ్ యాదవ్ మరణంపై హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ విచారం వ్యక్తం చేశారు. జామ్‌నగర్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రేవారి జిల్లా మజ్రా (భాల్ఖీ) గ్రామానికి చెందిన పుత్రుడు, జాగ్వార్ పైలట్ సిద్ధార్థ్ యాదవ్‌కు నా శ్రద్ధాంజలి. ఈ త్యాగం ఎప్పటికీ మరిచిపోలేము. ఈ శోక సమయంలో ఆయన కుటుంబానికి మేమంతా అండగా నిలుస్తాం. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలి’అని ట్వీట్‌లో పేర్కొన్నారు.