
ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టిన ఇన్నోవా..
భర్త మృతి, భార్య, ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలు..
హైదరాబాద్: బస్సును ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపు తప్పిన ఇన్నోవా వాహనం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా, భార్య, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రవికుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
గుంటూరుకు చెందిన కొండేపాటి పుల్లారావు నగరానికి వచ్చి బీఎన్‌రెడ్డి నగర్‌లో నివాసం ఉంటున్నాడు. సోమవారం అతను భార్య పిల్లలతో కలిసి బైక్‌పై ఈసీనగర్ నుంచి పెద్ద చర్లపల్లి వైపుగా వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఇన్నోవా వాహనం బస్సును ఓవర్ టేక్ చేయబోయి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో పుల్లారావు (32) అక్కడికక్కడే మృతి చెందగా, అతడి భార్య నాగరాణి, కుమారులు రుత్విక్, రాజేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి.
బాధితులను పోలీసులు చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు. ఇన్నోవా డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఈ ప్రమాదం జరిగిందన్నారు.