పోలీసు అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న డీఐజీ
పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవాల ముగింపు సభలో డీఐజీ రమణకుమార్
ప్రజా భద్రత కోసం ప్రాణాలొదిలిన వారి త్యాగాలను స్మరిస్తూ 'స్మృతిపరేడ్'
కర్నూలు: విధుల్లో నిమగ్నమై ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దని డీఐజీ రమణకుమార్ పోలీసులకు సూచించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవ ముగింపు సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో 'స్మృతి పరేడ్' నిర్వహించారు. కార్యక్రమానికి డీఐజీ రమణకుమార్, జిల్లా జడ్జీ అనుపమ చక్రవర్తి, ఎస్పీ ఆకె రవికృష్ణ, కోడుమూరు ఎమ్మెల్యేమణిగాంధీ తదితరులు ముఖ్యఅతిధిగా హాజరై అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ పోలీసులు అంతర్గత భద్రతలో ప్రాణాలు తెగించి పని చేస్తున్నారని ఈ ఏడాది దేశవ్యాప్తంగా 473 మంది, రాష్ట్రంలో 14 మంది అమరులయ్యారన్నారు. మావోయిస్టులు, తీవ్రవాదులు, అసాంఘీక శక్తుల చేతుల్లో ఉమేష్‌చంద్ర, పరదేశినాయకుడు, కేఎస్ వ్యాస్ వంటి మహానుభావులతో పాటు, తన బ్యాచ్‌మెంటు కేవీ గౌడ్ గ్రేహౌండ్స్‌లో డీఎస్పీగా పని చేస్తూ మందుపాతర పేలుడు సంఘటనలో పోరాడి అమరులయ్యారని గుర్తు చేసుకున్నారు. గత సంవత్సరంలో ఆరోగ్యం బాగలేక 163 మంది చనిపోయారని, వీరిలో జిల్లాకు చెందిన వారు 17 మంది ఉన్నారన్నారు. జిల్లాలో పని చేస్తున్న పోలీసులకు వారాంతపు సెలవులను తప్పనిసరిగా అమలుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అసాంఘిక శక్తులను ఎదుర్కొంటూ పోలీసులు ప్రజలకు రక్షణగా నిలవాలని పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయి 473 మంది పేర్లను అదనపు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి చదివి వినిపించారు.
-
కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, వినోద్‌కుమార్, మురళీధర్, రాజశేఖర్‌రాజు, డీఐజీ కృష్ణమూర్తి, వెంకటాద్రి, హుసేన్‌పీరా, ఏఓ అబ్దుల్ సలాం, సీఐలు కృష్ణయ్య, డేగల ప్రభాకర్, ములకన్న, మహేశ్వరరెడ్డి, నాగరాజు యాదవ్, మధుసూదన్‌రావు, నాగరాజురావు, ఆర్‌ఐలు రంగముని, జార్జ్, పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ, పోలీసు హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు రఘురాముడు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, హోంగార్డు సిబ్బంది, అమరవీరుల కుటుంబాలు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొని పోలీసు అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులు అర్పించారు.
సమాజ రక్షణలో పోలీసులదే కీలకపాత్ర: జిల్లా జడ్జీ అనుపమ చక్రవర్తి
ప్రపంచమంతా రాత్రిళ్లు నిద్రలో ఉంటే పోలీసులు మేల్కొని శాంతిభద్రత పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు. అందుకే ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. విధి నిర్వహణలో త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. సమాజ రక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న పోలీసుల సేవలను ప్రతి ఒక్కరు గుర్తించాలి.
పోలీసు వ్యవస్థ విరామం తీసుకుంటే నష్టం అపారం : ఎస్పీ ఆకే రవికృష్ణ
దేశంలో ఏ వ్యవస్థలో అయినా విశ్రాంతి తీసుకుంటే నష్టం స్వల్పం.. అదే పోలీసు వ్యవస్థ విరామం తీసుకుంటే నష్టం అపారం. పోలీసులకు ప్రజలు సహకారం అందించాల్సిన అవసరం ఉంది. పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్న యువతకు విధినిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపపడమే పోలీసు అమరవీరుల సంస్కరణ దినం నిర్వహించడం ప్రధాన ఉద్దేశం.