అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు సిద్ధం కండి
అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు సిద్ధం కండి
Published Thu, Oct 13 2016 9:57 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
కర్నూలు: పోలీసు అమరవీరుల (అక్టోబర్ 15–21 వరకు) సంస్మరణ వారోత్సవాలకు సిద్ధం కావాలని ఎస్పీ ఆకే రవికృష్ణ క్షేత్రస్థాయి పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కర్నూలు సబ్ డివిజన్ పోలీసు అధికారులతో సమావేశమై వారోత్సవాలకు సంబంధించి చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని సబ్ డివిజన్లలో పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారోత్సవాలను నిర్వహించాలన్నారు. రక్తదాన శిబిరాలు, వ్యాసరచన, పెయింటింగ్, కార్టూన్ పోటీలు నిర్వహించాలన్నారు. అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రజలందరికీ తెలిసేలా చేయాలన్నారు. పోలీసు కుటుంబాలకు, ప్రజలకు, స్కూల్ విద్యార్థులకు పోలీస్‌స్టేషన్లు, పోలీసుల ఆయుధాలు(ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్), విడి భాగాల సమాచారం తెలియజేయాలన్నారు. అమరవీరుల వారోత్సవాల బ్యానర్లను విరివిగా ఏర్పాటు చేయించాలని, సబ్ డివిజన్లు, సర్కిళ్లు, పోలీస్‌స్టేషన్లలో వారి పరిధిలో ర్యాలీ నిర్వహించి మీడియాకు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులను పోలీస్‌స్టేషన్‌లకు తీసుకువచ్చి పోలీసు ఆయుధాల గురించి అవగాహన కల్పించాలన్నారు. పోలీస్‌స్టేషన్ల వారీగా మృతి చెందిన పోలీసు కుటుంబాల సమస్యలు తెలుసుకోవాలన్నారు. పోలీసు కుటుంబాలతో వారోత్సవాల్లో ఓపెన్ హౌస్ నిర్వహించాలన్నారు. అమరవీరుల ఇళ్లకు వెళ్లి వారి సాధక బాధకాలను తెలుసుకోవాలని సూచించారు. పోలీసుల సేవలను ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమం ద్వారా తెలియపరచాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు చంద్రశేఖర్‌రెడ్డి, ఐ.వెంకటేష్, డీఎస్పీలు ఎ.జి.కృష్ణమూర్తి, డి.వి.రమణమూర్తి, జె.బాబుప్రసాద్, జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలనాధికారి అబ్దుల్ సలాం, సీఐలు మధుసూదన్‌రావు, కృష్ణయ్య, డేగల ప్రభాకర్, మహేశ్వరరెడ్డి, నాగరాజరావు, ఇస్మాయిల్, ఆర్‌ఐ జార్జి, సూపరింటెండెంట్ రంగయ్య, డీటీఓ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement