
అమర వీరుల త్యాగాలు చిరస్మరణీయం
కర్నూలు : పోలీసు అమర వీరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి.
ఎస్పీ ఆకె రవికృష్ణ
పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా బుధవారం ఎస్పీ రవికృష్ణ రక్తదానం చేశారు. పోలీసులు వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, వాటి పేర్లు, వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
కర్నూలు : పోలీసు అమర వీరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో ఓపెన్ హౌస్, మోటార్ ట్రాన్స్‌పోర్టు కార్యాలయం పక్కన రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది.
కార్యక్రమానికి ఎస్పీ రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఓపెన్ హౌస్‌లో పోలీసులు వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, వాటి పేర్లు, వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాంబు డిస్పోజల్ టీం, ఫింగర్ ప్రింట్స్, కమ్యూనికేషన్ తదితర అంశాలకు సంబంధించిన విషయాలను విద్యార్థులకు వివరించారు. శిబిరంలో ముందుగా ఎస్పీనే రక్తదానం చేసి సిబ్బందిలో స్పూర్తి నింపారు.
మొత్తం 49 మంది సిబ్బంది ఈ సందర్భంగా రక్తదానం చేశారు. అదనపు ఎస్పీ బాబురావు, ఏఆర్ అదనపు ఎస్పీ రాధాకృష్ణ, ఏఆర్ డీఎస్పీ అశోక్‌బాబు, ఆర్‌ఎస్‌ఐలు, స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లు శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఓఎస్‌డీ మనోహర్‌రావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఏజి.క్రిష్ణమూర్తి, కర్నూలు డీఎస్పీ డివి.రమణమూర్తి, హోంగార్డు డీఎస్పీ కృష్ణమోహన్, కర్నూలు పట్టణ సీఐలు, పోలీస్ సిబ్బందితో పాటు రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ జి.శ్రీనివాసులు మెడికల్ ఆఫీసర్ ముంతాజ్‌బేగం, కో-ఆర్డినేటర్ పద్మావతి, రెడ్‌క్రాస్ సొసైటీ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని సేవలందించారు.
ఏపీఎస్పీ రెండవ పటాలంలో...
పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని ఏపీఎస్పీ రెండవ పటాలంలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కమాండెంట్ విజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. 81 మంది సిబ్బంది స్వచ్ఛందంగా శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ప్రాణాలు నిలబెట్టే ఇలాంటి సేవల్లో అందరూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఎలాంటి సమస్య తలెత్తినా మేమున్నామంటూ ముందుకు వచ్చి విధులను సమర్ధవంతంగా నిర్వహించే బెటాలియన్ సిబ్బంది ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం హర్షణీయమన్నారు. పటాలం ఓఎస్‌డీ ఈవీ.రామారావు ఈ సందర్భంగా పండ్లను పంచి పెట్టారు. బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ ఎస్‌ఎం.బాషా, యూనిట్ వైద్యాధికారి బాల సారయ్య, వెంకటయ్య, యుగంధర్ పాల్గొన్నారు.