హీరోలుగా రాణిస్తున్న నర్సంపేట నియోజకవర్గ వాసులు
సినీ పరిశ్రమలో ప్రతిభతో ముందుకెళ్తున్న ముగ్గురు ..
హర్షం వ్యక్తం చేస్తున్న కుటుంబీకులు, గ్రామస్తులు
నర్సంపేట : ఆ ముగ్గురికి చిన్నప్పటి నుంచి సినిమా అంటే ప్రాణం. ఎలాగైనా సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నారు. అందుకు ఎక్కడ ఆడిషన్స్ జరిగినా వెళ్లే వారు. అలాగే, వివిధ సినిమా ఆఫీస్‌ల చుట్టూ తిరిగే వారు. చిన్న పాత్ర అయినా ఇవ్వమని కోరారు. తెలిసి వారి వద్దకు వెళ్లి తమలోని నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించే వారు. అవకాశం వచ్చినట్లు వచ్చే చేజారేది. అయినా ఏమాత్రం నిరాశపడేవారు కాదు. మళ్లీ ప్రయత్నం చేసేవారు. చివరకు అనుకున్నది సాధించారు. తమ ఆకాంక్షకు అనుగుణంగా అవకాశం రావడంతో ఆ ముగ్గురు యువకులు హీరోలుగా రాణిస్తున్నారు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారు తమప్రతిభతో ముందుకెళుతున్నారు. వారే నర్సంపేట నియోజకవర్గానికి చెందిన బూరగాని అనిల్, భూక్య సిద్ధు శ్రీఇంద్ర, బూస కుమార్. ఈ ముగ్గురు హీరోలుగా నటించిన తమ సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి.
అనిల్ నటన అద్భుతం..
బూరగాని అనిల్‌ది నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ మండల కేంద్రం. తల్లిదండ్రులు బూరగాని కొమురయ్య–రమాదేవి. అనిల్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సినిమాపై ఆసక్తి ఉండడంతో ఆ రంగం వైపు వెళ్లాడు. పలువురి వద్దకు వెళ్లి తన ప్రతిభను తెలియజేశాడు. వారికి అనిల్ నటన నచ్చడంతో అవకాశం ఇచ్చారు. దీంతో అనిల్ ‘వజ్రాలు కావాలా నాయనా’ అనే సినిమాలో మొదటిసారిగా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 2017న విడుదలైంది. ఇందులో అనిల్ అద్భుత నటనకు పలువురు ముగ్థులయ్యారు. రెండో సినిమా ‘ఇరావణ’ విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు ప్రేమతో మీ అభిరామ్, దునియా, ప్రేమకుజై, తదితర చిత్రాల్లో నటిస్తున్నట్లు అనిల్ చెప్పాడు. కాగా, టీవీషోలు అత్తారింటికి దారేది, శ్రీమంతుడు, రాజేశ్వరివిల్లాస్ కాఫీ క్లబ్, అనుపల్లవి, కలవారి కోడలు కనకమహాలక్ష్మి వంటి సీరియల్‌లో నటిస్తున్నట్లు అనిల్ తెలిపారు.
సిద్ధు..‘అనాథ’
భూక్య సిద్ధు గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగాడు. తనలో ఉన్న నటనా ప్రావీణ్యంతో సినిమా రంగంలో రాణించాలని 13 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. చివరకు అదృష్టం వరించింది. వారం రోజుల క్రితం ‘అనా«థ’ అనే సినిమాను నిర్మించి హీరోగా వెండి తెరకు పరిచమయ్యాడు. మొదటి సినిమాలోనే మంచి నటన ప్రావీణ్యం కనబర్చడంతో ఈ సినిమా పలువురిని ఆకట్టుకుంది. నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లెకు చెందిన సకృ, సరోజన దంపతుల కుమారుడు సిద్ధు. మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోగా రాణిస్తూ గోనేంద్ర ఫిలింస్ సంస్థ ద్వారా అనాథ సినిమాను తెలుగు, కన్నడంలో తీసి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం రెండో సినిమా కూడా తీస్తున్నట్లు సిద్ధు తెలిపారు.
‘రియల్’ రంగం నుంచి హీరోగా..
రియల్ ఎస్టేట్ రంగంలో రాణిసూ్తనే సినిమా హీరోగా గుర్తింపు పొందాలనే తపనతో వెండి తెరకు పరిచయమయ్యాడు నర్సంపేట నియోజకవర్గంలోని గుర్రాలగండి రాజపలి్ల గ్రామానికి చెందిన బూస కుమార్. సినిమా రంగంలోని పలువురు ప్రముఖులను కలిసినా ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. దీంతో తానే స్వయంగా ‘షాన్’ అనే సినిమాను రూపొందించాడు. ఇందులో తనే హీరోగా నటించాడు. అంతేకాకుండా నిర్మాత, దర్శకుడిగా వ్యవహరించి గత సంవత్సరం తన అదృష్టం పరీక్షించుకున్నాడు. వరంగల్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు పూర్తిగా అవగాహన ఉండడంతో ఆయా ప్రాంతాల్లో చిత్రీకరణ చేసి తన ఆలోచనలకు అనుగుణంగా సినిమా పూర్తి చేశాడు. అనంతరం విడుదల చేసి సఫలీకృతుడయ్యాడు. ప్రస్తుతం మరో సినిమా కూడా చేస్తున్నట్లు ‘సాక్షి’కి వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment