ఏడుగురు తెలంగాణ అమరుల కుటుంబాల ఎదురు చూపులు
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు రూ.పది లక్షల చొప్పున ఆర్థిక సాయమందిస్తున్న ప్రభుత్వం...హైదరాబాద్ జిల్లాలో ముగ్గురికి మాత్రమే అందజేసింది. మిగతా ఎడుగురు అమరుల కుటుంబాలకు సాయం అందలేదు. నగరంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2009 నుంచి 2013 వరకు ఉవ్వెత్తున ఎగసిన మలిదశ ఉద్యమంలో 12 మంది విద్యార్థి, యువజనులు తమ ప్రాణాలను త్యాగం చేశారు.
ముగ్గురికి ఆర్థిక సాయం..
జిల్లాలోని సికింద్రాబాద్, అడ్డగుట్టలో 2009, డిసెంబర్ 28న తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న ఇ.స్వామి, ఇదే నెల 30న సికింద్రాబాద్ అడ్డగుట్టలోని ఏసీఎస్ నగర్‌లో ఆత్మహత్య చేసుకున్న టి.వినోద్‌కుమార్, 2013, సెప్టెంబర్ 6న బేగంపేట్ రసూల్‌పురాలో ఆత్మహత్య చేసుకున్న కె.కృష్ణకాంత్ కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున రూ.30 లక్షలు అందజేసింది.
నిరీక్షణ
మిగతా ఏడుగురు అమరుల కుటుంబాలు కూడా ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఓయూలో ఆత్మహత్య చేసుకున్న అమరులు కె. వేణుగోపాల్‌రెడ్డి, ఎస్.యాదయ్య, ఎం.సాయికుమార్, డి.సంతోష్ యాదవ్, ఎస్.భరత్‌గౌడ్, జూబ్లీ బస్ స్టేషన్ వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఎం. సుధాకర్, అమీర్‌పేట్‌లోని బీకే గూడకు చెందిన సిహెచ్. కనుకయ్య కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాల్సి ఉంది.
ఇద్దరు అమరుల వివరాలు.. వారి జిల్లాలకు...
జిల్లాలో తెలంగాణ కోసం అమరులైన జాబితాను పరిశీలించిన ఉన్నతాధికారులు 2010 జులై 31 న ఓయూ లైబ్రరీ సమీపంలో ఆత్మహత్య చేసుకున్న మెదక్ జిల్లాకు చెందిన ఇషాన్‌రెడ్డి, 2013 జూన్ 15న ఓయూ లా కళాశాల సమీపంలో ఆత్మహత్య చేసుకున్న మహబుబ్‌నగర్‌కు చెందిన బి.శ్రీనివాస్‌లకు ఆర్థిక సాయానికి సంబంధించిన వివరాలను సొంత జిల్లాలకు బదిలీ చేశారు. వీరి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
తొలి దశ ఉద్యమకారుల కుటుంబాల్లోనూ ఆశలు..
మలి దశ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న అమరుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయమందించటంతో, తొలి దశ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసిన కుటుంబాల్లోనూ ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో తొలి దశలో ఉద్యమంలో భాగం గా 1969లో జరిగిన తెలంగాణ పోరులో అసువులు బాసిన మరో ఐదుగురు అమరుల కుటుంబాలు కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం కోసం జిల్లా కలెక్టర్ ద్వారా సర్కారుకు మొరపెట్టుకున్నాయి.అందులో భాగంగానే తొలి దశ ఉద్యమంలో అమరులైన ఎన్.నాగభూషణం( సనత్‌నగర్), కె.వెంకటేశ్వర్‌రావు(ముషీరాబాద్), ఎస్.నర్సింగరావు(ఆసీఫ్‌నగర్), పి.వెంకటేశం(మంగళ్ హాట్), ఆకుల నరేందర్( కవాడీగూడ)లకు చెందిన కుటుంబాలు ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నాయి.
సర్కారు సాయం...ముగ్గురికే
Published Mon, Jun 8 2015 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM
Advertisement
Advertisement