Financial supports
-
కోవిడ్‌తో తల్లితండ్రులను కోల్పోయిన చిన్నారులకు సీఎం వైఎస్ జగన్ ఆర్థిక భరోసా
-
శరణ్య.. నువ్వు డాక్టర్ కావాలమ్మా!
కాకినాడ సిటీ/గోకవరం/కాకినాడ రూరల్: తల్లిదండ్రులు చనిపోయిన వారి పిల్లలకు రూ.10లక్షల బాండ్లను అందజేసే కార్యక్రమం కాకినాడలోని కలెక్టరేట్లో బుధవారం ఉద్విగ్న వాతావరణంలో జరిగింది. ఇద్దరు బాధిత చిన్నారులకు రూ.10 లక్షల వంతున బాండ్లను కలెక్టర్ మురళీధర్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకుంటూనే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కోవిడ్ ప్రభావిత కుటుంబాల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి వెల్లడించారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన 11 ఏళ్ల చిన్నారితో పాటు గోకవరంలో సంరక్షుల వద్ద ఉంటున్న ఇద్దరు చిన్నారుల డిపాజిట్‌కు సంబంధించిన పత్రాలను కలెక్టర్ అందించారు. కోవిడ్ విపత్తు కారణంగా తల్లితండ్రులు చనిపోతే పిల్లలు అనాథలు కాకుండా రూ.10 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేసే పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారన్నారు. జిల్లాలో వెంటనే అర్హులను గుర్తించి లబ్ధి చేకూర్చుతున్నట్లు వివరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. బాధిత చిన్నారుల పేరిట జాతీయ బ్యాంకులో రూ.10 లక్షలు డిపాజిట్ చేసి బాండ్‌ను అందించనున్నట్లు వివరించారు. 25 ఏళ్లు నిండాక ఈ సొమ్ము తీసుకునేందుకు వీలుంటుందని, అప్పటి వరకు వడ్డీ మొత్తాన్ని నెలవారీగానీ, మూడు నెలలకోసారి గానీ తీసుకోవచ్చన్నారు. ఈ సొమ్ము చదువుకు, ఇతర అవసరాలకు ఉపయోగపడుతుందన్నారు. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అధిక వడ్డీ చెల్లించేలా చూడాలని ఆయన బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చిన్నారుల వైనాలను ఐసీడీఎస్ అధికారులకు తెలియజేయాలని అందరినీ కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి.రాజకుమారి, అసిస్టెంట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, ఐసీడీఎస్ పీడీ జీవీ సత్యవాణి, డీఎంహెచ్ఎం ఎన్.ప్రసన్నకుమార్, డీసీపీవో వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. నువ్వు డాక్టరువు కావాలమ్మా.. నీకెదురైంది మామూలు కష్టం కాదమ్మా..పదకొండేళ్లకే తల్లితండ్రులను కోల్పోయావు. మాయదారి కోవిడ్ ఇద్దరినీ మింగేసింది. నిన్ను ఒంటరిని చేసింది. నీలా మరొకరు బాధ పడకుండా ఉండాలంటే నువ్వు డాక్టర్ కావాలి. కాకినాడ మెడికల్ కళాశాలలో చదవాలి. అందుకే బాగా చదువుకో. నీలాంటి చిన్నారులు అనాథలు కాకూడదనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.10లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.. – శరణ్యతో జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి రెండు రోజుల్లో అమ్మానాన్నా చనిపోయారు కోలమూరుకు చెందిన పెరువల్లి రాజేష్ పెయింటర్‌గా పని చేసేవాడు. అతనికి భార్య రాణి, ఇద్దరు కుమారులు హెరిన్ (7), శశి (2) ఉన్నారు. రెండు వారాల క్రితం రాజేష్, అతని భార్య రాణి కరోనా బారిన పడ్డారు. చికిత్స పొందుతూ 15న రాజే‹Ù, 17న రాణి మృతిచెందారు. రెండు రోజుల వ్యవధిలో వీరి కుమారులు అనాథలయ్యారు. వరుసకు చిన్నాన్న, పిన్ని అయిన గోకవరానికి చెందిన పెరువల్లి కుమార్‌బాబు, మేరిల అక్కున చేర్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 10లక్షల పథకం చిన్నారులిద్దరినీ ఆదుకుంది. చిన్నారులు, గార్డియన్ల పేరుతో జాయింట్ అకౌంట్ ప్రారంభించి ఈ మొత్తాన్ని బ్యాంక్‌లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసి వడ్డీతో చిన్నారుల బాగోగులు చూడాలని సంరక్షకులను ఐసీడీఎస్ సూపర్వైజర్ ఇందిరారాణి కోరారు. శరణ్య ఇప్పుడు ఏకాకి కాదు.. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలో వడ్డి బాబ్జీ ఓ ప్రైవేట్ సంస్థలో లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇతనికి భార్య కుమారి..11 ఏళ్ల కుమారె (శరణ్య) ఉన్నారు. బాబ్జీ, కుమారిలకు కరోనా సోకింది. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 18న బాబ్జి మృతిచెందాడు. మూడు రోజుల తర్వాత కుమారి కన్నుమూసింది. శరణ్య ఏకాకిగా మిగిలింది. బాబ్జీ తల్లితండ్రులు మనమరాలి గురించి ఆందోళన చెందుతున్న తరుణంలో సీఎం ప్రవేశపెట్టిన రూ.10లక్షల డిపాజిట్ స్కీం అధికారులు వర్తింపజేశారు. గ్రామ సర్పంచ్ బెజబాడ సత్యనారాయణ చొరవతో మంత్రి కురసాల కన్నబాబు చిన్నారి గురించి తెలుసుకుని ఐసీడీఎస్ అధికారులకు తెలిపారు. సర్పంచ్ సమక్షంలో కలెక్టర్ ద్వారా రూ.10లక్షల బాండు అందుకున్న శరణ్య తాత కన్నీటిని ఆపుకోలేకపోయారు. సీఎంకు రుణపడి ఉంటామన్నారు. చదవండి: కోవిడ్ బాధితులకు కొండంత అండ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే 'వైఎస్సార్ పంటల బీమా' -
సానియా, ప్రాంజలకు ఐటీఎఫ్ ఆర్థిక సాయం
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో తక్కువ ర్యాంకుల్లో ఉన్న టెన్నిస్ క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ప్రకటించింది. జాతీయ క్రీడా సమాఖ్యల ద్వారా అర్హులైన ఆటగాళ్లకు ఈ సహాయ నిధిని అందిస్తామని చెప్పింది. సింగిల్స్‌లో 500–700 మధ్య... డబుల్స్‌లో 175–300 మధ్య ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను అర్హులుగా పేర్కొంది. ‘ఇదేం పెద్ద మొత్తం కాదు. ఒక్కో ఆటగాడికి 2000 డాలర్లు (రూ.1,51,100) లభించవచ్చు. జాతీయ సమాఖ్యలు అర్హులైన క్రీడాకారులను ఎంపిక చేసి వారికి అందజేస్తాయి’ అని ఐటీఎఫ్ ప్రకటించింది. దీని ప్రకారం 12 మంది భారత క్రీడాకారులు ఈ సహాయం పొందే వీలుంది. పురుషుల సింగిల్స్‌లో మనీశ్ కుమార్ (642 ర్యాంక్), అర్జున్ ఖడే (655)...డబుల్స్‌లో సాకేత్ మైనేని (180), విష్ణువర్ధన్ (199), అర్జున్ ఖడే (231), విజయ్ సుందర్ ప్రశాంత్ (300)... మహిళల సింగిల్స్‌లో కర్మన్‌కౌర్ (606), సౌజన్య భవిశెట్టి (613), జీల్ దేశాయ్ (650), ప్రాంజల యడ్లపల్లి (664)... డబుల్స్‌లో రుతుజా భోస్లే (196), సానియా మీర్జా (226) ఈ సహాయం అందుకోనున్నారు. తక్కువ ర్యాంకుల్లో ఉన్న 800 మంది క్రీడాకారుల్ని ఆదుకునేందుకు ఏటీపీ, డబ్ల్యూటీఏ, గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆతిథ్య దేశాలు, అగ్రశ్రేణి క్రీడాకారులు కలిసి 60 లక్షల డాలర్ల (రూ. 45 కోట్లు) సహాయనిధిని ఏర్పాటు చేశాయి. -
సర్కారు సాయం...ముగ్గురికే
ఏడుగురు తెలంగాణ అమరుల కుటుంబాల ఎదురు చూపులు సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు రూ.పది లక్షల చొప్పున ఆర్థిక సాయమందిస్తున్న ప్రభుత్వం...హైదరాబాద్ జిల్లాలో ముగ్గురికి మాత్రమే అందజేసింది. మిగతా ఎడుగురు అమరుల కుటుంబాలకు సాయం అందలేదు. నగరంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2009 నుంచి 2013 వరకు ఉవ్వెత్తున ఎగసిన మలిదశ ఉద్యమంలో 12 మంది విద్యార్థి, యువజనులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. ముగ్గురికి ఆర్థిక సాయం.. జిల్లాలోని సికింద్రాబాద్, అడ్డగుట్టలో 2009, డిసెంబర్ 28న తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న ఇ.స్వామి, ఇదే నెల 30న సికింద్రాబాద్ అడ్డగుట్టలోని ఏసీఎస్ నగర్లో ఆత్మహత్య చేసుకున్న టి.వినోద్‌కుమార్, 2013, సెప్టెంబర్ 6న బేగంపేట్ రసూల్‌పురాలో ఆత్మహత్య చేసుకున్న కె.కృష్ణకాంత్ కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున రూ.30 లక్షలు అందజేసింది. నిరీక్షణ మిగతా ఏడుగురు అమరుల కుటుంబాలు కూడా ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఓయూలో ఆత్మహత్య చేసుకున్న అమరులు కె. వేణుగోపాల్‌రెడ్డి, ఎస్.యాదయ్య, ఎం.సాయికుమార్, డి.సంతోష్ యాదవ్, ఎస్.భరత్‌గౌడ్, జూబ్లీ బస్ స్టేషన్ వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఎం. సుధాకర్, అమీర్‌పేట్‌లోని బీకే గూడకు చెందిన సిహెచ్. కనుకయ్య కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాల్సి ఉంది. ఇద్దరు అమరుల వివరాలు.. వారి జిల్లాలకు... జిల్లాలో తెలంగాణ కోసం అమరులైన జాబితాను పరిశీలించిన ఉన్నతాధికారులు 2010 జులై 31 న ఓయూ లైబ్రరీ సమీపంలో ఆత్మహత్య చేసుకున్న మెదక్ జిల్లాకు చెందిన ఇషాన్‌రెడ్డి, 2013 జూన్ 15న ఓయూ లా కళాశాల సమీపంలో ఆత్మహత్య చేసుకున్న మహబుబ్‌నగర్‌కు చెందిన బి.శ్రీనివాస్‌లకు ఆర్థిక సాయానికి సంబంధించిన వివరాలను సొంత జిల్లాలకు బదిలీ చేశారు. వీరి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. తొలి దశ ఉద్యమకారుల కుటుంబాల్లోనూ ఆశలు.. మలి దశ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న అమరుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయమందించటంతో, తొలి దశ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసిన కుటుంబాల్లోనూ ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో తొలి దశలో ఉద్యమంలో భాగం గా 1969లో జరిగిన తెలంగాణ పోరులో అసువులు బాసిన మరో ఐదుగురు అమరుల కుటుంబాలు కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం కోసం జిల్లా కలెక్టర్ ద్వారా సర్కారుకు మొరపెట్టుకున్నాయి.అందులో భాగంగానే తొలి దశ ఉద్యమంలో అమరులైన ఎన్.నాగభూషణం( సనత్‌నగర్), కె.వెంకటేశ్వర్రావు(ముషీరాబాద్), ఎస్.నర్సింగరావు(ఆసీఫ్‌నగర్), పి.వెంకటేశం(మంగళ్ హాట్), ఆకుల నరేందర్( కవాడీగూడ)లకు చెందిన కుటుంబాలు ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నాయి.