రూ. 10 లక్షల బ్యాంకు బాండుతో చిన్నారి శరణ్య
కాకినాడ సిటీ/గోకవరం/కాకినాడ రూరల్: తల్లిదండ్రులు చనిపోయిన వారి పిల్లలకు రూ.10లక్షల బాండ్లను అందజేసే కార్యక్రమం కాకినాడలోని కలెక్టరేట్‌లో బుధవారం ఉద్విగ్న వాతావరణంలో జరిగింది. ఇద్దరు బాధిత చిన్నారులకు రూ.10 లక్షల వంతున బాండ్లను కలెక్టర్ మురళీధర్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకుంటూనే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కోవిడ్ ప్రభావిత కుటుంబాల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి వెల్లడించారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన 11 ఏళ్ల చిన్నారితో పాటు గోకవరంలో సంరక్షుల వద్ద ఉంటున్న ఇద్దరు చిన్నారుల డిపాజిట్‌కు సంబంధించిన పత్రాలను కలెక్టర్ అందించారు.
కోవిడ్ విపత్తు కారణంగా తల్లితండ్రులు చనిపోతే పిల్లలు అనాథలు కాకుండా రూ.10 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేసే పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారన్నారు. జిల్లాలో వెంటనే అర్హులను గుర్తించి లబ్ధి చేకూర్చుతున్నట్లు వివరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. బాధిత చిన్నారుల పేరిట జాతీయ బ్యాంకులో రూ.10 లక్షలు డిపాజిట్ చేసి బాండ్‌ను అందించనున్నట్లు వివరించారు.
25 ఏళ్లు నిండాక ఈ సొమ్ము తీసుకునేందుకు వీలుంటుందని, అప్పటి వరకు వడ్డీ మొత్తాన్ని నెలవారీగానీ, మూడు నెలలకోసారి గానీ తీసుకోవచ్చన్నారు. ఈ సొమ్ము చదువుకు, ఇతర అవసరాలకు ఉపయోగపడుతుందన్నారు. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అధిక వడ్డీ చెల్లించేలా చూడాలని ఆయన బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చిన్నారుల వైనాలను ఐసీడీఎస్ అధికారులకు తెలియజేయాలని అందరినీ కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి.రాజకుమారి, అసిస్టెంట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, ఐసీడీఎస్ పీడీ జీవీ సత్యవాణి, డీఎంహెచ్‌ఎం ఎన్.ప్రసన్నకుమార్, డీసీపీవో వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
నువ్వు డాక్టరువు కావాలమ్మా..
నీకెదురైంది మామూలు కష్టం కాదమ్మా..పదకొండేళ్లకే తల్లితండ్రులను కోల్పోయావు. మాయదారి కోవిడ్ ఇద్దరినీ మింగేసింది. నిన్ను ఒంటరిని చేసింది. నీలా మరొకరు బాధ పడకుండా ఉండాలంటే నువ్వు డాక్టర్ కావాలి. కాకినాడ మెడికల్ కళాశాలలో చదవాలి. అందుకే బాగా చదువుకో. నీలాంటి చిన్నారులు అనాథలు కాకూడదనే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.10లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు..
– శరణ్యతో జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి
రెండు రోజుల్లో అమ్మానాన్నా చనిపోయారు
కోలమూరుకు చెందిన పెరువల్లి రాజేష్ పెయింటర్‌గా పని చేసేవాడు. అతనికి భార్య రాణి, ఇద్దరు కుమారులు హెరిన్ (7), శశి (2) ఉన్నారు. రెండు వారాల క్రితం రాజేష్, అతని భార్య రాణి కరోనా బారిన పడ్డారు. చికిత్స పొందుతూ 15న రాజే‹Ù, 17న రాణి మృతిచెందారు. రెండు రోజుల వ్యవధిలో వీరి కుమారులు అనాథలయ్యారు. వరుసకు చిన్నాన్న, పిన్ని అయిన గోకవరానికి చెందిన పెరువల్లి కుమార్‌బాబు, మేరిల అక్కున చేర్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 10లక్షల పథకం చిన్నారులిద్దరినీ ఆదుకుంది. చిన్నారులు, గార్డియన్ల పేరుతో జాయింట్ అకౌంట్ ప్రారంభించి ఈ మొత్తాన్ని బ్యాంక్‌లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసి వడ్డీతో చిన్నారుల బాగోగులు చూడాలని సంరక్షకులను ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఇందిరారాణి కోరారు.
శరణ్య ఇప్పుడు ఏకాకి కాదు..
కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలో వడ్డి బాబ్జీ ఓ ప్రైవేట్ సంస్థలో లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇతనికి భార్య కుమారి..11 ఏళ్ల కుమారె (శరణ్య) ఉన్నారు. బాబ్జీ, కుమారిలకు కరోనా సోకింది. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 18న బాబ్జి మృతిచెందాడు. మూడు రోజుల తర్వాత కుమారి కన్నుమూసింది. శరణ్య ఏకాకిగా మిగిలింది. బాబ్జీ తల్లితండ్రులు మనమరాలి గురించి ఆందోళన చెందుతున్న తరుణంలో సీఎం ప్రవేశపెట్టిన రూ.10లక్షల డిపాజిట్ స్కీం అధికారులు వర్తింపజేశారు. గ్రామ సర్పంచ్ బెజబాడ సత్యనారాయణ చొరవతో మంత్రి కురసాల కన్నబాబు చిన్నారి గురించి తెలుసుకుని ఐసీడీఎస్ అధికారులకు తెలిపారు. సర్పంచ్ సమక్షంలో కలెక్టర్ ద్వారా రూ.10లక్షల బాండు అందుకున్న శరణ్య తాత కన్నీటిని ఆపుకోలేకపోయారు. సీఎంకు రుణపడి ఉంటామన్నారు.
చదవండి: కోవిడ్ బాధితులకు కొండంత అండ
రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే 'వైఎస్సార్ పంటల బీమా'
Comments
Please login to add a commentAdd a comment