
తెలంగాణ సాధనలో జిల్లా ప్రజలది ప్రత్యేకపాత్ర
కలెక్టర్ వీరబ్రహ్మయ్య
కరీంనగర్‌కల్చరల్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో జిల్లా ప్రజలది ప్రత్యేక పాత్ర అని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య అన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా వారం రోజుల పాటు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను సోమవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అరవై ఏళ్ల కల సాకారమైందన్నారు. ఉద్యమంలో అశువులు బాసిన అమరులకు పేరుపేరున నివాళులర్పించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే బంగారు తెలంగాణ ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, మెప్మా పీడీ విజయలక్ష్మి, డీఈవో లింగయ్య, డీపీఆర్వో ప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు
శ్వేత, శాతవాహన కళాజ్యోతి కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ జానపద నృత్యాలు, రేణికుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, జేఎన్‌ఎంహెచ్ స్కూల్, అల్ఫోర్స్ హైస్కూల్ విద్యార్థుల నృత్యాలు, ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
సందర్భం లేని స్వాగత నృత్యం
కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ప్రదర్శించిన స్వాగత నృత్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. శాతవాహన కళోత్సవాల కోసం ఆరేడేళ్ల క్రితం సినీగీతా రచయిత గుండేటి రమేశ్ రాసి స్వరపరిచిన గీతాన్ని ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్రాన్ని స్వాగతిస్తూ సంబురాలు చేస్తే జిల్లా యంత్రాంగం మాత్రం శాతవాహన కళోత్సవాల స్వాగత నృత్యాన్ని ప్రదర్శించడం విమర్శలకు దారితీసింది.