జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేయగా, ఐదుగురు భారత సైనికులు వీరమరణం పొందారు. వీరంతా ఉత్తరాఖండ్‌కు చెందిన వారు. ఈ ఘటన సైనికుల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ముఖ్యంగా రెండు నెలల వ్యవధిలో దేశం కోసం ఇద్దరు కుమారులు అమరులైన కుటుంబం అనుభవిస్తున్న వేదన మాటలకు అందనిది.
ఉత్తరాఖండ్‌లోని టెహ్రీ పరిధిలోగల డాగర్ గ్రామానికి చెందిన ఒక కుటుంబంలోని ఇద్దరు కుమారులు రెండు నెలల వ్యవధిలో దేశం కోసం ప్రాణాలర్పించారు. వీరిలో ఒకరైన ఆదర్శ్ నేగి గత సోమవారం జమ్ముకశ్మీర్‌లోని కథువాలో మరణించగా, మరో కుమారుడు మేజర్ ప్రణయ్ నేగి గత ఏప్రిల్‌లో లేహ్‌లో వీరమరణం పొందారు. కుమారులిద్దరూ అసువులుబాయడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
కథువాలో వీరమరణం పొందిన సైనికుడు ఆదర్శ్ నేగి 2018లో గర్వాల్ రైఫిల్స్‌లో చేరాడు. తాజాగా ఆదర్శ్ తల్లిదండ్రులు అతనికి పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఒక కుమారుని బలిదానం నుండి ఆ కుటుంబం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మరో కుమారుడు మరణించడాన్ని వారు దిగమింగుకోలేకపోతున్నారు. సీఎం పుష్కర ధామి అమరవీరుల కుటుంబాన్ని ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment