అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సాయం
అమరుల త్యాగాల వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, అందువల్ల వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. 459 మంది అమరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున సాయం అందిస్తామని, ఇందుకోసం బడ్జెట్లో వందకోట్ల కేటాయింపు చేస్తామని ఆయన అన్నారు. ఇంకా బడ్జెట్ ప్రసంగంలో ఆయన ఏం చెప్పారంటే.. ''దుష్టశక్తుల ఆటలు కట్టించే నేర్పు, ఓర్పు మాకున్నాయి. ఉద్యమస్ఫూర్తితోనే బంగారు తెలంగాణ సాధించే ప్రయత్నం చేయాలి. తెలంగాణ సమాజాన్ని ప్రగతిపథంలో నడిపించడానికి ఈ బడ్జెట్ తోడ్పడుతుంది. సమస్యల పరిష్కారం దిశగా ఇది కృషిచేస్తుంది.
గత ప్రభుత్వాల తప్పుడు విధానాల వల్ల విచ్ఛిన్నమైన తెలంగాణను మళ్లీ తన కాళ్ల మీద నిలబెట్టడానికి సహకరిస్తుంది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకెళ్తాం. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన సమాచారంతో పథకాల లబ్ధి అందరికీ అందేలా చూస్తాం'' అని తెలిపారు.