సాక్షి, ఖమ్మం: ‘1969 నుంచి ప్రత్యేక రాష్ట్రం సిద్ధించే వరకు ఎందరో వీరుల త్యాగఫలం తెలంగాణ.. రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది అసువులుబాశారు. వారి కుటుంబాలకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రతి అమరుడి కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. అమరవీరులకుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం.. వ్యవసాయాధారిత కుటుంబాలకు వ్యవసాయ భూమి, అమర వీరుల పిల్లలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తాం.’ అని ఎక్త్సెజ్ శాఖ మంత్రి టి.పద్మారావు ప్రకటించారు.
నవ తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం తొలి స్వాతంత్య్ర వేడుకలు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ నినాదాలు, గీతాలు, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా నృత్యాలు, ప్రదర్శనలతో గ్రౌండ్ మార్మోగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి టి.పద్మారావుగౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అమరుడైన కరీంనగర్‌కు చెందిన పోలీస్ కిష్టయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతోనే అమర వీరులకు కుటుంబాలను ఆదుకునే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా పోరాడిన ఉద్యమకారులపై సీమాంధ్ర సర్కారు అనేక అక్రమ కేసులు బనాయించిందని, వీటన్నింటినీ ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
పంట చేతికి రాక, సాగుకు చేసిన అప్పులు తీర్చలేక..కుటుంబం గడవక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి రుణ భారాన్ని పంచుకోవడాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.లక్ష వరకు రుణ మాఫీ చేస్తుందని హామీ ఇచ్చారు. గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని గిరిజన సోదరులు ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించి వారికి విద్య, ఉద్యోగావకాశాలను మెరుగు పరచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, సకలజనుల సమ్మె చేసిన ఉద్యోగుల సంక్షేమం తమ బాధ్యత అని, అందుకే ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రత్యేక తెలంగాణ ఇంక్రిమెంట్ ప్రకటించామని చెప్పారు.
అద్భుత పథకంకళ్యాణలక్ష్మి ..
పేద దళిత, గిరిజన ఆడపిల్లల వివాహానికి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలోంచి పుట్టిన పథకమే కల్యాణ లక్ష్మి అని మంత్రి పద్మారావు అన్నారు. దేశ చరిత్రలోనే ఇలాంటి పథకం లేదన్నారు. పేద విద్యార్థులు వృత్తి, ఉన్నత విద్యలనభ్యసించేందుకు వీలుగా ప్రభుత్వం ఫాస్ట్ పథకం ప్రవేశపెట్టిందన్నారు. గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే ఆర్‌ఎంపీ, పీఎంపీలకు ప్రభుత్వం సర్టిఫికెట్లు ఇచ్చి వారికి గుర్తింపునిస్తుందని పేర్కొన్నారు.
దళిత బిడ్డలు పూర్ణ, ఆనంద్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ రాష్ట్ర కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటారని ప్రశంసించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించే ఉద్దేశంతోనే సమగ్ర సర్వే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. సర్వే రోజున ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ప్రకటించారని, ఆ రోజు అందరూ ఇళ్లలోనే ఉండాలని కోరారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు తెలిపారు.
గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తాం..
వచ్చే ఏడాది జూలైలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలో రూ.18.26 కోట్లతో 255 పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లాలోని ఆరు పురపాలక సంఘాల్లో రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేయనుందన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల వరుసగా జరిగిన సార్వత్రిక, మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగిలే జిల్లా అధికారులు, పోలీసులు కృషి చేశారని ప్రశంసించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి, ఎస్పీ ఏవీ.రంగనాథ్, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, బాణోతు మదన్‌లాల్, ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జాయిల్ కలెక్టర్ సురేంద్రమోహన్, పలు పార్టీల నేతలు పాల్గొన్నారు.
అమరుల కుటుంబాలను ఆదుకుంటాం
Published Sat, Aug 16 2014 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 11:55 AM
Advertisement
Advertisement