కమలా హారిస్ పూర్వీకుల గ్రామం తమిళనాడులోని మన్నార్‌గుడి జిల్లా తులసేంద్రపురంలో సందడి నెలకొంది. మంగళవారం స్థానిక ధర్మ శాస్త శ్రీ కేశవ పెరుమాళ్ ఆలయంలో జరిగిన అభిషేకం, అర్చన కార్యక్రమాల్లో అమెరికా, యూకేల నుంచి వచి్చన ముగ్గురు మహిళా అభిమానులు పాల్గొనడం విశేషం. వీరిని చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీరిలో ఒకరు అమెరికాలోని లాస్‌వెగాస్ నుంచి వచ్చినట్లు తెలిపారు.
కమలా హారిస్ గెలవాలని కోరుకుంటున్నామన్నారు. ఈ ఆలయ దేవత కమల తాత గోపాలన్ కుటుంబం కుల దైవమని ఆలయ పూజారి సెంథిల్ కుమార్ తెలిపారు. గోపాలన్ కుటుంబ సభ్యులు గతంలో ఆలయానికి రూ.లక్ష విరాళమిచ్చారంటూ అక్కడి శిలా ఫలకంపైన పేర్లను చూపించారు. 2014లో కమలా హారిస్ పేరిట జరిగిన కుంభాభిషేకం కోసం రూ.5 వేలు ఇచ్చారన్నారు.
గోపాలన్ కుటుంబ సభ్యులెవరూ ప్రస్తుతం గ్రామంలో ఉండటం లేదన్నారు. గోపాలన్ బ్రిటిష్ ప్రభుత్వంలో అధికారిగా పనిచేశారు. ఆయన కుమార్తె శ్యామలే కమల తల్లి. 2021లో కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలయ్యారు. ఆ సమయంలో కమల కోసం ఆమె పిన్ని, శ్యామల చెల్లెలు చిట్టి ఇదే ఆలయంలో పూజలు చేశారని పూజారి సెంథిల్ కుమార్ చెప్పారు. అమెరికా అధ్యక్షురాలిగా కమల గెలిస్తే ఊళ్లో అన్నదానం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్థానిక కౌన్సిలర్ అరుల్ మోళి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment